రికార్డు స్థాయిలో యూజర్లు లేరు.. ఇతర మెసెంజర్లకు పోటీ కాదు.. అయినా ఇప్పుడు ఎక్కువ మంది నోట వినిపిస్తున్న మాట 'సిగ్నల్'. అందుకు కారణం ఒక్కటే. 'ప్రైవసీ..' యూజర్ల ప్రైవసీకే అధిక ప్రాధాన్యమిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వినియోగదారుల డేటాని ఏ రకంగానూ యాక్సెస్ చేసేందుకు వీలు లేకుండా పూర్తి ఎన్‌క్రిప్షన్ మోడ్‌లో ఛాట్ కమ్యూనికేషన్‌ని సాగిస్తోంది. ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీతో చక్కని ప్రైవసీ ఫీచర్లను అందిస్తున్న సిగ్నల్‌లోని చిట్కాల సంగతులేంటో తెలుసుకుందాం. ఒకవేళ మీరు ఇప్పుడిప్పుడే 'సిగ్నల్' వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లయితే వీటిని ప్రయత్నించి చూడండి.
మెసేజ్‌లు మాయం
సిగ్నల్ సంభాషణల్ని సురక్షితంగా ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా మాయం అయ్యేలా చేయొచ్చు. దీంట్లోని ప్రత్యేక ప్రైవసీ ఆప్షన్ కూడా ఇదే. దీన్ని ఎనేబుల్ చేసేందుకు ఏదైనా కాంటాక్ట్‌ని ఓపెన్ చేయండి. పై భాగంలో కుడివైపు కనిపించే మూడు చుక్కల ఆప్షన్‌ని సెలెక్ట్ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్ మెనూలోని 'డిసప్పియరింగ్ మెసేజస్'ఆప్షన్‌ని తాకగానే.. నిర్ణీత సమయాలతో కూడిన మెనూ వస్తుంది. 5 సెకన్లు, 10 సెకన్లు.. రెండింటిలో మీకు తగిన సమయాన్ని సెలెక్ట్ చేయాలి. 5 సెకన్లు ఎంచుకుంటే చూసిన వెంటనే సంభాషణలు మాయం అయిపోతుంటాయి.
ఒక్కసారే చూసేలా..
చూసిన వెంటనే మెసేజ్‌లు ఎలా ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతున్నాయో.. అదే మాదిరిగా పంపిన ఇమేజ్‌లు కూడా చూసిన మరుక్షణం తొలగిపోతే. అందుకు సిగ్నల్‌లో ఓ ట్రిక్ ఉంది. దానికి ఏం చేయాలంటే.. పంపుదామనుకునే ఫొటోని సెలెక్ట్ చేసుకున్నాక, కింది భాగంలో ఎడమవైపు కనిపించే 'ఇన్ఫైనైట్ ఐకాన్'ట్యాప్ చేయండి. దీంతో అది ‘1ఎక్స్’గా మారుతుంది. అప్పుడు ఇమేజ్‌ని పంపాలి. దీంతో ఫొటోని రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఒక్కసారి ఫొటోని ఓపెన్ చేసి చూశాక ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది.
మీకు మీరే పంపుకోవచ్చు
ఇప్పటికే మీరు వాట్సాప్ వాడుతున్నట్లయితే.. ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని వాట్సాప్‌లోనే నోట్ చేసుకునేందుకు ఏం చేస్తున్నారు? వాడుతున్న మీ నెంబర్‌తోనే గ్రూపు క్రియేట్ చేసుకుంటారు. దాంట్లోనే షేర్ చేస్తుంటారు. ఇంత పెద్ద తతంగం సిగ్నల్ మెసెంజర్‌లో అక్కర్లేదు. ఎందుకంటే.. నోట్స్ రాసుకునేందుకు'నోట్ టూ సెల్ఫ్'ఆప్షన్ ఉంది. మొదటిసారి మీరు నోట్స్ రాసుకుందాం అనుకున్నప్పుడు కాంటాక్ట్ సెర్చ్‌లో 'నోట్ టూ సెల్ఫ్' ఆప్షన్‌ని వెతకాలి. తర్వాత సెలెక్ట్ చేసి నోట్స్ రాసుకుని సెండ్ చేయొచ్చు.