కొత్త పీసీని కొన్నప్పుడు.. విండోస్‌ను రీఇన్‌స్టాల్ చేసినప్పుడు అందరూ ముందుగా చేసే పని యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయటం. అద్భుతమైన విండోస్ పోగ్రామ్‌లు చాలానే ఉన్నాయి. వీటిల్లో విండోస్ 10, విండోస్ 11కు తప్పనిసరి సాఫ్ట్‌వేర్లు ఏంటనేవి తెలుసుకొని ఉండటం మంచిది. ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్, క్లౌడ్ స్టోరేజీ కోసం గూగుల్ డ్రైవ్ వంటి వాటి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీటితో పాటు మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడే మరికొన్ని యాప్స్ గురించి తెలుసుకుందాం.
ఆఫీస్ సూట్: లీబ్రాఫీస్
డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్ల వంటివి అనగానే ముందుగా గుర్తుచ్చేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్. దీన్ని డబ్బులు చెల్లించి కొనుక్కోవాల్సిందే. మరి ఉచితంగా ఆఫీస్ సూట్‌ను వాడుకోవాలంటే? లీబ్రాఫీస్ చక్కని మార్గం. ఇది పూర్తిగా ఉచితం. మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, యాక్సెస్ వంటి వాటికి మంచి ప్రత్యామ్నాయం. చూడటానికి ఎంఎస్ ఆఫీస్ కన్నా కాస్త భిన్నంగా ఉండొచ్చు గానీ త్వరగానే అలవడుతుంది. ఒకప్పుడు ఎంఎస్ ఆఫీస్‌కు ఓపెన్ ఆఫీస్ ప్రత్యామ్నాయంగా బాగా ఆదరణ పొందింది. ప్రస్తుతం దీన్ని పెద్దగా వాడటం లేదు. ఒకవేళ లీబ్రాఫీస్ వద్దనుకుంటే ఫ్రీఆఫీస్‌ను ప్రయత్నించొచ్చు. వర్డ్ ఆన్‌లైన్, గూగుల్ డాక్స్‌లనూ వాడుకోవచ్చు.
ఇమేజ్ ఎడిటర్: పెయింట్.నెట్
ఫొటోలను ఆకర్షణీయంగా కనిపించేలా చేయటానికి, సున్నితమైన అంశాలను మసకగా చేయటానికి, పాత ఫొటోలను కొత్తగా తీర్చిదిద్దటానికి ఇమేజ్ ఎడిటింగ్ ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం తప్పనిసరి. ఇలాంటి పనులకు ఫొటోషాప్‌నే ప్రామాణికంగా పరిగణిస్తుంటారు. కానీ ఉచిత టూల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పెయింట్.నెట్ ఒకటి. మైక్రోసాఫ్ట్ పెయింట్ కన్నా ఇది మెరుగైంది. వాడుకోవటమూ తేలికే. ఫొటోలోని భాగాలను ఇట్టే బ్లర్ చేసుకోవచ్చు. ఆటో-లెవెల్ ఫీచర్‌తో ఫొటోలను మరింత ఆకర్షణీయంగా మలచుకోవచ్చు. టెక్స్ట్, ఆకారాలను జోడించుకోవచ్చు. ప్లగిన్స్‌తో ఇంకాస్త ఎక్కువ ఫీచర్లను వాడుకోవచ్చు. పెయింట్.నెట్ మరీ ప్రాథమిక స్థాయిలో ఉందనిపిస్తే జీఐఎంపీని ప్రయత్నించొచ్చు. ఇదింకాస్త అధునాతమైంది. ఇదీ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది.
స్క్రీన్‌షాట్స్: షేర్‌ఎక్స్
విండోస్ మీద స్క్రీన్‌షాట్ తీసుకోవటం చాలావాటికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం స్నిప్పింగ్ టూల్, స్నిప్ అండ్ స్కెచ్ యాప్స్ ఉన్నాయి గానీ వీటిల్లో ఫీచర్లు తక్కువ. అదే షేర్‌ఎక్స్‌లోనైతే బోలెడన్ని క్యాప్చర్ పద్ధతులు ఉంటాయి. దీనిలోని బిల్టిన్ ఎడిటర్ ఫీచర్ స్క్రీన్‌షాట్ తీసుకున్నాక దానంతటదే మెరుగులు దిద్దుతుంది. కలర్ గ్రాబర్, రూలర్ వంటి ఫీచర్లనూ వాడుకోవచ్చు. ఒకవేళ షేర్‌ఎక్స్ వద్దనుకుంటే పిక్‌పిక్ యాప్‌ను ప్రయత్నించొచ్చు. చూడటానికి మామూలుగా కనిపించినా ఫీచర్ల విషయంలో రాజీ పడదు.