Will Chandrayaan 3 Wake Up: జాబిల్లిపై రాత్రి సమయం ముగుస్తున్న నేపథ్యంలో చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్నిద్రాణం నుంచి బయటకు రావడంపై చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్.. శుక్రవారం (సెప్టెంబర్ 22న) నిద్రలో నుంచి ( Chandrayaan 3 Update Today ) బయటకు వచ్చే అవకాశం ఉంది. చంద్రుడిపై సురక్షితంగా దిగిన చంద్రయాన్-3.. సూర్యరశ్మి ఉన్న 14 రోజుల పాటు విజయవంతంగా వివిధ పరీక్షలు నిర్వహించింది. అనంతరం నిద్రలోకి జారుకుంది. ఈ నేపథ్యంలో సూర్యోదయం తర్వాత ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేస్తాయా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
"చంద్రయాన్-3ని 14 రోజుల పాటు పనిచేసేలా డిజైన్ చేశారు. దాని జీవితకాలం 14 రోజులు మాత్రమే. రాత్రి పూట చంద్రుడిపై ఉష్ణోగ్రతలు మైనస్ 250 డిగ్రీలకు పడిపోతాయి. ఆ ఉష్ణోగ్రతల్లో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయడం చాలా కష్టం. కాబట్టి 14 రోజుల తర్వాత చంద్రయాన్-3 పనిచేయదని అనుకుంటున్నాం. కానీ, కొంతమంది శాస్త్రవేత్తలు.. అది తిరిగి పనిచేస్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అది నిజంగా పనిచేస్తే వరమనే చెప్పాలి."
-సువేందు పట్నాయక్, భువనేశ్వర్‌కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త
నిద్రలేస్తే.. మళ్లీ ఆ ప్రయోగాలు..
చంద్రయాన్-3 పనిచేసిన 14 రోజుల సమయంలో పరీక్షలకు సంబంధించి పూర్తి డేటాను పంపించిందని సువేందు పట్నాయక్ తెలిపారు. పరికరాలు తిరిగి పనిచేస్తే.. ఇదివరకు చేసిన ప్రయోగాలనే మళ్లీ నిర్వహిస్తామని చెప్పారు.