సాధారణంగా మనం వాడే మొబైల్స్‌లో, ల్యాప్‌టాప్‌లలో ముందుగా ప్రైవసీ ఉండేలా చూసుకుంటాం. ఉదాహరణకు మన పర్సనల్ వాట్సాప్ చాటింగ్‌లు, ఫొటోలు, వీడియోలు వంటి వాటికి లాక్‌లు పెట్టుకుంటాం. కొన్ని సార్లు సెర్చ్ ఇంజన్లలో వెతికే వివిధ రకాల సమాచారం కూడా డివైజ్‌లో సేవ్ అవ్వకూడదని అనుకుంటాము. అలా సేవ్ కాకుడదు అనుకుంటే వీటికి కొన్ని సెట్టింగ్స్ కూడా ఉంటాయి. కాకపోతే దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. అయితే థర్డ్ పార్టీ సర్వర్లు కూడా వీటిని ట్రేస్ చేస్తున్నాయన్న విషయం బహుశా టెక్ నిపుణులకు తప్ప సాధారణమైన డివైజ్ యూజర్లకు తెలియకపోవచ్చు. ఇలా మనం దేని కోసం అన్వేషించినా కొన్ని సార్లు మన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే పలు థర్డ్ పార్టీ సర్వర్లు మనల్ని ఇరుకున పడేసేలా చేస్తాయి. వాటినుంచి ఎలా బయట పడాలో తెలియక అలానే ఉండిపోతుంటారు.. టెక్నాలజీ గురించి అంతగా తెలియనివాళ్లు. మరి ఈ కింది సూచనలను పాటిస్తే ఇటువంటి వాటికి చెక్ పెట్టొచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు.
అందరిలాగే ప్రైవసీ కోసం మీరూ గుగల్ను కాదని క్రోమ్‌లో ఉండే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేస్తున్నారా.. వాస్తవానికి అది కూడా మన బ్రౌజింగ్ హిస్టరీని సేవ్ చేసుకొని మనకే ముప్పు తెస్తుందనే విషయం మీకు తెలుసా..? అయితే మీరు ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ఐఎస్పీ)తో పాటు ఇతర థర్డ్-పార్టీలు కూడా మీ ఆన్లైన్ యాక్టివిటీని ట్రాక్ చేస్తాయట. అంతేగాక మీరు మీ ఫోన్‌ను ఇతరులకు ఇచ్చినప్పుడు క్రోమ్‌లోని ఈ ప్రైవేట్ మోడ్‌లో మనం వీక్షించిన వాటిని వారు సులువుగా కనిపెట్టేస్తారు. మరి మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీని ఎలా చెక్ చేసుకోవాలి అలాగే దానిని ఎలా డిలీట్ చేయాలి.. దీంతో మన ప్రైవసీని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం..
బ్రౌజింగ్ హిస్టరీ ఇన్కాగ్నిటోమోడ్లో ఎలా సేవ్ అవుతుంది?
సాధారణంగా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజ్ చేసినప్పుడు, సెర్చ్ చేసిన వెబ్సైట్లను సేవ్ చేయదు. బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్ లేదా ఇతర సైట్ల సమాచారం దీంట్లో సేవ్ అవ్వదు. అయితే, ఈ మోడ్‌ని ఉపయోగించడం వల్ల వ్యక్తికి ప్రైవసీ ఉంటుందా అంటే చెప్పలేము. ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే కేవలం సెర్చ్ ఇంజన్ మాత్రమే మనం వెతికే సైట్లను సేవ్ చేయదు. దీంతో పాటుగా డివైజ్‌లో అంతర్గతంగా ఉండే థర్డ్ పార్టీ సర్వర్లూ మన ఆన్లైన్ ఆక్టివిటీని పర్యవేక్షిస్తుంటాయట. మీరు గూగుల్, మోజిల్లా ఫైర్ఫాక్స్ వంటి సెర్చ్ ఇంజన్లతో పాటు క్రోమ్ ఇన్‌కాగ్నిటో మోడ్‌లో వెతికే ప్రతి కంటెంట్‌ను ఐఎస్పీ సేకరించి సేవ్ చేస్తుంది.
ఇంకా, కొన్ని వెబ్సైట్లు తమ సైట్లోకి ప్రవేశించడానికి మన డివైజ్ ఐపీ అడ్రస్‌ను కూడా ట్రాక్ చేస్తుంది. దీంతో మన బ్రౌజింగ్ హిస్టరీ సెర్చ్ ఇంజన్ సేవ్ చేసినా చేయకపోయినా సరే మన వ్యక్తిగత గోప్యతకు బంగం కలుగుతుంది. అలా కాకుండా, మీరు ప్రైవేట్ బ్రౌజర్‌ను ఉపయోగించినప్పటికీ, మీ డివైజ్‌లోని డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్) క్యాచీలో బ్రౌజింగ్ హిస్టరీ సేవ్ అవుతుంది. మరి అదెలా అంటే..
- మీరు కొత్త వెబ్‌సైట్‌ను క్లిక్ చేసే ప్రతిసారీ, మీరు తప్పక దాని పేరును మీ బ్రౌజర్లో టైప్ చేస్తారు.
- మనం టైప్ చేసిన డొమైన్ పేరు ఐపీ చిరునామా రిక్వెస్ట్‌ను మీ బ్రౌజర్ డీఎన్ఎస్ సర్వర్‌కు పంపుతుంది.
- తర్వాత డీఎన్ఎస్ మీ డివైజ్‌లో వెబ్సైట్ వివరాలను లోకల్‌గా సేవ్ చేసుకుంటుంది. ఇది గతంలో వెతికిన సైట్‌ని వేగంగా యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది. ఈ తాత్కాలిక డీఎన్ఎస్ రికార్డును డీఎన్ఎస్ క్యాచీ అంటారు.
- మీరు సాధారణ సెర్చ్ ఇంజన్‌తో పాటు ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేసిన వెబ్సైట్ల పేర్లతో పాటు వాటి ఐపీ అడ్రస్‌లను కూడా డీఎన్ఎస్ క్యాచీ సేవ్ చేసుకుంటుంది.
- కాగా, ఈ డీఎన్ఎస్ క్యాచీ మన డివైజ్‌లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి మీ కంప్యూటర్ డివైజ్‌ను ఉపయోగించే ఎవరైనా కొన్ని లైన్ కమాండ్స్ సాయంతో మనం సెర్చ్ చేసిన కంటెంట్ లేదా వెబ్సైట్లను సులువుగా చూడగలరు.
అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఇన్‌కాగ్నిటో బ్రౌజర్ అనేది అత్యంత సురక్షితమైనది అలాగే ప్రైవసీని మెయిన్టేన్ చేస్తుంది అనేది అవాస్తవం. దీని నుంచి బయటకు రావాలి. ఎప్పుడైతే మీ డీఎన్ఎస్ క్యాచీతో పాటు ఇతర వెబ్సైట్లలో స్టోర్ అయ్యే బ్రౌజింగ్ హిస్టరీని పూర్తిగా డిలీట్ చేసినప్పుడే మనకు ప్రైవసీ లభిస్తుంది.
పీసీ(పర్సనల్ కంప్యూటర్)లో ఇన్కాగ్నిటోమోడ్ హిస్టరీని ఎలా చూడాలి?
మీ పీసీ విండోస్‌లో, మీ ఇన్‌కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ హిస్టరీను డీఎన్ఎస్ క్యాచీని చెక్ చేయడం చాలా సులభం. అదెలా అంటే..!
- రన్ కమాండ్ విండోను ప్రారంభించడానికి 'Windows+R' నొక్కాలి.
- డైలాగ్ బాక్స్‌లో 'cmd' అని టైప్ చేసి, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్‌తో కమాండ్ ప్రాంప్ట్‌ను ప్రారంభించడానికి 'Ctrl + Shift + Enter' నొక్కాలి.
- కమాండ్ ప్రాంప్ట్ విండోలో, 'ipconfig/displaydn' అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి.
- అప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌తో పాటు సాధారణ మోడ్‌లో రీసెంట్గా సెర్చ్ చేసిన వెబ్సైట్లు వాటి ఐపీ అడ్రస్‌లతో సహా కనిపిస్తాయి.
ఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్‌లో ఇన్కాగ్నిటోబ్రౌజింగ్ హిస్టరీని ఎలా చూడాలి?
ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ హిస్టరీని ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో చూడటానికి ఎటువంటి ప్రామాణికమైన ప్రాసెస్ అందుబాటులో లేదు. అయితే, మీరు బ్రౌజింగ్ హిస్టరీని యాక్సెస్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది. వీటికోసం ఫ్యామిలీటైమ్, కిడ్స్గార్డ్, హోవర్వాచ్ అనే యాప్‌లతో పాటుగా మరిన్ని ఇతర యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మన డివైజ్‌లోని ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ హిస్టరీని తేలిగ్గా యాక్సెస్ చేయడానికి సహాయపడతాయి. ఈ యాప్‌లు మీ ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ హిస్టరీని కేవలం చూడటానికి మాత్రమే అవకాశాన్ని కల్పిస్తాయి.. తప్ప వాటిని డిలీట్ చేసే అవకాశం ఉండదు.
పీసీలో ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ హిస్టరీని ఇలా డిలీట్ చేయండి..!
- రన్ కమాండ్ విండోను ప్రారంభించడానికి 'Windows + R' నొక్కాలి.
- డైలాగ్ బాక్స్‌లో 'cmd' అని టైప్ చేసి, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్‌తో కమాండ్ ప్రాంప్ట్ తెరవడానికి 'Ctrl + Shift + Enter' నొక్కాలి.
- కమాండ్ ప్రాంప్ట్ విండోలో, 'ipconfig/flushdns' అని టైప్ చేసి, ఎంటర్ బటన్‌ను నొక్కాలి.
ఇది మీ డీఎన్ఎస్ క్యాచీని డిలీట్ చేస్తుంది. అలాగే రీసెంట్గా సెర్చ్ చేసిన వివరాలను పూర్తిగా తొలగిస్తుంది.