తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మీ పాస్​వర్డ్​ సేఫేనా? హ్యాక్ అయిందో లేదో తెలుసుకోండిలా..!​ - రాన్‌సమ్‌వేర్‌

Password Security: ప్రస్తుత ఇంటర్నెట్​ యుగంలో మన డేటా భద్రంగా ఉండాలంటే అన్ని అకౌంట్లకు పాస్​వర్డ్​ పెట్టుకోవాల్సిందే!.. లేదంటే మన డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంది. కానీ కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. హ్యాకర్లు డేటాను దొంగలించొచ్చు. ఈ నేప‌థ్యంలో పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌కు గురైందని తెలుసుకోవటమెలా? దీన్ని గుర్తించే తేలికైన మార్గాలేవైనా ఉన్నాయా? వంటి విషయాలను తెలుసుకుందాం.

Password security
Password security

By

Published : Jun 15, 2022, 8:21 AM IST

Password Security: బలహీన పాస్‌వర్డ్‌లే కాదు, పటిష్ఠంగా ఉన్నా చాలా సందర్భాల్లో ఆన్‌లైన్‌లో లీకయ్యే ప్రమాదముంది. హ్యాకర్లు డేటాను దొంగలించొచ్చు. లేదూ పొరపాటున మనమే ఫిషింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా నేరగాళ్లకు రహస్య వివరాలను అందించొచ్చు. మరి పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌కు గురైందని తెలుసుకోవటమెలా? దీన్ని గుర్తించే తేలికైన మార్గాలేవైనా ఉన్నాయా? అదృష్టవశాత్తు యాంటీవైరస్‌, వీపీఎన్‌ల వంటి వివిధ సెక్యూరిటీ టూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో డేటా తస్కరణకు గురైన విషయాన్ని తెలుసుకోవచ్చు.

పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌ అయ్యిందో లేదో వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవటానికి https://haveibeenpwned.com/ తేలికైన మార్గం. ఇదొక విశ్వసనీయమై వెబ్‌సైటని చాలామంది నమ్మకం. దీన్ని ట్రాయ్‌ హంట్‌ అనే సెక్యూరిటీ నిపుణులు నిర్వహిస్తున్నారు. చాలా సంస్థలు దీన్ని వాడుకుంటుంటాయి. ఇది ఈమెయిల్‌, రహస్య సమాచారం, పాస్‌వర్డ్‌ల వంటి వాటి వివరాలు ఇతరుల చేతికి చిక్కాయో లేదో తెలుపుతుంది. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే ఒక సెర్చ్‌ బాక్స్‌ కనిపిస్తుంది. ఇందులో ఈమెయిల్‌ గానీ అంతర్జాతీయ సంఖ్యా రూపంలో ఫోన్‌ నంబరును గానీ ఎంటర్‌ చేస్తే వివరాలను ఎవరైనా దొంగతనంగా సంగ్రహించారో లేదో తెలియజేస్తుంది.

హావ్‌ ఐ బీన్‌ పాన్డ్‌

ఒకవేళ హ్యాకింగ్‌ అయినట్టయితే ఎన్నిసార్లు తస్కరణకు గురైందో కూడా కనిపిస్తుంది. భద్రంగా ఉండటానికి కఠినమైన పాస్‌వర్డ్‌లకు మారటం, 2 ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను ఎనేబుల్‌ చేసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచిస్తుంది. అలాగే కీపర్‌ సెక్యూరిటీ (https://www.keepersecurity.com/)వెబ్‌సైట్‌తోనూ రహస్య సమాచారం తస్కరణకు గురైన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఉచితంగా వాడి చూసుకునే అవకాశమూ ఉంది.

పాస్‌వర్డ్‌ మేనేజర్ల సాయం
మంచి పాస్‌వర్డ్‌ మేనేజర్లతోనూ పాస్‌వర్డ్‌ల ఉల్లంఘనలను తెలుసుకోవచ్చు. బాగా ఆదరణ పొందిన పాస్‌వర్డ్‌ మేనేజర్లన్నీ పాస్‌వర్డ్‌ల భద్రత స్థితిని సమీక్షించి చూపుతాయి. ఉదాహరణకు డ్యాష్‌లేన్‌ అనే మేనేజర్‌ డార్క్‌ వెబ్‌ దాడులనూ పర్యవేక్షిస్తుంది. ఇది పాస్‌వర్డ్‌లను జనరేట్‌ చేయటంతో పాటు వివిధ వెబ్‌సైట్లలో వాడుకోవటానికి వీలుగా వాటిని నిల్వ చేసుకుంటుంది, మేనేజ్‌ చేస్తుంది. తిరిగి టైప్‌ చేయాల్సిన అవసరం లేకుండా ఆటో-ఫిల్‌ చేస్తుంది. పరిమిత ఫీచర్లతో ఉచితంగా వాడుకోవచ్చు.

పాస్‌వర్డ్‌ మేనేజర్ల సాయం

ఎక్కువ ఫీచర్లు కావాలంటే డబ్బులు చెలించాల్సి ఉంటుంది. అవసరమైతే గూగుల్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్ల వంటి బ్రౌజర్‌ ఆధారిత పాస్‌వర్డ్‌ మేనేజర్లనూ వాడుకోవచ్చు. ఇవీ పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్‌కు గురవటం వంటి వాటిని పసిగడతాయి. పాస్‌వర్డ్‌లను దొంగలు ఎన్నిసార్లు ఉపయోగించుకున్నారో, ఎన్నిసార్లు మళ్లీ మళ్లీ వాడుకున్నారో, ఏయే ఖాతాలకు బలహీనమైన పాస్‌వర్డ్‌లు ఉన్నాయో తెలియజేస్తాయి. వీటికి పరిష్కార మార్గాలనూ చూపెడతాయి.

అనుమానాస్పద వ్యవహారాలపై దృష్టి
ఎంత బలమైన పాస్‌వర్డ్‌ను నిర్ణయించుకున్నా, దీన్ని తరచూ మార్చుకుంటున్నా కూడా ఎక్కడో అక్కడ ఉల్లంఘనకు గురయ్యే అవకాశం లేకపోలేదని గుర్తుంచుకోవాలి. ఆన్‌లైన్‌లో హ్యాకర్లకు పాస్‌వర్డ్‌లను అమ్ముతుంటారని తెలుసుకోవాలి. అప్రమత్తంగా లేకపోతే బలమైన పాస్‌వర్డ్‌లు సైతం నేరగాళ్లు దొంగిలించే ప్రమాదముంది. కాబట్టి గూగుల్‌, ఫేస్‌బుక్‌.. వంటి ఖాతాల వ్యవహారాలను అప్పుడప్పుడు తనిఖీ చేయటం మంచిది. దీంతో ఇటీవలి కాలంలో ఎప్పుడెప్పుడు, ఎక్కడ వినియోగించుకున్నామో తెలుస్తుంది.

అనుమానాస్పద వ్యవహారాలపై దృష్టి

అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటానికి వీలుంటుంది. ఆన్‌లైన్‌లో గోప్యంగా పనులు చేసుకోవటానికి తోడ్పడే వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌) సేవలను వాడుతున్నట్టయితే ఇది మరింత అవసరం. వేరే లొకేషన్ల నుంచి ఎవరైనా ఖాతాల్లోకి ప్రవేశించినట్టయితే వెంటనే తెలుస్తుంది. పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలంటూ వచ్చే మెయిళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పాస్‌వర్డ్‌ మార్చటానికి ప్రయత్నించకపోయినా ఇలాంటి మెయిల్‌ వచ్చినట్టయితే క్లిక్‌ చేయకుండా ఉండటం ఉత్తమం.

వేర్వేర్లు!
కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ అనగానే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్లు గుర్తుకొస్తాయి. ఇంతకీ వేర్‌ అంటే? సాధనమని. మానిటర్‌, సీపీయూ, కీబోర్డు, మౌజ్‌ వంటి భాగాలన్నీ హార్డ్‌వేర్లు. వీటిని పనిచేయించేవి సాఫ్ట్‌వేర్లు. ట్యాబ్లెట్‌, స్మార్ట్‌ఫోన్ల వంటివాటికీ ఇవే కీలకం. ఈ సాఫ్ట్‌వేర్లు రకరకాలు. వీటిల్లో మంచి చేసేవే కాదు, హాని చేసేవీ ఉంటాయి. వీటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

స్పైవేర్‌
ఇదొక మాల్వేర్‌. ఒకసారి పీసీలో ఇన్‌స్టాల్‌ అయితే చాలు. మన అనుమతి లేకుండానే, మనకు తెలియకుండానే ఆన్‌లైన్‌ వ్యవహారాలన్నింటినీ పసిగడుతుంది. ప్రకటనకర్తలు, మార్కెటింగ్‌ డేటా సంస్థలు సైతం ఇంటర్నెట్‌ వాడేవారి తీరుతెన్నులను తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగిస్తుంటాయి. మార్కెటింగ్‌, ప్రకటనల కోసం తోడ్పడే స్పైవేర్లను ‘యాడ్‌వేర్‌’ అంటారు. ఇవి డౌన్‌లోడ్‌ లేదా ట్రోజన్ల ద్వారా పీసీలో ఇన్‌స్టాల్‌ అవుతాయి. ఈమెయిల్‌ ఐడీలు, వెబ్‌సైట్లు, సర్వర్ల వంటి వివరాలను పీసీ నుంచి సేకరించి, ఇంటర్నెట్‌ ద్వారా థర్డ్‌ పార్టీలకు చేరవేస్తాయి. కొన్ని స్పైవేర్లు లాగిన్‌, పాస్‌వర్డ్‌ల వంటి వాటినీ దొంగిలిస్తాయి. ఈ సాఫ్ట్‌వేర్లను ‘కీలాగర్స్‌’ అని పిలుచుకుంటారు. సీపీయూ మెమరీని, డిస్క్‌ స్టోరేజినీ, నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌నూ వాడుకుంటాయి.

క్రాప్‌వేర్‌
ఇది కొత్త పీసీతో వచ్చే సాఫ్ట్‌వేర్‌. కంప్యూటర్‌లో ముందే ఇన్‌స్టాల్‌ అయ్యి ఉంటుంది. ఇవి ప్రయోగ పరీక్షల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వీటితో మనకు నేరుగా ఉపయోగమేమీ ఉండదు. గడువు తీరిన తర్వాత పోతాయి. కొన్నిసార్లు అప్లికేషన్లను పరీక్షించటానికి తయారీదారులు క్రాప్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయిస్తుంటారు. ఇందుకోసం థర్డ్‌ పార్టీలు డబ్బు కూడా చెల్లిస్తుంటాయి. దీంతో పీసీల ధరా తగ్గుతుంది. డిస్క్‌ స్పేస్‌ను వాడుకున్నా క్రాప్‌వేర్‌ హాని చేయదు.

రాన్‌సమ్‌వేర్‌
ఇది హానికర సాఫ్ట్‌వేర్‌. పీసీలో ఇన్‌స్టాల్‌ అయ్యి, లోపలి భాగాలను ఎన్‌క్రిప్ట్‌ చేస్తుంది. పరికరాన్ని, డేటాను వాడుకోనీయకుండా చేస్తుంది. రాన్‌సమ్‌ అంటే డబ్బులు తీసుకొని, విడుదల చేయటం. పేరుకు తగ్గట్టుగానే ఇది డబ్బులు చెల్లించాలంటూ సందేశాన్ని తెర మీద కనిపించేలా చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే గానీ డేటాను వాడుకోనీయదు. పరికరాన్ని తెరచుకోనీయదు. రాన్‌సమ్‌వేర్లలో చాలా రకాలున్నాయి. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవటం, నాణ్యమైన యాంటీవైరస్‌/యాంటీ మాల్వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవటం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు. గుర్తింపులేని వెబ్‌సైట్లను, సాఫ్ట్‌వేర్లను తెరవకపోవటం మంచిది.

నాగ్వేర్‌
ఒకరకంగా దీన్ని వేధించే సాఫ్ట్‌వేర్‌ అనుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఏదైనా పని చేస్తున్నప్పుడో, ఫీచర్‌ను ప్రయత్నిస్తున్నప్పుడో పాపప్‌, నోటిఫికేషన్‌ మెసేజ్‌లతో లేదా కొత్త విండో ఓపెన్‌ చేసో సాధించటం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- వెబ్‌పేజీ లేదా ప్రోగ్రామ్‌ ఓపెన్‌ చేస్తున్నామనుకోండి. రిజిస్టర్‌ చేసుకోవాలని అడగొచ్చు. ప్రోగ్రామ్‌ను లోడ్‌ చేస్తున్నప్పుడు లైసెన్స్‌ కొనమనీ చెబుతుండొచ్చు. దీని ద్వారా అందే మెసేజ్‌లు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి. ఆగకుండా అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయటం ఉత్తమం.

ఇవీ చదవండి:సూపర్ ఫీచర్లతో టెలిగ్రామ్‌ కొత్త వెర్షన్​.. కానీ వాడాలంటే మాత్రం...

16 కొత్త ఫీచర్లతో ఐఓఎస్​ అప్​డేట్​.. యూజర్లకు పండగే!

ABOUT THE AUTHOR

...view details