తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

చంద్రయాన్‌-3కి కొత్త ముహూర్తం.. ప్రయోగం ఎప్పుడంటే?

Chandrayaan 3 Launch Date : చంద్రయాన్‌-3 ప్రయోగానికి ఇస్రో చేస్తున్న ఏర్పాట్లు దాదాపు తుదిదశకు చేరాయి. జులై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్‌-3 ప్రయోగం నిర్వహించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమ్​నాథ్ తెలిపారు. ఆగస్టు 23 లేదా 24న సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే అవకాశముందని చెప్పారు.

Chandrayaan 3 Launch Date
చంద్రయాన్ 3 లాంఛింగ్

By

Published : Jul 6, 2023, 5:51 PM IST

Updated : Jul 6, 2023, 7:46 PM IST

Chandrayaan 3 Launch Date : చంద్రుడిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో.. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3ని.. జులై 14న నింగిలోకి పంపనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.35గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ మేరకు భారీ వాహకనౌకకు పరికరాలను అమర్చే ప్రక్రియ శ్రీహరికోటలో వేగంగా జరుగుతోంది. పనులన్నీ తుదిదశకు వచ్చాయి. ల్యాండర్‌-రోవర్‌ మిళితంగా చంద్రయాన్‌ 3ని నింగిలోకి ప్రయోగించనున్నారు.

అనేక జాగ్రత్తలు తీసుకున్న ఇస్రో
Chandrayaan 3 News : చంద్రయాన్‌ 2లో ప్రయోగించిన ఆర్బిటర్‌, ఇంకా జాబిలి చుట్టూ కక్ష్యలోనే తిరుగుతోంది. అదే ఆర్బిటర్‌ను చంద్రయాన్‌ 3కి వినియోగించుకోనున్నారు. చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో విఫలమైన నేపథ్యంలో అలాంటి పొరపాట్లు తాజా ప్రయోగంలో పునరావృతంకారాదని ఇస్రో అనేక జాగ్రత్తలు తీసుకుంది.

చంద్రయాన్‌ 3సాఫ్ట్‌ల్యాండింగ్‌కు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ అవసరం. ల్యాండర్‌ను సరిగ్గా ఎక్కడ దింపాలనేది అత్యంత ముఖ్యం. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయిన తర్వాత.. అది చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో దాని వేగాన్ని పూర్తిగా నియంత్రించాల్సి ఉంటుంది. నిర్దేశిత వేగంతో సరైన ల్యాండింగ్‌ స్పాట్‌లో అత్యంత మృదువుగా చంద్రుడిపైకి ల్యాండర్‌ను దింపాలి. చంద్రుడి ఉపరితలం అత్యంత భిన్నంగా ఉంటుంది.

పెద్ద పెద్ద కుహరాలు, వదులుగానూ, కఠినంగా ఉండే ఉపరితలం ఉంటుంది. చంద్రయాన్‌-3లో రెండు ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌,అవాయిడెన్స్‌ కెమెరాలు పొందుపరుచుతున్నారు. అవి పంపే ఫొటోలను బట్టి ఎక్కడ ల్యాండ్‌ చేయాలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఆగస్టు 23 లేదా 24న సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేస్తారు. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ విజయవంతం అయితే దానిలో ఉన్న రోవర్‌ చంద్రుడి ఉపరితలంపైకి చేరి.. అక్కడ ఇస్రో నిర్దేశించిన పరిశోధన చేపడుతుంది.

"చంద్రయాన్ -3 ప్రయోగం జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు సవ్యంగా లాంచింగ్ జరిగితే..... మేము చంద్రుడిపై ఆగస్టు చివరి వారంలో ల్యాండింగ్‌ చేస్తాము. కచ్చితమైన తేదీ అనేది....చంద్రుడిపై సూర్కోదయంపై ఆధారపడి ఉంటుంది. చంద్రయాన్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో సూర్యరశ్మి ఉండాలి. భూమితో పోలిస్తే చంద్రుడిపై రోజులు భిన్నంగా ఉంటాయి. 15 రోజులు మొత్తం సూర్యరశ్మి ఉంటుంది. మరో 15 రోజులు మొత్తం చీకటి ఉంటుంది. కాబట్టి....మనం కచ్చితంగా సూర్యరశ్మి వచ్చే మొదటి రోజే ల్యాండ్ చేయాలి. దాని వల్ల 15 రోజుల పాటు అక్కడ రోవర్ ఉండొచ్చు. అంతా సవ్యంగా జరిగితే ఆగస్టు 23న ల్యాండింగ్ జరుగుతుంది. ఆగస్టు 24 కూడా కావొచ్చు....అది కొన్ని లెక్కలపై ఆధారపడి ఉంటుంది. కానీ....26, 27 తేదీల్లో మాత్రం ఉండదు. ఒకవేళ అది ఆలస్యమైతే మేము ల్యాండ్ చెయ్యము. మరో నెల పాటు వేచి చూస్తాము అప్పుడే మళ్లీ రోజు వస్తుంది. సెప్టెంబర్‌ 20 తరువాత ల్యాండ్ చేస్తాము."

-- ఎస్‌ సోమ్‌నాథ్‌, ఇస్రో ఛైర్మన్

చంద్రయాన్​-2 విజయవంతం అవుతుందని భావించినా..
చంద్రయాన్‌-2 కచ్చితంగా విజయవంతం అవుతుందని అప్పట్లో ఇస్రో భావించింది. కానీ కీలకమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ దశలో అది విఫలమైంది. ఇప్పటివరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా.. ఇస్రో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపట్టింది. ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ని మోసుకెళుతూ జీఎస్‌ఎల్వీ మార్క్‌-111 M-1 రాకెట్‌ 2019 జులై 22న నింగిలోకి దూసుకెళ్లింది. 45 రోజుల ప్రయాణం తర్వాత సెప్టెంబరు 6-7 మధ్య రాత్రి ల్యాండింగ్‌కు సిద్ధమైంది.

కానీ సాంకేతిక కారణాలతో ల్యాండర్‌ వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్ల జాబిలి ఉపరితలాన్ని వేగంగా ఢీకొట్టింది. అత్యంత మృదువుగా దిగాల్సిన ల్యాండర్‌ వేగంగా ఉపరితలాన్ని ఢీకొట్టడం వల్ల దానిలోని భాగాలు దెబ్బతిన్నాయి. వెంటనే అది భూకేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. 8 సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. మరికొన్నేళ్లు అది పనిచేస్తుందని ఇస్రో తెలిపింది.

Last Updated : Jul 6, 2023, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details