Computer shortcuts: కంప్యూటర్ అయినా ల్యాప్‌టాప్ అయినా... యాప్ అయినా సాఫ్ట్వేర్ అయినా.. వేగంగా పని జరిగిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. మరి మన టెక్ జీవితాన్ని మరింత సులభతరం చేసే కొన్ని చిట్కాలు, షార్ట్కట్ల గురించి తెలుసుకుందాం రండి..
యూట్యూబ్ వీడియో అక్కడ్నుంచే
పీసీలోనో, ల్యాప్‌టాప్‌లోనో యూట్యూబ్ వీడియోలు చూస్తుంటాం. ఏదో ఘట్టం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మొత్తం వీడియోను కాకుండా ఆ భాగాన్నే నేరుగా ఇష్టమైనవారికి షేర్ చేయాలనిపిస్తే? ఇందుకు మార్గం లేకపోలేదు. వీడియో కిందుండే షేర్ బటన్‌ను నొక్కి, లింకు దిగువన చెక్‌బాక్స్‌ను చూడండి. అందులో వీడియోను ఆపేసినప్పటి సమయం ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఆ సమయాన్ని ఎంచుకొని, లింక్‌ను కాపీ చేసి షేర్ చేసుకోవచ్చు. కావాలంటే వీడియోలో మీకు ఇష్టమైన సమయాన్ని కూడా ఎంచుకోవచ్చు.
స్క్రీన్ షాట్ అంతవరకే
Screenshot shortcut Mac: స్క్రీన్ షాట్ చాలాసార్లు అవసరపడుతుంది. మొత్తం స్క్రీన్‌ను ఫొటో తీస్తే భద్రతకు భంగం కలగొచ్చు. మరి అవసరమైన భాగాన్నే స్క్రీన్ షాట్ తీయాలంటే? మ్యాక్ వాడేవారైతే కమాండ్, షిఫ్ట్, 5 బటన్లను కలిపి ఒకేసారి నొక్కాలి. దీంతో చదరపు ఆకారం కనిపిస్తుంది. అవసరమైన భాగాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. విండోస్ 10లోనైతే స్టార్ట్ బటన్‌తో సెర్చ్ బార్‌లోకి వెళ్లి స్నైపింగ్ టూల్ అని టైప్ చేయాలి. అప్పుడు స్క్రీన్ మీద బాక్స్ ప్రత్యక్షమవుతుంది. దీంతో అవసరమైన భాగాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.