BAJAJ PULSAR KTM EV: ఇండియన్ మార్కెట్లో విద్యుత్ వాహనాల(ఈవీ) హవా క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్ అంతా 'ఈవీ'లదే అన్న అంచనాల నేపథ్యంలో పెద్ద కంపెనీలన్నీ ఈ మార్కెట్లో పాగా వేయాలని ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నాయి. ఈ దిశగా బజాజ్ సైతం చకచకా అడుగులు వేస్తోంది. ద్విచక్రవాహన విభాగంలో సంచలనమైన పల్సర్‌ను సైతం త్వరలో విద్యుత్ మోడల్ రూపంలో చూసే అవకాశం రాబోతోంది. 'పల్సర్ ఈవీ'ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు బజాజ్ సంస్థ తెలిపింది.
KEM EV scooter: సమీప భవిష్యత్‌లో.. సంప్రదాయ 'ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్'ల(ఈసీఈ)తో పాటు ఎలక్ట్రానిక్ విభాగంలో తమ సంస్థ పోటీ పడుతుందని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత ద్విచక్ర వాహన విభాగంలో ఒకప్పుడు రాజ్యమేలిన 'చేతక్'.. ఇప్పుడు విద్యుత్ వాహనంగా రాబోతోంది. దీన్ని మరిన్ని సెగ్మెంట్లలో అందుబాటులోకి తేనున్నట్లు రాకేశ్ శర్మ తెలిపారు. పల్సర్ ఈవీని సబ్ బ్రాండ్‌గా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. కుర్రకారులో మంచి క్రేజ్ ఉన్న 'కేటీఎం' బైక్‌ను సైతం విద్యుత్ వాహనంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు, హస్క్వానా బైక్‌లు సైతం ఈవీ రూపంలో రానున్నట్లు తెలుస్తోంది.