China Artificial Moon: శాస్త్ర పరిశోధన రంగాల్లో చైనా జోరు పెంచింది. భారీగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 'కృత్రిమ సూర్యుడి' సాకారం దిశగా ముందడుగు వేసిన డ్రాగన్ ఇప్పుడు చందమామపైనా కన్నేసింది. అక్కడి పరిస్థితులను అనుకరించేందుకు ఒక బుల్లి జాబిల్లిని సృష్టించింది. అందులో గురుత్వాకర్షణ శక్తినీ మాయం చేయడం విశేషం. భవిష్యత్‌లో చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేయడానికి వీలుగా దీన్ని సిద్ధం చేసింది. ఇలాంటి సాధనం ప్రపంచంలో మరెక్కడా లేదు.
ఎక్కడుంది?
ఈ కృత్రిమ చందమామను జియాంగ్సు ప్రావిన్స్‌లోని షుజౌ నగరంలో ఏర్పాటు చేశారు. కొద్ది నెలల్లో దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రత్యేకత ఏంటి?
China Artificial Moon Specialities:
- రోదసిలోకి పంపడానికి ముందు వ్యోమగాములకు భారరహిత స్థితిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రస్తుతం 'జీరో గ్రావిటీ' విమానాలను ఉపయోగిస్తున్నారు. అవి ఒక పద్ధతిలో ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో అందులోని వారు కొద్దిసేపు భారరహిత స్థితికి గురవుతారు. అలాగే డ్రాప్ టవర్ నుంచి కిందకు జారిపడే క్రమంలోనూ కొన్ని నిమిషాల పాటు ఈ పరిస్థితిని అనుభవించొచ్చు.
- భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతు ఉంటుంది. అదే తరహా పరిస్థితులు చైనా రూపొందించిన 'మినీ చందమామ'లో ఉంటాయి. ఇతర మార్గాలకు భిన్నంగా ఇందులో కోరుకున్నంతసేపు అలాంటి పరిస్థితిని కొనసాగించొచ్చు.
పనిచేసేది ఇలా..
How Artificial Moon Works:
చంద్రుడిపై ఉండే గురుత్వాకర్షణ శక్తిని భూమి మీద సృష్టించడం ఆషామాషీ కాదు. ఇందుకోసం చైనా శాస్త్రవేత్తలు శక్తిమంతమైన అయస్కాంతాలను ఉపయోగించారు. మినీ చందమామ.. 'మ్యాగ్నెటిక్ లెవిటేషన్' ఆధారంగా పనిచేస్తుంది.
- ఈ కృత్రిమ చంద్రుడిలో ప్రధానంగా రెండు చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గది, ఒక వాక్యూమ్ చాంబర్ ఉంటాయి. చందమామపై కనిపించే తేలికపాటి శిలలు, ధూళితో ఈ గదిని రూపొందించారు. వాక్యూమ్ చాంబర్‌లో గాలి ఉండదు.
- వాక్యూమ్ చాంబర్‌పై గదిని ఉంచారు. శక్తిమంతమైన అయస్కాంతాల సాయంతో చాంబర్‌లో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే.. గది గాల్లోకి లేస్తుంది. ఫలితంగా అందులో చందమామ తరహా పరిస్థితులు ఏర్పడతాయి.
సవాళ్లను అధిగమించి..
- కృత్రిమ చందమామలోని అపార అయస్కాంత శక్తి తాకిడికి సూపర్ కండక్టింగ్ వైర్లు, ఇతర సాధనాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది.
- దీనికితోడు శక్తిమంతమైన అయస్కాంతాల సమక్షంలో అనేక లోహపు భాగాలు సరిగా పనిచేయవు.
- ఈ ఇబ్బందులను అధిగమించడానికి చైనా శాస్త్రవేత్తలు వినూత్న ఆవిష్కారాలు చేశారు. అయస్కాంత క్షేత్ర సమక్షంలో చాలా సులువుగా తేలియాడే చంద్ర ధూళిని రూపొందించారు. కీలక భాగాల్లో ఉక్కు స్థానంలో అల్యూమినియంను ఉపయోగించారు.
బోలెడు ఉపయోగాలు
artificial moon Uses:
- 2027 నాటికి చంద్రుడిపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. చాంగే-6, 7, 8 వ్యోమనౌకల ద్వారా జాబిల్లిని శోధించాలని తలపోస్తోంది. 2030 నాటికి అక్కడికి మనుషులను పంపాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ క్రమంలో కృత్రిమ చందమామ బాగా ఉపయోగపడుతుంది. దీని సాయంతో వ్యోమగాములకు మెరుగైన శిక్షణ ఇవ్వవచ్చు. కొత్త రోవర్లు, సాంకేతిక పరిజ్ఞానాలను సులువుగా పరీక్షించొచ్చు.
- త్రీడీ ప్రింటింగ్ వంటి పరిజ్ఞానాల సాయంతో చంద్రుడిపై ఆకృతులను రూపొందించొచ్చా అన్నది ముందే తెలుసుకోవచ్చు.
- కృత్రిమ చంద్రుడిలో నిర్వహించే కొన్ని ప్రయోగాల ద్వారా.. చందమామ ఉపరితలంపై నీటి జాడను కనుగొనడానికి అనువైన ప్రదేశాలపై ఒక అవగాహనకు రావొచ్చు.
రష్యాలో జన్మించి, బ్రిటన్‌లో స్థిరపడ్డ శాస్త్రవేత్త ఆండ్రే గెయిమ్ గతంలో 'మ్యాగ్నెటిక్ లెవిటేషన్'తో ఒక కప్పను గాల్లోకి లేపారు. తాజా కృత్రిమ చందమామకు ఆయన ప్రయోగమే స్ఫూర్తి.
ఇదీ చదవండి:కోడిగుడ్డు ఆకారంలో గ్రహం!.. మనకు ఎంతదూరంలో అంటే..
భూమిపై మహా కృత్రిమ సూర్యుడు!