Research in science and technology in india: స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశంలో నెలకొన్న పుట్టెడు సమస్యలకు పరిష్కారం చూపాయి... సైన్స్ పరిశోధనలు. ఇంతింతై వటుడింతై అన్నట్టు.. మనదేశం ఖగోళ, జీవ, రసాయన, వ్యవసాయ, వైద్య, ఔషధ, ఐటీ తదితర రంగాల్లో ఎన్నో మైలురాళ్లు దాటి, అద్భుత ప్రగతి సాధించింది. ఉపగ్రహాలు నిర్మించి, అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడం.. చంద్రుడు, అంగారకుడి వద్దకు వ్యోమనౌకలను పంపడం ద్వారా ప్రపంచ యవనికపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కమ్యూనికేషన్లు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో సాధించిన పురోగతితో వాతావరణం, తుపాన్ల గురించి ముందే అప్రమత్తమై.. వేల మంది ప్రాణాలను కాపాడుకోవడం వీలవుతోంది. పరిశోధనలు, ప్రభుత్వ విధానాల మేళవింపుతో ఆహారం, పాలు, పండ్లు, కూరగాయలు, ఔషధాలు, టీకాల్లో స్వయం సమృద్ధి సాధించింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని శతాబ్దాలుగా పుణికిపుచ్చుకుంటున్న భారత్... ఈ రంగంలో ఎలాంటి విజయాలను నమోదు చేసింది? శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనే నాటికి అగ్రదేశాల సరసన నిలిచేందుకు వచ్చే పాతికేళ్లలో ఎలాంటి సాంకేతికతల్లో రాణించాలి?...
దారి చూపిన దార్శనికత:పరాయి పాలనతో దేశం సామాజికంగా, ఆర్థికంగా చితికిపోయింది. ఆ దశలో నెహ్రూ దార్శనికతతో ఐఐటీలకు 1950లో పునాది పడింది. దేశాన్ని ఆధునికంగా మార్చేందుకు శాస్త్ర సాంకేతిక విభాగం; శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్) ఏర్పాటయ్యాయి. నేడు 37 జాతీయ పరిశోధనశాలలు, 39 ఔట్‌రీచ్ కేంద్రాలు, మూడు ఇన్నోవేషన్ కాంప్లెక్స్‌లు, 3,500 మంది శాస్త్రవేత్తలతో సీఎస్‌ఐఆర్ విలసిల్లుతోంది. ఓషనోగ్రఫీ, జియోఫిజిక్స్, కెమికల్స్, డ్రగ్స్, జీనోమిక్స్, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, మైనింగ్, ఏరోనాటిక్స్ రంగాల్లో ఆ సంస్థ సేవలు అందిస్తోంది.
- నాడు ఆహార కొరతతో అల్లాడుతున్న దేశాన్ని 'హరిత విప్లవం' అన్నపూర్ణగా మార్చింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి.. అధిక దిగుబడినిచ్చే, చీడపీడలను తట్టుకొనే వంగడాలను అభివృద్ధి చేయడంతో పంటల దిగుబడి జోరందుకుంది.
- స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత్ శిశువుల ఆహారం, వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తులనూ దిగుమతి చేసుకునేది. విదేశాల్లో ఉన్నత చదువులు ముగించుకుని 1949లో భారత్‌కు తిరిగొచ్చిన వర్ఘీస్ కురియన్.. హెచ్.ఎం.దల్యా అనే యువ ఇంజినీర్‌తో కలిసి గేదె పాలను పొడిగా మార్చారు. ఇదే క్షీర విప్లవానికి నాంది పలికి..పాల ఉత్పత్తుల్లో దేశం సమృద్ధి సాధించింది.
- చేపల ఉత్పత్తిని పెంచేందుకు 1970లో మత్స్య రైతుల అభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ.. ఇందుకు పరిజ్ఞానాలను అందించింది.
- 1970ల్లో ప్రయోగించిన ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్ తరగతి ఉపగ్రహాలతో కోట్ల మందికి కమ్యూనికేషన్లు, టీవీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తుపాన్లు వంటి వాతావరణ పోకడలపై ముందస్తు అంచనాలు సాధ్యమయ్యాయి.
- 1980ల్లో 'వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (వీశాట్)' సాంకేతికతతో బ్యాంకింగ్ తదితర సేవల్లో భారీ మార్పులు వచ్చాయి.
- పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ వంటి రాకెట్లను ఇస్రో సిద్ధం చేసింది. అగ్రరాజ్యాలకు దీటుగా క్రయోజెనిక్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని రూపొందించింది. విదేశీ ఉపగ్రహాలనూ ప్రయోగించింది. చంద్రుడు, అంగారకుడి వద్దకు వ్యోమనౌకలను పంపింది. గగన్‌యాన్ పేరిట వ్యోమగాములను నింగిలోకి పంపనుంది.
- ఒకప్పుడు మన దేశ ఔషధ పరిశ్రమలో విదేశీ కంపెనీల ఆధిపత్యం ఉండేది. 1954లో హిందూస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, 1961లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్' (ఐడీపీఎల్) ఏర్పాటుతో ఆ పరిస్థితి మారిపోయింది.
- 1970ల్లో టెలిఫోన్ కనెక్షన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. 1984లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్) ఏర్పాటు కావడంతో పల్లెలకూ టెలిఫోన్ సంధానత శరవేగంగా అందుబాటులోకి వచ్చింది.
- స్వదేశీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అభివృద్ధికి 1970లో ఎలక్ట్రానిక్స్ శాఖ ఏర్పాటయింది. ఈసీఐఎల్, సీఎంసీ వంటి సంస్థలూ అంకురించాయి. దేశంలో తొలి ప్రధాన ఐటీ వినియోగం 1986లో జరిగింది. తద్వారా రైల్వేల్లో ప్రయాణికుల రిజర్వేషన్ ప్రాజెక్టును చేపట్టారు.
- 1954లో అణుశక్తి విభాగం ఏర్పాటైంది. 1974లో భారత్ తొలి అణుపరీక్షను నిర్వహించి, అణ్వస్త్ర దేశంగా అవతరించింది.
1960ల్లో విక్రమ్ సారాభాయ్ భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ ఛైర్మన్‌గా ఉండేవారు. కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, వాతావరణ అంచనాల కోసం ఉపగ్రహ పరిజ్ఞానాన్ని ఉపయోగించొచ్చని ఆయన చెప్పినా, చాలామంది పట్టించుకోలేదు. కానీ, కొన్నేళ్లకే భారత్ తన అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టింది. అదే ఏడాది ఆగస్టులో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సహకారంతో శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్ (సైట్) పేరిట ప్రయోగం నిర్వహించింది. దీంతో పలు రాష్ట్రాల పల్లెల్లో 2,400 నలుపు తెలుపు టీవీలు సందడి చేశాయి.
మొదటి 50 దేశాల్లో..
- పరిశోధనల సామర్థ్యాన్ని సూచించే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో.. ప్రపంచంలోని మొదటి 50 దేశాల్లో భారత్ చోటు సంపాదించింది. 2015-16 నాటి ఈ జాబితాలో 81వ స్థానంలో ఉన్న భారత్... 2021లో 46వ స్థానానికి చేరింది. అయితే, 34 అల్ప, మధ్యాదాయ దేశాల్లో మాత్రం మనది రెండో స్థానం.
- 2020-21లో భారత్‌లోని పరిశోధకులకు మంజూరైన పేటెంట్లు 28,391. 2010-11లో వాటి సంఖ్య 7,509గానే ఉండేది. 2020-21లో ప్రపంచ వ్యాప్తంగా దాఖలైన మొత్తం పేటెంట్ దరఖాస్తుల్లో మనదేశ నిపుణుల వాటా ఏకంగా 40%. 2010-11లో అది 20 శాతంగానే ఉండేది. ఇంత పురోగతి సాధించినా.. అగ్రదేశాలతో పోలిస్తే భారత్‌లో మంజూరైన మొత్తం పేటెంట్ల సంఖ్య తక్కువే. ప్రపంచ మేధో హక్కుల సంస్థ (విపో) గణాంకాల ప్రకారం- 2020లో చైనా (5.3 లక్షలు), అమెరికా (3.52 లక్షలు), జపాన్ (1.79 లక్షలు), దక్షిణ కొరియా (1.35 లక్షలు)లు మన కన్నా చాలా ముందంజలో ఉన్నాయి.
- విశ్వంలో గెలాక్సీలతో కూడిన ఒక భారీ సూపర్ క్లస్టర్‌ను భారత ఖగోళశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 20 మిలియన్ బిలియన్ సూర్యుళ్ల అంత పెద్దది. దీనికి సరస్వతి అని పేరు పెట్టారు.
- దేశంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ 'దుర్గ' 1978 అక్టోబరు 3న కలకత్తాలో జన్మించింది. ఆమె ప్రపంచంలోనే రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ. ప్రపంచ తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ మేరీ లూసీ బ్రౌన్ బ్రిటన్‌లో జన్మించిన 67 రోజులకే మన దేశంలో డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ్ నేతృత్వంలోని బృందం ఈ ఘనత సాధించింది.
- శాస్త్ర పరిశోధనల రంగంలో నలుగురు భారతీయులకు నోబెల్ పురస్కారం లభించింది. 1930లో సి.వి.రామన్ (భౌతికశాస్త్రం), 1968లో హర్‌గోవింద్ ఖొరానా (వైద్యశాస్త్రం), 1983లో సుబ్రమణ్యం చంద్రశేఖర్ (భౌతిక శాస్త్రం), 2009లో వెంకటరామన్ రామకృష్ణన్ (రసాయన శాస్త్రం) వీటిని సాధించారు.
- 1980ల్లో అగ్రదేశాలు అనేకరకాల సాంకేతిక పరిజ్ఞానాలను భారత్‌కు నిరాకరించాయి. దీంతో స్వదేశీ పరిజ్ఞానంతో సూపర్ కంప్యూటర్ అభివృద్ధి చేయడానికి 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్)ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది 'పరమ్' అనే తొలి స్వదేశీ సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసింది. భారత ఆధునిక సాంకేతిక ప్రయాణంలో ఇదో పెద్ద మైలురాయి.