Chandrayaan 3 Propulsion Module Separation : చంద్రుడి దక్షిణ ద్రవంపై అధ్యయనం కోసం చేపట్టిన.. చంద్రయాన్-3 ప్రయోగంలో మరో కీలక ప్రక్రియ పూర్తయ్యింది. వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. చంద్రుడి ఉపరితల కక్ష్యలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం మొదలుకానుంది. ఇక ఇప్పటి నుంచి ల్యాండర్ మాడ్యూల్ సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. శుక్రవారం.. ల్యాండర్ మాడ్యూల్‌ను డీబూస్ట్ చేసి కక్ష్య తగ్గించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో తెలిపింది.
Chandrayaan 3 3rd Orbit Raising Maneuver :ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయిన తర్వాత.. ల్యాండర్ మాడ్యూల్ 'థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్' అని ఓ మెసేజ్ పంపినట్లు ఇస్రో ఎక్స్ (ఇంతకుముందు ట్విట్టర్) వేదికగా తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తి కావడం వల్ల శుక్రవారం ఆగస్టు 18 సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఆ తర్వాత 20న మరోసారి ల్యాండర్ మాడ్యూల్ డీ-ఆర్బిట్-2 ప్రక్రియ చేపడతామని తెలిపింది.
"ఇదొక గొప్ప మైలురాయి. ఈ ప్రయోగం కోసం కేవలం భారతీయులే కాదు.. యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇప్పుడు మన ముందున్న ముఖ్యమైన అంశం చంద్రుడిపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం. విక్రమ్ వేరుపడిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్‌ను రెండు దశల్లో డీబూస్ట్ చేసి కక్ష్య తగ్గిస్తారు."
--మైల్స్వామి, ఇస్రో మాజీ శాస్త్రవేత్త
ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్‌ను జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే ప్రక్రియను చేపడతారు. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద దిగేలా నిర్దేశించారు. జాబిల్లిని తాకే సమయంలో ల్యాండర్ నిలువు వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోనున్నారు. అలా క్రమంగా వేగం తగ్గించి.. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు ల్యాండర్ ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను మృదువుగా దింపనున్నారు.
Chandrayaan 2 Failure Reason : చంద్రయాన్-2 సమయంలో ఈ ప్రక్రియలోనే ఇస్రో విఫలమైంది. ఈసారి సెన్సార్లు, ఇంజిన్లు విఫలమైనప్పటికీ.. జాబిల్లిపై ల్యాండర్ మృదువుగా దిగే విధంగా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంది. మరోవైపు ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రస్తుతం ఉన్న కక్ష్యలోనే కొన్ని నెలల పాటు ప్రయాణించనుందని ఇస్రో వివరించింది. అక్కడి నుంచి భూమి వాతావరణం, మేఘాల కదలికలపై అధ్యయనం చేయనుంది.
Chandrayaan 3 Launch Date And Time :చంద్రయాన్-3ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో విజతలవారీగా ఐదుసార్లు కక్ష్యను పెంచారు. 5వ భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న 'ట్రాన్స్ లూనార్ కక్ష్య'లోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా 6, 9, 14, 16 తేదీల్లో కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువ చేశారు. బుధవారమే చంద్రయాన్-3 చివరి దశ కక్ష్యలోకి ప్రవేశించగా.. తాజగా గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయింది.
Chandrayaan 3 Update : జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-3.. కీలక ఘట్టానికి ఇస్రో రెడీ
ISRO Chandrayaan 3 : లక్ష్యం దిశగా చంద్రయాన్-3.. చివరి కక్ష్య తగ్గింపు సక్సెస్