Digital Inheritance: చిన్ననాటి స్నేహితులో, బంధువులో, మనకు బాగా పరిచయం ఉన్నవారో మరణిస్తే తెలిసిపోతుంది. కానీ కేవలం వర్చువల్‌గానే అనుబంధం గలవారికి, విదేశాల్లో ఎక్కడో ఉన్నవారికి ఈ సంగతి తెలియకపోతే? పాత పోస్ట్ మీద కామెంట్ చేయొచ్చు. లేదూ అనుచిత అంశాలకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయొచ్చు. మరణించినవారి వ్యక్తిగత వివరాలను హ్యాకర్లు దొంగిలించి అక్రమంగా వాడుకోవచ్చు. ఇలాంటి సమయాల్లో మరణించినవారి ఖాతాలను డిలీట్ చేయటానికి వీలుంటుంది. కావాలంటే వాటిని 'మెమరైజ్' చేసి జ్ఞాపకాలుగా పదిల పరచుకోవచ్చు. ఆత్మీయులు మరణించిన తర్వాత వారి దస్తావేజుల మాదిరిగానే సామాజిక మాధ్యమాల నిర్వహణ అత్యవసరం. దీన్నే డిజిటల్ వారసత్వమని అంటారు.
అకౌంట్‌ను డిలీట్ చేయటానికి ముందు ఆయా సామాజిక మాధ్యమాల నియమ నిబంధనలను ఒకసారి పరిశీలించాలి. మెమరైజ్ చేయటానికి ఆయా సైట్లు వేర్వేరు విధానాలను పాటిస్తుంటాయి. ఇందుకోసం ముందుగా మరణించినవారి ప్రొఫైల్ లింక్, ఐడీ పత్రాలు, మరణ ధ్రువీకరణ పత్రం, వారితో మన సంబంధాన్ని తెలిపే ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.
ట్విట్టర్, పింట్రెస్ట్, లింక్డ్‌ఇన్
మృతుల ట్విట్టర్, పింట్రెస్ట్, లింక్డ్‌ఇన్ ఖాతాలను అలాగే కొనసాగించటానికి, లేదా డిలీట్ చేయటానికి అవకాశాలు ఉన్నాయి. పింట్రెస్ట్‌లోనైతే కుటుంబ సభ్యులు గానీ ఆస్తి హక్కు ప్రతినిధి గానీ ఖాతాను మూసేయొచ్చు. ట్విటర్‌లోనైతే మరణించినవారి వారసులు లేదా దగ్గరి బంధువులు ఖాతాను ఆపేయొచ్చు. ఇందుకోసం మరణ ధ్రువీకరణ పత్రం నకలుతో పాటు మరణించినవారి గుర్తింపు పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. లింక్డ్‌ఇన్‌లోనైతే చివరిసారి పనిచేసిన కంపెనీ పేరు కూడా పేర్కొనాల్సి ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్
మృతుల దగ్గరి కుటుంబ సభ్యులు గానీ అధికారిక వారసులు గానీ ఫ్రొఫైల్‌ను తొలగించొచ్చు. ఖాతాను మెమరైజ్ చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మృతుల మరణ ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. అలాగే మరణించినవారికి తాము నిజమైన ప్రతినిధులమని ప్రమాణం చేయాల్సి ఉంటుంది.