Comet approaching earth: చుక్కలా ప్రకాశిస్తుంది. పైగా పొడవైన తోకతో కనువిందు చేస్తుంది. ఎప్పుడో గానీ తిరిగి రాదు. అందుకేనేమో తోకచుక్కలంటే మొదట్నుంచీ మనకు అంత ఆశ్చర్యం. ఆసక్తీనూ. చుక్క అని పిలుచుకుంటాం గానీ నిజానికి తోకచుక్కలు నక్షత్రాలు కావు. 460 కోట్ల ఏళ్ల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన భాగాలు. ఇవి దుమ్ము, రాళ్లు, మంచుతో కూడుకొని ఉంటాయి. గ్రహాలు, గ్రహ శకలాల మాదిరిగానే ఇవీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. కాకపోతే పొడవైన తోక ఒక్కటే ఎక్కువ. ఇంతకీ తోక ఎలా ఏర్పడుతుంది? సూర్యుడి దగ్గరికి రావటం మూలంగానే.
తోకచుక్కలు చాలావరకు నెప్ట్యూన్ ఆవలి క్యూపియర్ బెల్టులో, అంతకన్నా దూరంగా ఉండే ఊర్ట్ క్లౌడ్‌లో ఉంటాయి. తోకచుక్క మధ్యభాగాన్ని కోమా అంటారు. ఇది ఒకరకంగా గడ్డకట్టిన మంచు. క్యూపియర్ బెల్టు, ఊర్ట్ క్లౌడ్‌లోంచి బయటకు రానంతవరకు ఇవి ఈ స్థితిలోనే ఉంటాయి. అక్కడ్నుంచి బయటపడి, సూర్యుడి దగ్గరికి వస్తున్నకొద్దీ కొంత మంచు కరిగి, వాయువుగా మారటం మొదలవుతుంది. ఇది దుమ్ము రేణువులతో కలిసి కోమా చుట్టూ మేఘంలా ఏర్పడుతుంది. ఈ మేఘం తోకచుక్క మధ్యభాగం నుంచి విడిపోతున్నప్పుడు సూర్యుడు, సౌరగాలి, సూర్యుడి నుంచి వచ్చే రేణువులు వెనక్కి నెడతాయి. దీంతో మేఘం పొడవుగా విస్తరించి తోక మాదిరిగా కనిపిస్తుంది. ఇది లక్షలాది మైళ్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఒకటిగా కనిపించిన్నప్పటికీ దీనిలో రెండు వేర్వేరు తోకలు ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దుమ్ముతో ఏర్పడిన తోక తెల్లగా, అయాన్లతో ఏర్పడిన తోక నీలంగా ఉంటుంది. దుమ్ము తోక వెడల్పుగా, వంకరగా తిరిగితే.. అయాన్ల తోక ఎప్పుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో విస్తరించి ఉంటుంది.
రెండు రకాలు
క్యూపియర్ బెల్టు నుంచి వచ్చే వాటిని స్వల్పకాల తోకచుక్కలని అనుకోవచ్చు. ఇవి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావటానికి 200 ఏళ్ల కన్నా తక్కువ సమయం తీసుకుంటాయి. ఊర్ట్ క్లౌడ్ నుంచి వచ్చేవి దీర్ఘకాల తోకచుక్కలు. సూర్యుడి నుంచి లెక్కిస్తే క్యూపియర్ బెల్ట్ కన్నా ఊర్ట్ క్లౌడ్ సుమారు 50 రెట్లు ఎక్కువ దూరంలో ఉంటుంది. అందుకే ఊర్ట్ క్లౌడ్ నుంచి వచ్చే తోకచుక్కలు సూర్యుడిని చుట్టి రావటానికి ఎక్కువకాలం తీసుకుంటాయి. అతి పొడవైన కక్ష్య గల ఒక తోకచుక్క సూర్యుడిని ఒకసారి చుట్టి రావటానికి 2.5 లక్షల ఏళ్లు పడుతుంది!
భూమి దగ్గరకి ఎలా వస్తాయి?
గ్రహాలు లేదా నక్షత్రాల గురుత్వాకర్షణ ప్రభావంతో తోకచుక్కలు వాటి స్థానాల్లోంచి బయటకు వస్తుంటాయి. ఈ ఆకర్షణ వాటిని సూర్యుడి వైపు మళ్లేలా చేస్తుంది. అందుకే వీటి మార్గం చాలా పొడవుగా సాగిపోయిన అండాకారం మాదిరిగా కనిపిస్తుంది. ఇవి సూర్యుడి వైపు వేగంగా, త్వరగా ఆకర్షితమవుతూ వస్తాయి. సూర్యుడిని చుట్టి వెనకకు వచ్చాక, తిరిగి యథాస్థానానికి ప్రయాణమవుతాయి. కొన్ని తోకచుక్కలు సూర్యుడిలోనే లీనమవుతుంటాయి కూడా. మళ్లీ ఎప్పుడూ కనిపించవు. ఇలా తోక చుక్కలు సూర్యుడి వద్దకు వస్తూ పోతున్నప్పుడు.. అంటే సౌర వ్యవస్థ లోపలికి వచ్చినప్పుడు, పోతున్నప్పుడు మనకు దర్శనమిస్తుంటాయి.
అంతరిక్షం నుంచే పరిశోధన
దుమ్ము, వాయువు ఆవరించి ఉండటం వల్ల తోకచుక్క మధ్యభాగాన్ని మనం భూమి మీది నుంచి స్పష్టంగా చూడలేం. అందుకే ఉపగ్రహాల ద్వారా పరిశీలించటం ఆరంభించారు. ఇటీవలి కాలంలో చాలా ఉపగ్రహాలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి. నాసాకు చెందిన స్టార్‌డస్ట్ ఉపగ్రహం విల్ట్ టు అనే తోకచుక్క నుంచి నమూనాలు సేకరించి, భూమికి తీసుకొచ్చింది కూడా. వీటి రేణువుల్లో ప్రాణుల పుట్టుకకకు మూలమైన హైడ్రోకార్బన్లు దండిగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రోసెటా ఉపగ్రహం 67పీ చురీయుమోవ్-గెరాసిమెంకో తోకచుక్కపై అధ్యయనం చేసింది. ఇది దాని కేంద్రకం మీద ల్యాండర్‌నూ దింపింది. రెండేళ్ల వరకు తోకచుక్క చుట్టూ తిరిగింది. ఈ తోకచుక్కలోనూ హైడ్రోకార్బన్లు ఉన్నట్టు తేలింది. ఇలాంటి ఎన్నో ప్రయోగాల పుణ్యమాని తోకచుక్కల ఆకారాలు, వీటిల్లోని రసాయనాల తీరుతెన్నుల గురించి బాగా తెలుసుకోగలిగాం.