Chandrayaan 3 Sleep Mode : యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేసుకొని విశ్రాంతికి సిద్ధమయ్యాయి. అందులో భాగంగా తొలుత ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపినట్లు ఇస్రో.. శనివారం రాత్రి ప్రకటించింది. దానికి అమర్చిన పేలోడ్ పనులను నిలిపేసినట్లు ఇస్రో పేర్కొంది.
"ప్రజ్ఞాన్ రోవర్‌తన లక్ష్యాలను పూర్తి చేసుకుంది. దాన్ని ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో నిలిపి ఉంచి, స్లీప్ మోడ్‌లోకి పంపేశాం. అందులోని ఏపీఎక్స్‌ఎస్, లిబ్స్ పరికరాలను స్విచ్ఛాఫ్ చేశాం. ఈ రెండు సాధనాల నుంచి డేటా.. ల్యాండర్ ద్వారా భూమికి చేరింది" అని ఇస్రో పేర్కొంది. అది తాత్కాలిక విరామమా లేక శాశ్వత నిద్రా అన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుంది.
స్లీప్ మోడ్‌లోకి ఎందుకు?
Pragyan Rover Sleep Mode :చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్,ప్రజ్ఞాన్ రోవర్‌కు సౌరశక్తే ఆధారం. అవి సౌర ఫలకాల ద్వారా సూర్యుడి నుంచి వెలువడే కాంతిని ఒడిసిపట్టి తమ బ్యాటరీలను రీఛార్చ్ చేసుకుంటాయి. అందువల్ల చంద్రుడిపై ఒక పగలు (భూమి మీద 14 రోజులతో సమానం) పనిచేసేలా వీటిని రూపొందించారు. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విక్రమ్ దిగేటప్పటికీ అక్కడ తెల్లవారింది. అనంతరం ఆ వ్యోమనౌకలో నుంచి వెలుపలికి వచ్చిన ప్రజ్ఞాన్ కూడా తన బ్యాటరీలను రీఛార్జ్ చేసుకుని.. తన పరిశోధనలు ప్రారంభించింది.
Pragyan Rover Information : అయితే ఈ వ్యోమనౌకలు దిగిన 'శివశక్తి పాయింట్' వద్ద ఇప్పుడు సాయంకాలం మొదలైంది. వెలుతురు మెల్లగా తగ్గుతోంది. క్రమంగా 14 రోజుల రాత్రి సమయం అక్కడ ప్రారంభం కానుంది. జాబిల్లిపై రాత్రివేళ నెలకొనే ప్రతికూల పరిస్థితులను విక్రమ్, ప్రజ్ఞాన్‌లు తట్టుకోలేవు. అప్పుడు వాటి బ్యాటరీల రీఛార్జ్ అసాధ్యం. దాంతో పాటు జాబిల్లిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 200 డిగ్రీలకు పడిపోతాయి. ఆ వాతావరణాన్ని ల్యాండర్, రోవర్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తట్టుకోలేకపోవచ్చు. అందువల్ల ఈ రెండు వ్యోమనౌకలను స్లీప్ మోడ్‌లోకి ఇస్రో పంపుతోంది.
తర్వాత పరిస్థితేంటి?
Is Pragyan Rover Still Working :ప్రస్తుతం విశ్రాంతి దశలోకి వెళ్లిన రోవర్‌లోని బ్యాటరీలు పూర్తిగా రీఛార్జ్ అయ్యాయని ఇస్రో తెలిపింది. మళ్లీ ఈ నెల 22న శివశక్తి పాయింట్ వద్ద సూర్యోదయం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆ రోజున సూర్యకాంతిని అందుకునేలా రోవర్ సోలార్ ప్యానెల్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. దాని రిసీవర్‌ను ఆన్ చేసి పెట్టినట్లు పేర్కొంది. అన్నీ సజావుగా సాగితే మరికొన్ని రోజుల పాటు ప్రజ్ఞాన్ తన పరిశోధనలను కొనసాగించనుంది. లేదంటే భారతదేశపు ప్రతినిధిగా చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనుంది. ఇప్పటి వరకు రోవర్ సేకరించిన డేటాను ఇస్రో విశ్లేషణ చేస్తోంది.