ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు మనం ఒకటికి రెండుసార్లు ఆ మొత్తాన్ని లెక్కిస్తాం. బ్యాంకు శాఖకు వెళ్లి, నగదు జమ చేసేటప్పుడు మన ఖాతా సంఖ్య, ఇతర వివరాలు రాసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటాం. కానీ, చాలామంది డిజిటల్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు కనీస జాగ్రత్తలు మర్చిపోతుంటారు. మోసగాళ్లు తమ పనిని సులువుగా చేసేందుకు ఇవే కారణం అవుతున్నాయి. ఆర్‌బీఐ సైతం ఈ అంశాలపై ఎప్పటికప్పుడు ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉంది. అయినప్పటికీ రోజూ ఎక్కడో ఒక చోట డబ్బులు పోగొట్టుకున్న కథనాలు మనం చూస్తూనే ఉన్నాం.
క్లిక్ చేసి.. వివరాలు ఇవ్వాలంటూ...
మోసం చేస్తున్నట్లు ఖాతాదారులు ఏమాత్రం గుర్తించని విధంగా మోసగాళ్లు సాంకేతికతను వినియోగించుకుంటారు. ముఖ్యంగా బ్యాంకు వెబ్‌సైట్లను పోలిన నకిలీ సైట్లను తయారు చేస్తారు. వాటి నుంచి మీకు ఇ-మెయిల్‌లో లింకులు పంపిస్తుంటారు. లేదా మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ చేస్తారు. ఒకటి రెండు వివరాలు అడిగి.. మన ఖాతాను మొత్తం వారి చేతుల్లోకి తీసుకుంటారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ చెబుతారు. మీ పేరు.. కార్డులోని చివరి నాలుగు అంకెలు చెప్పేస్తారు. నిజమేనని నమ్మి వారు అడిగిన వివరాలు ఇచ్చేస్తారు.
- మీ ఫోన్, సామాజిక వేదికల పాస్‌వర్డ్‌లు ఎవరికైనా చెబుతారా? అత్యంత రహస్యంగా భావిస్తారు కదా. మరి, బ్యాంకు ఖాతా వివరాలు అంతకన్నా సురక్షితంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు వివరాలు వాటి రహస్య సంఖ్యలు (పిన్), పాస్‌వర్డ్‌లు ఎవరికీ తెలియనీయొద్దు.
- ఒకవేళ మీ డెబిట్, క్రెడిట్ కార్డును కుటుంబంలో ఇతరులూ ఉపయోగిస్తుంటే.. తరచూ పాస్‌వర్డ్, పిన్‌ను మార్చేస్తుండాలి. వారికి అవసరం అయినప్పుడు మిమ్మల్ని అడగాలని చెప్పండి. బ్యాంకులు, ఇ-కామర్స్ వెబ్‌సైట్లు.. చెల్లింపుల సంస్థలు మీకు ఫోన్ చేసి, ఇ-మెయిల్ పంపి, వన్‌టైం పాస్‌వర్డ్ (ఓటీపీ)ని చెప్పాలని అడగవు. అడిగితే... మోసం అంతే,మరోమాటకు తావులేదు.
యాప్‌ల మాయలో పడొద్దు..
సామాజిక వేదికల్లో ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి. చాలామంది వీటిపై నేరుగా క్లిక్ చేసేస్తుంటారు. ఇలా చేసినప్పుడు అసలు యాప్‌లను పోలిన నకిలీ యాప్‌లు ప్రత్యక్షం కావడంతోపాటు, నేరుగా మీ మొబైల్‌లోకి డౌన్‌లోడ్ అయిపోతాయి. అక్కడి నుంచి మీ మొబైల్, కంప్యూటర్లలోని సమాచారాన్ని మోసగాళ్లకు చేరవేస్తుంటాయి. కొన్నిసార్లు పూర్తిగా మొబైల్, కంప్యూటర్లను వారే స్వాధీనం చేసుకొని, మన సమాచారాన్ని తస్కరిస్తారు.మీరు ఒక ప్రకటన చూసినప్పుడు వెంటనే దాన్ని క్లిక్ చేయకుండా.. ఆ ప్రకటన ఇచ్చిన అసలు ఇ-కామర్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లండి.
మీ మొబైల్‌లో యాప్ ఉన్నప్పటికీ డౌన్‌లోడ్ అడుగుతోంది అంటే అది మోసపూరిత యాప్. ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు దానిని తయారు చేసిందెవరు, డౌన్‌లోడ్లు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి. ఉదాహరణకు ప్రముఖ ఇ-కామర్స్ యాప్‌ల డౌన్‌లోడ్లు లక్షల్లో ఉంటాయి. అందుకు భిన్నంగా వందలు, వేలలో ఉన్నట్లు కనిపిస్తుంటే అనుమానించాల్సిందే. యాప్‌లు మీ వ్యక్తిగత సమాచారాన్ని అంటే మీ ఫోన్‌లో ఉన్న నెంబర్లు, ఫొటోలు, ఇతర వివరాలను ఎంత మేరకు వినియోగించుకుంటున్నాయన్నదీ చూసుకోవాలి. అవసరం లేని వాటికి అనుమతి నిరాకరించాలి.
క్యూఆర్ కోడ్‌తో..
మనం ఎవరికైనా డబ్బులు చెల్లించాలనుకోండి.. అప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కానీ, కోడ్ పంపించి, పిన్ నమోదు చేస్తే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పారంటే ఎక్కడో తేడా ఉన్నట్లే. యూపీఐ ఆధారిత యాప్‌ల ద్వారా మీకు డబ్బు పంపేందుకు మీ ఫోన్ నంబరు వారికి తెలిస్తే చాలు. అంతేకానీ, ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌లను స్కాన్ అవసరం లేదు. ఎం-పిన్‌ను నమోదు చేయక్కర్లేదు.