Chandrayaan 1 Data Found Water On Moon :చంద్రుడిపై నీరు ఎలా ఏర్పడిందన్న విషయంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు.. చంద్రయాన్-1 రిమోట్ సెన్సింగ్ డేటా ద్వారా కీలక విషయాలు తెలిశాయి. ఈ డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తల బృందం.. భూమి నుంచి విడుదలైన అధిక శక్తి ఎలక్ట్రాన్లు చంద్రుడిపై నీటిని ఏర్పరుస్తున్నట్లు కనుగొన్నారు. భూమి ప్లాస్మా షీట్లోని ఎలక్ట్రాన్లు చంద్రుడి ఉపరితలంపై రాళ్లు, ఖనిజాలను విచ్ఛన్నం చేయడం, కరిగించడం లాంటి వాతావరణ ప్రక్రియకు కారణం అవుతున్నాయని తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని మానోవాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హవాయి (యూహెచ్)కు చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధన వివరాలు 'నేచర్ ఆస్ట్రానమీ' జర్నల్లో (Nature Astronomy Journal) ప్రచురితం అయ్యాయి.
అయితే, చంద్రుడిపై ఎంత మోతాదులో నీటి వనరులు ఉన్నాయనే విషయం కీలకమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఆ వనరులు ఎలా ఏర్పడ్డాయి, వాటి పరిణామక్రమాన్ని అర్థం చేసుకోడానికి.. భవిష్యత్తులో మానవ అన్వేషణకు నీటి వనరులను అందించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కొత్త విషయాల ద్వారా చంద్రిడిపై శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతాల్లో కనుగొన్న మంచు నీరు, ఎలా ఎర్పడిందో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ప్రోటాన్ల వంటి అధిక శక్తి కణాలతో కూడిన సౌర గాలి చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిన క్రమంలో నీరు ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు ప్రాథమికంగా భావిస్తున్నారు. చంద్రుడు.. భూమి మాగ్నెటోటైల్ (ఈ ప్రాంతం సౌర గాలి నుంచి చంద్రుడిని రక్షిస్తుంది, సూర్య కాంతి ఫోటాన్స్ నుంచి కాదు) గుండా వెళుతున్నప్పుడు.. దాని ఉపరితలంలో మార్పులను కూడా శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది.
'చంద్రుడు మాగ్నెటోటైల్ వెలుపల ఉన్నప్పుడు, చంద్ర ఉపరితలాన్ని సౌర గాలి ఢీకొడుతుంది. మాగ్నెటోటైల్ లోపల, దాదాపు సౌర గాలి ప్రోటాన్‌లు ఉండవు. నీటి నిర్మాణం దాదాపు సున్నాకు పడిపోతుందని అంచనా. కానీ రిమోట్ సెన్సింగ్ డేటా పరిశీలించినప్పుడు.. చంద్రుడు భూమి మాగ్నెటోటైల్లో ఉన్నప్పుడు ఏర్పడిన నీరు.. అదే చంద్రుడు మాగ్నెటోటైల్ వెలుపల ఉన్నప్పుడు ఏర్పడిన నీరు దాదాపు సమానంగా ఉన్నట్లు తెలిపింది. ఇది ఆశ్చర్యకరం. అయితే సౌర గాలితో సంబంధం లేకుండా భూమి మాగ్నెటోటైల్లో నీరు ఏర్పడే మరో ప్రక్రియ జరిగి ఉండవచ్చని ఇది సూచిస్తుంది. ఇక ప్రత్యేకించి అధిక శక్తి ఎలక్ట్రాన్ల రేడిషేషన్.. సౌర గాలి ప్రొటాన్ల లక్షణాలను ప్రదర్శిస్తుంది'
--షుయ్ లి, అసిస్టెంట్ రీసెర్చర్, యూహెచ్ మనోవా స్కూల్ ఆఫ్ ఓషన్