కొత్త వేరియంట్లపై టీకాల సత్తా ఎంత? - టీకాలు వైరస్ రకం
కరోనావైరస్లో రోజురోజుకూ ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇవి వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతున్నాయి. ప్రధాన వైరస్‌ను అడ్డుకునేందుకు తయారు చేసిన టీకాలు.. ఈ వేరియంట్లను సమర్థంగా నివారించగలుగుతున్నాయా? దానిపై నిపుణులు ఏమంటున్నారు?
కొత్త వేరియంట్లపై టీకాల సత్తా ఎంత?
By
Published : May 26, 2021, 10:00 AM IST
రోజులు గడిచిన కొద్దీ వైరస్లలో మార్పులు వస్తుంటాయి. కొన్ని మార్పులు ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. మరికొన్ని వైరస్ తీవ్రతను తగ్గిస్తాయి. కొన్నిసార్లు వైరస్ మనుగడ సాధించేందుకు ఈ మార్పులు తోడ్పడతాయి.
జన్యుపదార్థాలలో జరిగే పొరపాట్ల వల్ల ఈ మార్పులు సంభవిస్తుంటాయి. వైరస్ తీవ్రతను పెంచి, మరింత వ్యాపించేలా చేసే మార్పులపై ప్రధానంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంటుంది. సహజ రోగనిరోధక శక్తిని, టీకా ద్వారా లభించిన ఇమ్యూనిటీని సైతం ఈ వేరియంట్లు సమర్థంగా ఎదుర్కొంటాయి.
కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ ఇందుకు భిన్నమేమీ కాదు. వైరస్ వ్యాపించిన ప్రతిసారి మరింత ప్రాణాంతకంగా మారుతుంది. ఏ ప్రాంతంలోనైనా, ఏ సమయంలోనైనా ఇది జరుగుతుంది. కాబట్టి వైరస్ వేరియంట్లను గుర్తించి, అవి వేగంగా వ్యాపిస్తున్నాయా?, వ్యాధి తీవ్రతను పెంచుతున్నాయా? అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవాల్సి ఉంటుంది.
నాలుగు ఆందోళనకర వేరియంట్లు
ఒక వేరియంట్‌ను గుర్తిస్తే దాని తీవ్రతను బట్టి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్ ఆఫ్ హై కాంసిక్వెన్స్గా విభజిస్తారు. ఇప్పటివరకు వేరియంట్ ఆఫ్ కాంసిక్వెన్స్ బయటపడకపోవడం కొంతవరకు ఉపశమనం కలిగించే వార్తే. వేరియంట్ ఆఫ్ కన్సర్న్(ఆందోళనకరమైన వేరియంట్)లు నాలుగు వెలుగులోకి వచ్చాయి.
అవి
యూకేలో బయటపడిన 'బీ117'
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన 'బీ1351'
బ్రెజిల్లో గుర్తించిన 'పీ1'
ఇండియాలో కనిపించిన 'బీ16172'
ఆందోళకరమైన వేరియంట్లు బయటపడటం వల్ల వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోందని అర్థమవుతోంది. వ్యాధి తీవ్రత పెరగడం, యాంటీబాడీలను వైరస్లు ఎదుర్కోవడం, టీకా ప్రభావాన్ని తగ్గించడం వంటివి వీటి పర్యవసానాలు. ఈ వైరస్ రకాలన్నీ వ్యాప్తిని పెంచాయనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి.
వైరస్ వ్యాప్తి పెరుగుదలను జనాభాలో గుర్తించవచ్చు. కానీ ఎందుకు వ్యాప్తి పెరుగుతుందనేది ల్యాబరేటరీల్లో పరీక్షించి తెలుసుకోవాలి. మానవ శరీరంలోని కణాల్లోకి చొచ్చుకెళ్లే వైరస్ స్పైక్ ప్రోటీన్.. ఈ ఆందోళనకరమైన వేరియంట్లలో గణనీయంగా మార్పుచెందింది. కొవిడ్ స్పైక్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకొనేలా తీర్చిదిద్దిన యాంటీబాడీలు ఈ కొత్త వేరియంట్లను సమర్థంగా నిలువరించలేకపోతున్నాయి. ఈ విషయం కొన్ని ల్యాబ్ పరిశోధనల్లో వెల్లడైంది.
టీకాల పనితీరు భేష్
కానీ ఆందోళకరమైన వేరియంట్ వ్యాప్తిలో ఉన్న ప్రాంతాల నుంచి తీసుకున్న డేటాను పరిశీలిస్తే.. వ్యాక్సిన్ ప్రభావవంతంగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీకా యాంటీబాడీలను అడ్డుకునేంత ప్రమాదకరంగా కరోనావైరస్ మారిపోలేదని స్పష్టమవుతోంది. ఖతర్‌లో నిర్వహించిన ఓ పరిశోధన ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది.
వ్యాక్సిన్లను ఎదురించి వేరియంట్లు వ్యాప్తి చెందితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ వేరియంట్లు అధిక మరణాలకు కారణమవుతున్నాయా లేదా అనేది గుర్తించాలి. వైరస్ తీవ్రతను, మరణ ముప్పును తగ్గించడం టీకా ప్రాథమిక ఉద్దేశం. ఇప్పటివరకు ఆ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. ప్రధానంగా చెలామణిలో ఉన్న వ్యాక్సిన్లు ఈ పని చేస్తే సరిపోతుంది.