తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మోనిక ఆలోచన.. పల్లెకు వెలుగునిస్తోంది! - founder of cydee technologies

గ్రామాల్లో పొద్దుగూకిన తర్వాత వీధిదీపాలు లేని దారుల్లో నడవాలంటే గుండెలు చిక్కబట్టుకోవాలి. కొన్నిచోట్ల గుడ్డిదీపాలే ఉంటాయి. మహిళలు, పిల్లలు అలాంటి బాటలో వెళ్లాలంటేనేే భయపడతారు. పాములబెడద ఉంటే ఇక చెప్పక్కర్లేదు. వీధిదీపాల పరిస్థితులపై అధ్యయనం చేసిన మోనిక ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఇందుకు పరిష్కారంగా ఐదుదీపాలిచ్చే కాంతిని ఒకే దీపం ఇచ్చేలా వినూత్నమైన స్ట్రీట్‌లైట్లని కనిపెట్టింది. దేశవ్యాప్తంగా వీటిని అమరుస్తోంది..

bangalore scientist monika jha invented automatic street lights
ఆటోమేషన్‌ ఆఫ్‌ స్ట్రీట్‌లైటింగ్

By

Published : Feb 23, 2021, 9:55 AM IST

‘మనసు పెట్టి ఆలోచిస్తే...మన చుట్టూ ఉన్న ఎన్నో సమస్యల్ని గుర్తించవచ్చు. వాటికి పరిష్కారాల్నీ ప్రయత్నించొచ్చు’ అంటోంది బెంగళూరుకి చెందిన మోనికా ఝా. ఈమె తయారుచేసిన లైట్లతో 30 శాతం విద్యుత్‌నీ, 40 శాతం డబ్బునీ ఆదా చేయొచ్చంటోంది. మోనిక ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. చదువులో భాగంగా చివరి ఏడాది ఓ అంశాన్ని ఎంచుకుని ప్రాజెక్టు పూర్తి చేయాలి. అలా ఎంచుకున్నది సామాజిక ప్రయోజనం ఉన్నదైతే మరీ మంచిది.

మోనికా ఝా

అందుకే ఆమె ‘ఆటోమేషన్‌ ఆఫ్‌ స్ట్రీట్‌లైటింగ్‌’ అనే అంశాన్ని ఎంచుకుంది. ఇందుకోసం ఓ చిన్నపాటి అధ్యయనం చేసింది. తమ ప్రాంతంలోని వీధిదీపాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాటినీ పరిశీలించింది. ‘కొన్నిచోట్ల పాడయ్యాయి. ఇంకొన్ని...రోడ్ల వెడల్పునకు అవసరమైన కాంతిని అందించలేకపోతున్నాయి. పైగా వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చకపోవడంతో రోడ్లపై పడాల్సినంత వెలుతురు ప్రసరించడం లేదు అనిపించింది.. దీనివల్ల బోలెడు విద్యుత్‌, డబ్బు వృథా అవుతోంది. ప్రత్యామ్నాయాలు పెద్దగా కనిపించలేదు. దాంతో ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ ఇబ్బందికి ఓ పరిష్కారం చూపించాలనుకున్నా’ అని చెబుతోంది మోనిక. చదువయ్యాక ఏడెనిమిది నెలల పాటు ఈ లైట్లపైనే పరిశోధించింది.

ఐదింటికి సమానం..

ఇప్పుడున్న సంప్రదాయ లైట్లు 120 డిగ్రీల వరకూ కాంతిని ప్రసరింపచేస్తాయి. కానీ అన్నివైపులకీ వెలుగుల్ని ఇవ్వవు. మోనిక తయారుచేసిన లైట్లు రెండు వైపులా కొద్దిగా ఒంపు తిరిగి ఉండి.. 160 డిగ్రీల వరకూ కాంతిని విస్తరిస్తాయి. దాంతో ఎక్కువ దీపాల అవసరం ఉండదు. ఈ ఆలోచనలతో ఓ ప్రోటోటైప్‌ని తయారు చేసింది. పీన్యా మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ సాయంతో కొన్ని నమూనా లైట్లని తయారుచేసి.. మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంగణంలో ఉన్న ఇల్యుమినేషన్‌ ఇంజినీరింగ్‌ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి విజయం సాధించింది.

‘కైడీ టెక్నాలజీస్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి లైట్ల తయారీకి అనుమతి సాధించింది. దీన్ని ఈఈఎస్‌ఎల్‌ సంస్థ ఉత్తమ ఆవిష్కరణగా గుర్తించి ఐదులక్షల రూపాయల్ని బహుమతిగా ఇచ్చింది. తమ సంస్థలో ఈ లైట్లను పరీక్షించుకుని మెరుగుపరుచుకునే అవకాశమూ కల్పించింది. ‘ఐదేళ్ల జీవితం కాలం ఉండే ఇవి...సెమీ స్మార్ట్‌ ఫీచర్స్‌తో దొంగతనం చేయడానికి వీలు లేకుండా ఉంటాయి. 160 డిగ్రీల కోణంలో కాంతిని దేదీప్యమానంగా ప్రసరింపజేస్తాయి. ఐదు సంప్రదాయ లైట్ల స్థానంలో ఇది ఒకటి ఏర్పాటు చేస్తే చాలు. ఫలితంగా 30 శాతం విద్యుత్‌ని, 40 శాతం డబ్బుని ఆదా చేయగలం’ అంటోంది మోనిక. ఇప్పటికే ఆమె సంస్థ బెంగళూరుతో పాటు పుణె, మణిపుర్‌తో సహా దేశవ్యాప్తంగా ఐదు వందలకు పైగా స్ట్రీట్‌లైట్స్‌ని ఏర్పాటు చేసింది. ఈఈఎస్‌ఎల్‌, కేంద్ర విద్యుత్‌ శాఖ, వరల్డ్‌బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వంటి సంస్థల నుంచి అవార్డులెన్నో అందుకుందీ ఆవిష్కరణ.

ABOUT THE AUTHOR

...view details