తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Data Leak ICMR : దేశ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్.. 81 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు హ్యాక్​ - భారతీయల వ్యక్తిగత డేటా లీక్

Data Leak ICMR : దేశ చరిత్రలోనే అతిపెద్ద డేటాలీక్‌గా భావిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 81 కోట్ల మందికిపైగా భారతీయుల సమాచారం లీక్​ అయ్యింది. ఆధార్‌, పాస్‌పోర్టు వివరాలతో సహా డార్క్‌వెబ్‌కు ఎక్కింది. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్రం తగు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Data Leak ICMR
Data Leak ICMR

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 2:01 PM IST

Data Leak ICMR : దేశంలోని దాదాపు 81.5 కోట్ల మంది పౌరులకు చెందిన సున్నితమైన డేటా ఇప్పుడు డార్క్‌వెబ్‌లో చక్కర్లు కొడుతోంది. దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద డేటా లీక్‌ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొవిడ్‌ పరీక్షల సమయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్(ఐసీఎంఆర్​) సేకరించిన డేటాను దొంగిలించారు. కచ్చితంగా ఇది ఎక్కడి నుంచి లీకైందనే విషయం తెలియలేదు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. 'Pwn0001' అనే హ్యాకర్‌ ఈ డేటాను అందుబాటులోకి తెచ్చాడు. అతడు ప్రదర్శించిన డేటా ఆధారంగా.. వీటిల్లో ఆధార్‌ కార్డ్‌, పాస్‌పోర్టుల సమాచారం, పేర్లు, ఫోన్‌ నంబర్లు, తాత్కాలిక, శాశ్వత చిరునామాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని ICMR కొవిడ్‌ పరీక్షల సమయంలో సేకరించిందని హ్యాకర్‌ చెబుతున్నాడు.

అక్టోబర్‌ 9వ తేదీన ఈ డేటా చౌర్యం తొలిసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్‌ సంస్థ ఈ డేటా లీక్​ను గుర్తించింది. Pwn0001 అనే వ్యక్తి పలు వేదికలపై తన వద్ద 81.5 కోట్ల మంది డేటా ఉందని.. వీటిల్లో భారతీయుల ఆధార్‌-పాస్‌పోర్టు సమాచారం ఉందని అంటున్నాడు. అందుకు సంబంధించిన లక్ష ఫైల్స్‌ అతడి వద్ద ఉన్నట్లు సైబర్​ నిపుణులు గుర్తించారు. వీటిల్లో వాస్తవాలను గుర్తించేందుకు కొన్నింటిని ఆధార్‌ వెరిఫికేషన్‌ ద్వారా చెక్‌ చేశారు. అదంతా నిజమైన డేటానే అని నిర్ధరించుకున్నారు.

ఈ లీకేజీపై 'ది కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా' (సీఈఆర్‌టీ-ఐఎన్‌) తక్షణమే ఐసీఎంఆర్‌ను అప్రమత్తం చేసింది. కొవిడ్‌ పరీక్షల సమయంలో సేకరించిన డేటా వైద్య ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ల వద్ద పడి ఉందని.. దీంతో ఎక్కడి నుంచి ఈ డేటా లీకైందనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేంద్ర ఐటీ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు. గతేడాది డిసెంబర్‌లో ఎయిమ్స్‌ దిల్లీలో కూడా కొన్ని కంప్యూటర్లను హ్యాకర్లు అధీనంలోకి తీసుకొని దాదాపు రూ.200 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details