Pink WhatsApp : ఆధునిక సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ లోగో పింక్ కలర్లోకి మారిందని, సరికొత్త ఫీచర్ల కోసం పింక్ వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఫేక్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ప్రస్తుతం పింక్ వాట్సాప్ స్కామ్ బాగా వ్యాపిస్తోంది. ముంబయి, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ స్కామ్ ఉధృతంగా జరుగుతోంది. అందుకే ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖలు ఈ స్కామ్‌పై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
Police warns about Pink WhatsApp Scam : ముంబయి సైబర్ పోలీసు క్రైమ్ వింగ్ ఆండ్రాయిడ్ వాట్సాప్ వినియోగదారుల కోసం.. 'పింక్ వాట్సాప్ - ఆండ్రాయిడ్ వినియోగదారులకు రెడ్ అలెర్ట్' అంటూ ఓ ట్వీట్ చేసింది. ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా దీనిపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తమవుతున్నాయి.
పింక్ స్కామ్ అంటే ఏమిటి?
What is Pink WhatsApp Scam : వాట్సాప్‌లో లేటెస్ట్ ఫీచర్స్ కోసం పింక్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాళ్లు పంపిన లింక్‌ను కనుక క్లిక్ చేస్తే.. వెంటనే పింక్ వాట్సాప్ మీ డివైజ్‌లోకి డౌన్లోడ్ అయిపోతుంది. యూజర్‌కు తెలియకుండానే హానికరమైన సాఫ్ట్వేర్లు ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతాయి. ఫలితంగా వినియోగదారుడు తన ఫోన్ యాక్సెస్‌ను కోల్పోతాడు.
మన గుట్టు.. హ్యాకర్ల చేతిలో
పింక్ వాట్సాప్ ఇన్స్టాల్ అయిన తరువాత యూజర్‌కు తెలియకుండానే ఫోన్లోని సున్నితమైన సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.