Chandrayaan 3 Rover Landing Time :జాబిలిపై విజయవంతంగా అడుగు పెట్టి ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటున్న చంద్రయాన్-3 ఇక అసలు పని మొదలుపెట్టనుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రగ్యాన్ రోవర్ ( Pragyan Rover Images ) 14 రోజులు చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది. సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను రోవర్, ల్యాండర్ శోధిస్తాయి. ఇందుకోసం ఆధునిక పరికరాలను ఇస్రో జాబిలిపైకి పంపింది. కాగా, విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చిన తొలిఫొటోను ఇస్రో పంచుకుంది.
Pragyan Rover on Moon Experiments :చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై ల్యాండయ్యాక కొన్ని గంటల తర్వాత దాని ర్యాంప్ విచ్చుకుంది. ల్యాండర్‌లోని ఆరు చక్రాల ప్రగ్యాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. చంద్రుడి నేలపై అది సెకనుకు సెంటీమీటర్ వేగంతో నడక సాగిస్తూ పలు పరిశోధనలు చేపట్టనుంది. జాబిల్లిపై పరిశోధనలు చేయడానికి ఐదు శాస్త్రీయ పేలోడ్లను వాటిలో ఇస్రో అమర్చింది. ల్యాండర్, రోవర్ జీవిత కాలం 14 రోజులు. చంద్రునిపై పగలు అంటే భూమిపై 14 రోజులతో సమానం. అందుకే సూర్యరశ్మి ఉండే 14 రోజులు సౌరఫలకాల సాయంతో శక్తి సమకూర్చుకుని ల్యాండర్, రోవర్ పరిశోధనలు నిర్వహిస్తాయి. ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా భూమ్మీద ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ చేసినప్పటికీ రోవర్ మాత్రం ల్యాండర్‌కు మాత్రమే కమ్యూనికేట్ చేసే వీలుంది.
విక్రమ్ ల్యాండ్ అవగానే ప్రగ్యాన్ బయటకు రాలేదు. ఇందుకు గంటల సమయం పట్టింది. విక్రమ్ దిగిన చోట చంద్రుని ధూళి పైకి లేస్తుంది. జాబిల్లి గురుత్వాకర్షణ భూమితో పోల్చితే చాలా తక్కువ కాబట్టి ఆ ధూళి తిరిగి ఉపరితలంపై పడేందుకు చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి ఇందుకు ఒక రోజు సమయం కూడా పట్టొచ్చని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. ఆ సమయంలో రోవర్ బయటకు వస్తే.. ఆ దుమ్ము ప్రగ్యాన్ కెమెరాలు ఇతర పరికరాలకు నష్టం చేస్తుంది. అందుకే గంటల సమయం తర్వాత రోవర్‌ను బయటకు తీసుకువచ్చినట్లు ఇస్రో తెలిపింది.
పరిశోధనలు ఇవే...
Pragyan Rover Moon Experiments :చంద్రుడిపై విలువైన లోహాలు ఉన్నాయనే అంచనాలున్న నేపథ్యంలో ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలకు సిద్ధమైంది. 26 కిలోల బరువుండే ప్రగ్యాన్ రోవర్‌లో ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్టోమీటర్-APXS, లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్- LIBS ఉంటాయి. ల్యాండింగ్ ప్రాంతం చుట్టూ ఉన్న నేల, రాళ్లలో మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, ఐరన్ వంటి మూలకాలను గుర్తించే పనిలో ఇది నిమగ్నమవుతుంది. ఇక గుణాత్మక, పరిమాణాత్మక మూలకాల విశ్లేషణకు చంద్రుని ఉపరితలంపై మన అవగాహనను మరింతగా పెంచుకోవడానికి రసాయన కూర్పును, ఖనిజ సంబంధమైన కూర్పును ఊహించడంలో LIBS సహాయపడుతుంది. ల్యాండింగ్ పూర్తైన కాసేపటికే బెంగళూరులోని ఇస్రాక్ట్-మాక్స్‌తో విక్రమ్‌కు కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పడ్డాయి. ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రగ్యాన్ రోవర్ రెండు కీలక పరిశోధనలు చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు.