Loan on Whatsapp: లోన్ కావాలంటే ఒకప్పుడు బ్యాంకులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంక్ యాప్‌లోకి లాగిన్ అయ్యి కొన్ని వివరాలు నమోదుచేస్తే చాలు క్షణాల్లో రుణ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్రయాస కూడా అవసరం లేదంటోంది ముంబయికి చెందిన ఫిన్‌టెక్ సంస్థ క్యాష్‌ఈ (CASHe). కేవలం వాట్సాప్‌లో హాయ్ (Hi) అని చెబితే చాలంటోంది. ఎటువంటి మొబైల్ అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేయకుండా.. ఎలాంటి డాక్యుమెంట్లు పూర్తి చేయకుండానే రుణ సదుపాయం కల్పిస్తామని చెబుతోంది. కృత్రిమ మేధ సదుపాయంతో అందిస్తున్న ఈ సౌకర్యాన్ని తొలిసారి తామే ప్రవేశపెట్టినట్లు క్యాష్‌ఈ పేర్కొంది.
ఇన్‌స్టంట్ క్రెడిట్ లైన్ పొందేందుకు క్యాష్‌ఈ సంస్థ ఓ వాట్సాప్ నంబర్‌ను ప్రత్యేకించింది. 80975 53191 అనే నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వెంటనే చాట్ బాట్ నుంచి మీకు సందేశం వస్తుంది. మీరు అందించే వివరాలను సరిపోల్చుకుని కొన్ని క్లిక్కుల్లోనే రుణం మొత్తాన్ని అందిస్తుంది. అయితే, కేవలం వేతన జీవులకు మాత్రమే ఈ సదుపాయం అందిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.