కృత్రిమ మేధ(AI) వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు పోతాయంటే కొన్నేళ్ల కిందట వరకు ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్‌బాట్ చాట్‌జీపీటీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాట్‌జీపీటీ వల్ల కృత్రిమ మేధ సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాల్లో కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధ వల్ల సాఫ్ట్వేర్ సహా పలు రంగాల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. దీంతో ఆయా రంగాల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం గణనీయంగా పడే జాబ్స్ ఏవనేది ఓ సారి తెలుసుకుందాం.
ప్రస్తుతానికైతే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, ఏఐ టూల్స్ అభివృద్ధి చేస్తున్న వ్యాపారవేత్తలు అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో నాలుగైదేళ్లలో మాత్రం కృత్రిమ మేధ వల్ల ఉద్యోగులకు సమస్యలు తప్పకపోవచ్చని చెబుతున్నారు. 2020లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఓ కథనం ప్రచురించింది. అందులో 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 85 మిలియన్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని కథనంలో పేర్కొంది.
అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కథనానికి భిన్నంగా మెకినే ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వచ్చిన మెకినే నివేదిక ప్రకారం.. 2030 సంవత్సరం నాటికి 45 మిలియన్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో కనిపిస్తున్న పురోగతి 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఏఐ వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగాలు ఏంటో చూద్దాం.
ఎంట్రీ లెవల్ అడ్మిన్ రోల్స్..
పరిపాలనా విభాగంపై ఏఐ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ విభాగానికి సంబంధించి నోట్స్ రాయడం, తప్పొప్పులు చూడటం, స్ప్రెడ్ షీట్స్ నిర్వహణ లాంటి పనులను ఇప్పటికే చాట్‌జీపీటీ విజయవంతంగా చేస్తోంది. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన కోపైలట్ ఫీచర్ కూడా ఇలాంటిదే. దీని వల్ల వీడియో కాన్ఫరెన్సింగ్ మీటింగ్స్ మొత్తం సారాంశాన్ని నోట్ ఫామ్‌లోకి మార్చుకోవచ్చు. ఇలాంటి ఏఐ టూల్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీని వల్ల అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేసే వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అంటున్నారు నిపుణులు.
డేటా ఎంట్రీ క్లర్క్స్
డేటా ఎంట్రీ ఉద్యోగాల మీదా ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. ఫైనాన్షియల్ అనాలిసిస్, డేటా అనాలిసిస్, మెడికల్ డయాగ్నోసిస్ లాంటి జాబ్స్ చేస్తున్న వారి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏఐ వచ్చిన తర్వాత డేటా ఎంట్రీకి గంటల కొద్దీ సమయం పట్టట్లేదు. వేగంగా డేటా ఎంట్రీని ఏఐ పూర్తి చేసేస్తోంది. అందుకే డేటా ఎంట్రీ ఉద్యోగులకు ముప్ప తప్పదని హెచ్చరిస్తున్నారు.