Chandrayaan 3 Successfully Landed On Moon :ఇస్రో శాస్త్రవేత్తల మొక్కవోని పరిశ్రమ, దేశవిదేశాల్లోని కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు ఫలించాయి. చంద్రయాన్-3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా.. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ కఠిన పరిస్థితులను దాటుకొని సురక్షితంగా జాబిల్లిని ముద్దాడింది. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్.. దేశ సాంకేతికత పురోగతిని అంతరిక్ష యవనికపై రెపరెపలాడించింది.
చంద్రుడి వద్దకు పంపే ప్రాజెక్టులు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటివరకు 12 దేశాలు 141 సార్లు యత్నిస్తే.. కేవలం 69 సార్లు మాత్రమే విజయం సాధించాయి. అమెరికానే 15 వైఫల్యాలను మూటగట్టుకొంది. ఇక ఇస్రో చేపట్టిన మూడింటిలో.. రెండు విజయాలు, ఒక వైఫల్యం ఉంది. ల్యాండర్ మాడ్యూల్ సాఫ్ట్ ల్యాండింగ్ కావటం వల్ల.. అంతరిక్షరంగంలో ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్ తదితర అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సాధించింది. ఎందుకంటే అత్యంత సూదూరంలోని అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్లు ఏర్పాటు చేసుకోవడం, అందులోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేసేటట్లు చూడటం పెద్ద సవాల్. విజయవంతంగా హార్డ్ ల్యాండింగ్ మిషన్ చంద్రయాన్-1 జాబిల్లిపై నీటిజాడను గుర్తించింది.
India Fourth Country Successfully Landed On Moon : సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ముందుగానే నిర్ణయించిన స్థలంలో ప్రణాళిక ప్రకారం ల్యాండర్ దిగడం అన్నమాట. ఈ మిషన్ విజయవంతం కావటం వల్ల.. ఇతర దేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. వాస్తవానికి చంద్రయాన్-3 సురక్షితంగా నియంత్రిత విధానంలో ఉపరితలంపై దిగటం ద్వారా.. సోవియట్, అమెరికా, చైనా తర్వాత ఈ టెక్నాలజీతో సత్తాచాటిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.