డ్రైవర్ లేని రోబోటిక్ కార్లు అమెరికా వీధుల్లో రయ్‌మని దూసుకెళ్తున్నాయి. డ్రైవింగ్ సీటులో వ్యక్తి లేకుండానే.. అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో 2 కంపెనీలకు చెందిన కార్లు టాక్సీ సేవలు అందిస్తున్నాయి. జనరల్ మోటార్స్‌కు చెందిన "క్రూయిజ్".. గూగుల్‌కు చెందిన "వేమో" కంపెనీలు తమ సేవలను విస్తరించేందుకు ట్రాన్స్‌పోర్ట్ రెగ్యులేటరీ ఆమోదం కోసం వేచిచూస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంస్థలు రెగ్యులేటరీ ఆమోదం పొందితే శాన్‌ఫ్రాన్సిస్కో నగర ప్రజలు డ్రైవర్ లేని కార్లలో తమ ప్రయాణాలను సాగించే అవకాశం ఉంది. గతేడాది జూన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని తక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో క్రూయిజ్ సంస్థ ప్రయాణికులకు తక్కువ ధరకే సర్వీసులను అందిస్తోంది. మరోవైపు నగరంలోని విశాలమైన రోడ్లపై వేమో సంస్థ ఉచితంగా సేవలు అందిస్తోంది. ఈ వేమో రోబోటిక్ కార్ల తయారీ కోసం గూగుల్ సంస్థ గత 14 ఏళ్లుగా కృషి చేస్తోంది.
శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో తమ రోబోటిక్ వాహనాలను గంటకు 40 కిలోమీటర్ల నుంచి 88 కిలోమీటర్ల వేగంతో పరీక్షించడానికి అనుమతి కోసం ఇటీవల క్రూయిజ్ సంస్థ దరఖాస్తు చేసింది. అమెరికాలోనే రెండో అతిపెద్ద నగరమైన లాస్‌ఏంజెల్స్‌లో డ్రైవర్‌లెస్ వాహనాలను వేమో సంస్థ పరీక్షిస్తోంది. తాము ఇంకా ఈ వాహనాల పనితీరుపై పనిచేయాల్సి ఉందని క్రూయిజ్ సంస్థ సీఈఓ తెలిపారు. కాలానుగుణంగా ఈ కార్ల పనితీరు మెరుగవుతుందని ప్రయాణికుల భద్రత కూడా పెరుగుతుందని వెల్లడించారు. ఫీనిక్స్ నగరంలో తాము నడిపిన డ్రైవర్ లెస్ కార్ల అనుభవంతో మరింత మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వేమో సంస్థ తెలిపింది. రోడ్లపై ట్రాఫిక్‌ను తీవ్రంగా పరిగణిస్తామని అదే సమయంలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. యాక్సిడెంట్లు లేకుండా 16 లక్షల కిలోమీటర్లకు పైగా ఈ డ్రైవర్ లెస్ కార్లు నడిచాయని క్రూయిజ్, వేమో సంస్థలు ఇటీవల ప్రకటించాయి.