బొమ్మలు వేయటమంటే అందరికీ ఇష్టమే. అందరికీ సరదానే. ఆర్టిస్టులం కాకపోయినా ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి గీయటం మనలో చాలామందికి అలవాటే. అదేదో ఐప్యాడ్ మీద గీసి చూస్తే? నేరుగా ఐప్యాడ్ తెర మీద బొమ్మలు వేయటం సాధ్యం కాదుగానీ యాప్‌ల తోడు తీసుకుంటే తేలికే. వీటితో ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడుంటే అక్కడ డూడుల్స్, దృశ్యాలు, స్కెచ్‌ల వంటివెన్నో ఇట్టే సృష్టించేసుకోవచ్చు. వీటితో ఐప్యాడ్ ఏకంగా ఆర్ట్ స్టుడియోగా మారుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మంచి కళాకారులకు, డిజైనర్లకే కాదు.. ఔత్సాహికులకూ ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి. స్కెచ్ నైపుణ్యాలను పెంచుకోవటానికి, తమ సాధనను ప్రదర్శించుకోవటానికి ఎంతగానో వీలు కల్పిస్తాయి.
ఇలస్ట్రేటర్
దీంతో ఐప్యాడ్ మీద మన సృజనాత్మకతను తేలికగా ప్రదర్శించుకోవచ్చు. కీలక డిజైన్ సామర్థ్యాలతో కూడిన ఇందులో చాలా ఫీచర్లున్నాయి. వీటితో వృత్తాకారాలు, దీర్ఘచతురస్రాకారాలు, ప్రతిబింబ రూపాల వంటివీ సృష్టించుకోవచ్చు. ఇవి డిజైనర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రైమరీ ఇలస్ట్రేటర్ సాఫ్ట్‌వేర్‌తో ఆర్టిస్టులు ఫైళ్లను ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు. సృజనాత్మక స్కెచ్‌లు, దృశ్యాలను మార్చుకోవటం, మెరుగు పరచుకోవటం వంటి వాటికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లోనూ అందుబాటులో ఉంది.
ఫొటోషాప్
ఫొటోలను ఎడిట్ చేసే ప్రొగ్రామ్‌గా మొదలైన ఇది క్రమంగా మంచి ఆర్ట్ డిజైనర్ టూల్‌గా మారింది. ఇన్నేళ్లుగా దీని ఫీచర్లు, పనితీరు మెరుగు పడుతూనే వస్తున్నాయి. చాలామంది ఆర్టిస్టులకు ఇదిప్పుడు చేతి కుంచెగా మారిందన్నా అతిశయోక్తి కాదు. అన్నింట్లోనూ మార్పులు చేసుకోవటానికి వీలు కల్పించే కర్వ్స్, సబ్జెక్ట్ సెలెక్ట్ టూల్ వంటి ఎన్నో ఫీచర్లు దీని సొంతం. ఆర్ట్ డిజైనింగ్‌కు ఇదెంతో అనువైన యాప్. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌తో పాటు విండోస్‌లోనూ అందుబాటులో ఉంటుంది.
అడోబ్ ఫ్రెస్కో
డ్రాయింగ్ యాప్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ఇది. సంప్రదాయ డ్రాయింగ్ టూల్స్‌ను, ఆయా వస్తువులను వినూత్నంగా తీర్చిదిద్దటం దీని ఉద్దేశం. ఇది ప్రత్యక్ష బ్రష్‌లతో సున్నితమైన డ్రాయింగ్ అనుభూతిని కల్పిస్తుంది. వివిధ డ్రాయింగ్ తీరులను అనుసరించటానికి వీలు కల్పిస్తుంది. కామిక్ ఇలస్ట్రేషన్, పిక్చర్ ఇంకింగ్ మాత్రమే కాదు.. చాక్, పెయింటింగ్ వంటి డ్రాయింగ్ స్టైల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇలస్ట్రేషన్లు, రంగులు వేయటం, చాక్ స్కెచ్‌లు, ప్రత్యక్ష బ్రష్‌లు దీని ప్రత్యేకం. ఇది ఐఓఎస్, విండోస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
ఇన్‌స్పైర్ ప్రొ
ఐప్యాడ్ టూల్స్‌లో ఎంతోమందిని ఆకర్షిస్తున్న టూల్ ఇది. ఆయిల్ పెయింట్ బ్రష్, ఎయిర్ బ్రష్, స్ప్రే పెయింట్, పెన్సిళ్లు, క్రేయాన్లు, మార్కర్లు, చాక్, చార్‌కోల్, పెయింట్ స్పాటర్స్ వంటి 150కి పైగా బ్రష్‌లు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఆర్టిస్టుకు అవసరమైన ప్రత్యేకమైన దృశ్య టూల్స్ ఎన్నో దీని సొంతం. ఇది యాపిల్ పెన్సిల్, ఐప్యాడ్ ప్రొ నూ సపోర్టు చేస్తుంది. ఆయా బ్రష్‌లు మనం ప్రయోగించిన ఒత్తిడి, వంపు, దృశ్యాల దిశలకు అనుగుణంగా వెంటనే స్పందిస్తాయి. ఇలా అపరిమిత సృజనాత్మకతకు వీలు కల్పిస్తాయి. ఆయిల్ స్కెచ్‌లు, స్ప్రే పెయింట్, ఎయిర్ బ్రష్ పెయింటింగ్ వంటి వాటికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి కేవలం ఐఓఎస్ ఫ్లాట్‌ఫామ్‌కే పరిమితం.
ప్రొక్రియేట్
ఐప్యాడ్ మీద వేగంగా, వివిధ శైలులతో అన్నిరకాల పరికరాలకు అనుగుణమైన చిత్రాలు వేయాలనుకునే కళాకారుల్లో బాగా ప్రాచుర్యం పొందిన యాప్ ఇది. దీంతో భారీ, సంక్లిష్టమైన కళాఖండాలు సృష్టించొచ్చు. బొమ్మలు గీస్తున్నప్పుడు వాటికి అనుగుణంగా బ్రష్‌ల సైజును మార్చుకోవటానికి వీలుగా తేలికైన స్లైడర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించిన వస్త్రాల రూపకల్పన, ఆర్ట్ లేయర్లు, బాగా పెద్దగా చేసుకోదగిన జూమ్, రంగులను మసకబరచటానికి అనువైన ఆప్షన్లతో పాటు తేలికగా అన్‌డూ చేసుకునే వెసులుబాటు ఉండటం దీని ప్రత్యేకత. కళాఖండాలు, రంగుల డిజైన్లు, రంగుల ఎంపిక, ప్రత్యేకించిన కళాఖండాలకు ఇది పెట్టింది పేరు. ప్రొక్రియేట్ ఐఓఎస్ వినియోగదార్లకే ప్రత్యేకం.
లైనియా స్కెచ్
ఎంతోమంది కాక్షించే యాప్ ఇది. ఐప్యాడ్ మీద సమర్థంగా, తేలికగా చిత్రాలు గీయాలని అనుకునేవారికిది ఎంతో అనువైంది. ఇందులో ఇమేజ్ బ్లెండ్, ఫిల్ టూల్స్ సిద్దంగా ఉన్నాయి. ఆయా చిత్రాలకు పలు రంగులను ఎంచుకునే వీలుంది. కళాకారులు తమ చేతి వేళ్లతో లేదా యాపిల్ పెన్సిల్‌తోనూ చిత్రాలు గీసుకోవచ్చు కూడా. బొమ్మలు వేస్తున్నప్పుడు దాన్నంతా రికార్డింగ్ చేసుకునే వెసులుబాటూ ఉండటం విశేషం. బ్రష్‌తో, వేళ్లతో స్కెచ్‌లు వేయాలనుకునే ఔత్సాహికులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఐఓఎస్ వాడకం దార్లకే ప్రత్యేకం.
అఫినిటీ డిజైనర్
ఇట్టే స్పందించే టచ్ కంట్రోల్స్‌తో కూడుకున్న ఇది వెక్టర్ డ్రాయింగ్ టూల్. యాపిల్ పెన్సిల్ సాఫ్ట్‌వేర్‌ను సపోర్టు చేస్తుంది. పలు లేయర్లతో కూడిన భారీ కాన్వాస్ దృశ్యాలకూ అఫినిటీ డిజైనర్ అనువైంది. ఇది సీఎంవైకే, ఆర్‌జీబీ రెండింటినీ సపోర్టు చేస్తుంది. ఇందులో పూర్తిస్థాయి ప్యాంటోన్ లైబ్రరీ యాప్ కూడా ఉంది. ఇది డిజిటల్, ప్రింటెడ్ ఆర్ట్‌లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జేపీజీ, పీఎన్‌జీ, ఎస్‌వీజీ వంటి వివిధ ఇమేజ్ ఫార్మట్లనూ కలిగి ఉంటుంది. వందకు పైగా బ్రష్‌లతో బొమ్మలు గీసుకోవచ్చు. ఐఓఎస్, మ్యాక్‌తో పాటు విండోస్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో ఉంది.
ఇవీ చదవండి: