తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

టైమ్​పాస్ ముచ్చట్లే కాదు.. ఈ ఆన్​లైన్ రచ్చబండల్లో ఇంకా ఎన్నో! - క్లబ్ హౌస్ ఫీచర్స్

Best Social Audio Apps: కాలం మారింది.. రచ్చబండలు ఆన్​లైన్​లోకి వచ్చేశాయ్.. సోషల్ ఆడియో యాప్స్ పేరుతో రచ్చ చేస్తున్నాయి. వీటి ద్వారా.. ముఖాలు చూసుకోకుండానే కబుర్లు చెప్పుకునే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరుగుతోంది. మరి ఇందులో పాపులర్ యాప్స్ గురించి వివరాలు మీకోసం..

Social Audio Apps
Social Audio Apps

By

Published : Aug 6, 2022, 2:22 PM IST

Audio Social Media Platforms: పాత రోజుల్లో చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటీ ముచ్చట్లు చెప్పుకునేవారు. ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోవాలంటే మాత్రం రచ్చబండ పెట్టేవారు. కాలం మారింది.. సాంకేతికత అభివృద్ధి చెందింది. పిచ్చాపాటీ ముచ్చట్లైనా, చర్చించుకోవడమైనా ఆన్‌లైన్‌ రచ్చబండలు వచ్చేశాయి. అదేనండీ.. సోషల్‌ ఆడియో యాప్స్‌. వీటిలో ఒకరినొకరు చూడకుండానే కూర్చున్నచోటు నుంచే కబుర్లు చెప్పుకోవచ్చు. ఫొటో/వీడియో షేరింగ్‌ కోసం ఎన్నో పాపులర్‌ సోషల్‌ మీడియాల యాప్‌లు ఉన్నప్పటికీ, సోషల్‌ ఆడియో యాప్స్‌కు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న పాపులర్‌ ఆడియో యాప్స్‌పై ఓ లుక్కేద్దాం...

క్లబ్‌హౌస్‌ (Clubhouse)

ముందుగా అమెరికాలో ఐఓఎస్‌ యూజర్ల కోసం సోషల్‌ ఆడియో యాప్‌ను క్లబ్‌హౌస్‌ ప్రారంభించింది. తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు, ఇతర దేశాల్లోని వారికి పరిచయం చేసింది. తొలినాళ్లలో ఇన్వైట్‌ రిక్వెస్ట్‌ ఫీచర్‌ ద్వారా మాత్రమే యాప్‌ ఉపయోగించేందుకు అనుమతి ఉండేది. తర్వాతి కాలంలో ఈ పద్ధతిని తొలగించారు. దాంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ షేర్ చేయడం సాధ్యంకాదు. కేవలం స్పీకర్ మాట్లాడేది మాత్రం వినగలం. ఒకవేళ మీరు మాట్లాడనుకుంటే ‘చేయి’ సింబల్‌పై క్లిక్‌ చేస్తే, రూమ్‌ క్రియేట్ చేసిన వ్యక్తి మీకు అవకాశం కల్పిస్తారు. మీకు నచ్చిన సమయంలో రూమ్‌ ఓపెన్‌ అయ్యేలా షెడ్యూల్‌ చేసుకోవచ్చు.

ట్విటర్‌ స్పేసెస్‌ (Twitter Spaces)

ట్విటర్‌ స్పేసెస్‌ పేరుతో ట్విటర్‌ ఆడియో ఛాట్/డిస్కషన్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాప్‌లో ట్వీట్‌ కంపోజ్‌/ ప్లస్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే.. స్పేసెస్‌ బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యువర్ స్పేసెస్‌ అని పాప్‌ అప్‌ వస్తుంది. అందులో ఏ అంశంపై చర్చ ప్రారంభించాలనుకుంటున్నారో పేరు టైప్‌ చేసి స్పేసెస్‌ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అంతా క్లబ్‌ హౌస్‌ తరహాలోనే పని చేస్తుంది. క్రియేట్‌ చేసిన స్పేసెస్‌ను అక్కడి నుంచే నేరుగా ట్వీట్‌ చేయొచ్చు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న స్పేసెస్‌లు ట్విటర్‌ ఫ్లీట్స్‌లో కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు జాయిన్‌ అవ్వొచ్చు.

ఫేస్‌బుక్‌ ఆడియో లైవ్‌ రూమ్స్‌ (Facebook Audio Live Rooms)

ఫేస్‌బుక్‌లో కూడా లైవ్‌ ఆడియో రూమ్స్‌ ఫీచర్‌ ఉంది. ముందుగా ఈ ఫీచర్‌ అమెరికాలోని ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. క్లబ్‌హౌస్‌ తరహా ఫీచర్లే ఉన్నప్పటికీ, అదనంగా పాడ్‌కాస్ట్‌ సపోర్ట్ పీచర్‌ ఇస్తున్నారు. ఇందులో ఫండ్‌ రైజింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఆడియో రూమ్‌ను హోస్ట్‌ చేస్తున్న వ్యక్తి శ్రోతలను చందాలు అడగొచ్చు. స్పీకర్స్ సంఖ్యపై ఫేస్‌బుక్ పరిమితి విధించింది. చర్చ జరుగుతున్నప్పుడు కేవలం 50 మంది మాత్రమే మాట్లాడగలరు. శ్రోతల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. త్వరలోనే భారత్ సహా అన్ని దేశాల్లో ఆడియో లైవ్‌ రూమ్స్‌ అందుబాటులోకి రానుంది.

స్పోటిఫై లైవ్‌ (Spotify Live)

మ్యూజిక్‌, పాడ్‌కాస్ట్‌లతో యువతను ఆకట్టుకుంటున్న స్పోటిఫై సంస్థ లైవ్‌ పేరుతో ఆడియో సోషల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. గతంలో దీనిపేరు గ్రీన్‌రూమ్‌గా ఉండేది. స్పోటిఫై ఖాతా ఉన్నవారు ఆ వివరాలతో లైవ్‌లోకి లాగిన్‌ కావొచ్చు. ఆ తర్వాత క్లబ్‌హౌస్‌ తరహాలోనే ఈ యాప్‌ను వాడుకోవచ్చు. అయితే ఇందులో రికార్డింగ్‌ ఆప్షన్‌ అదనంగా ఉంది. రూమ్‌లో జరిగే చర్చ మొత్తాన్ని రికార్డు చేసి స్పాటి లైవ్‌ను హోస్ట్‌ చేసిన వ్యక్తికి మెయిల్‌ చేస్తుంది. ఆడియో రూమ్‌లోకి వచ్చాక.. ఆ రూమ్‌ ఎంతసేపటి నుంచి లైవ్‌లో ఉందనేది తెలుసుకోవచ్చు.

ట్రూకాలర్‌ ఓపెన్‌డోర్స్‌ (Truecaller Opendoors)

ఓపెన్ డోర్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను యాక్సెస్‌ చేసేందుకు అనుమతించాల్సి ఉంటుంది. కాంటాక్ట్స్‌లోని వారు ఎవరైనా ఓపెన్ డోర్స్‌ ద్వారా చర్చలో పాల్గొంటుంటే మీకు నోటిఫికేషన్‌ వస్తుంది. చర్చలో భాగస్వాములు కావాలనుకుంటే నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి సంభాషణలు జరపడంతోపాటు, నచ్చిన అంశాలపై మాట్లాడవచ్చు. ఆంగ్లం, హిందీ, స్పానిష్‌, లాటిన్‌, ఫ్రెంచ్‌ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ద్వారా జరిపే సంభాషణలు ఎక్కడా స్టోర్‌ కావని ట్రూకాలర్‌ తెలిపింది. సంభాషణలు జరిపే సమయంలో యూజర్ల ఫోన్ నంబర్లు ఇతరులు చూడలేరు.

లింక్డ్‌ఇన్‌ లైవ్‌ రూమ్స్‌ (Linkedin Live Rooms)

ప్రొఫెషనల్స్‌ కోసం లింక్డ్‌ఇన్‌ సంస్థ లైవ్‌రూమ్స్‌ పేరుతో ఆడియోరూమ్స్‌ను మార్చి 2022లో పరిచయం చేసింది. క్లబ్‌హౌస్‌ తరహా ఫీచర్లనే లింక్డ్‌ఇన్‌ కూడా అందిస్తోంది. యాప్‌ ఓపెన్‌ చేసి అందులో కనిపించే ఏదైనా చర్చలో శ్రోతగా పాల్గొనవచ్చు. ఒకవేళ చర్చలో మాట్లాడనుకుంటే హోస్ట్‌కు రిక్వెస్ట్ పంపాలి. త్వరలో ఇందులో వీడియో, చాట్ ఫీచర్‌ను కూడా పరిచయం చేస్తామని లింక్డ్‌ఇన్‌ చెబుతోంది. దీని ద్వారా వేర్వేరు రంగాల్లోని నిపుణులు సులువుగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details