ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన ప్రముఖ చాట్‌బాట్ 'చాట్‌జీపీటీ'.. యూపీఎస్సీ పరీక్షలో ఫెయిల్ అయింది. ఈ పరీక్షల్లో కేవలం 54 మార్కులే సాధించింది. ప్రపంచంలో అతి కఠినతరమైన పరీక్షలుగా భావించే కొన్నింటిని.. చాట్‌జీపీటీ గతంలో సులువుగా పాస్ అయింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్టన్ స్కూల్ ఎంబీఏ పరీక్ష, అమెరికా మెడికల్, లా ఎగ్జామ్లలోనూ ఉత్తీర్ణత సాధించింది. కానీ భారత్‌లో సివిల్ సర్వెంట్ల నియమకానికి నిర్వహించే పరీక్షల్లో మాత్రం ఫెయిల్ అయింది.
తాజాగా అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ (ఏఈఎం) అనే సంస్థ.. చాట్‌జీపీటీకి సివిల్స్ పరీక్ష నిర్వహించింది. ముందుగా "యూపీఎస్ ప్రిలిమినరీ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు అవుతారని అనుకుంటున్నారా?" అని ఏఈఎమ్.. చాట్‌జీపీటీని ప్రశ్నించింది. "అది కష్టంగానే ఉంటుందని తెలుసు. నేను ఈ పరీక్ష పాస్ అవుతానో లేదో కచ్చితంగా చెప్పలేను" అని చాట్‌జీపీటీ బదులిచ్చింది. దీంతో పరీక్షలో భాగంగా చాట్‌జీపీటీకి 100 ప్రశ్నలు సంధించింది ఏఈఎం. 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్.. క్వశ్చన్ పేపర్ 1(సెట్ ఏ) నుంచి వీటిని అడిగింది. ఇందులో కొన్ని ప్రశ్నలకు మాత్రమే చాట్‌జీపీటీ సరైన సమాధానాలు చెప్పగలిగింది. ఈ పరీక్షల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కట్ఆఫ్ మార్కులు 87.54 కాగా.. చాట్‌జీపీటీ ఇందులో 54 మార్కలు మాత్రమే సాధించి ఫెయిల్ అయింది.