Artificial Intelligence Importance in Daily Life in Telugu : "AI వినియోగంలో తేడావస్తే.. పరిణామాలు భయంకరంగా ఉంటాయి. కృత్రిమ మేధను తల్చుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను." అని అన్నారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. కానీ.. ఏఐ గురించి అవగాహన లేనివాళ్లు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అది మనకు సంబంధం లేని విషయం అన్నట్టుగా భావిస్తున్నారు చాలామంది! కానీ.. ఇప్పటికే మన డైలీ రొటీన్ లైఫ్‌లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వచ్చేసింది. తెల్లారి లేచిన దగ్గర నుంచి.. రాత్రి పడుకునే దాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉంటోంది..! విద్య నుంచి వైద్యం దాకా.. వ్యాపారం నుంచి వ్యవసాయం దాకా.. ఇప్పుడు AI ప్రమేయం లేని రంగం లేదంటే నమ్మాల్సిందే!
కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి..?
What is Artificial Intelligence in Telugu : మనిషి తనకోసం కృత్రిమంగా తయారుచేసుకున్న మేధస్సు.. కాబట్టే దీన్ని కృత్రిమ మేధస్సుగా పేర్కొంటున్నారు. అంటే.. సాధారణంగా మనిషి ఏదైనా పనిచేసే ముందు.. దాని గురించి ఆలోచించి, అందుకు సంబంధించిన విషయాలను గ్రహించి, అందులోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు. ఇదే పని యంత్రం చేస్తే.. అత్యంత వేగంగా పనులు చక్కబెట్టవచ్చుకదా అనే ఆలోచనే.. కృత్రిమ మేధ పుట్టుకకు బీజం.
మనిషి తన ఆలోచనతో.. తనకన్నా బలమైన యంత్రాలను ఎన్నింటినో సృష్టించాడు. సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే వాటిని ఆపరేట్ చేయడానికి మనిషి ఉండాల్సిందే. ఎందుకంటే.. వాటికి ఆలోచనా శక్తి లేదు. అందుకే.. స్వయంగా ఆలోచించగలిగే యంత్రాన్ని తయారు చేస్తే.. మరింత సమర్థంగా పనులు పూర్తిచేయొచ్చంటూ మొదలు పెట్టిన పరిశోధనలు.. చివరకు AIని సృష్టించాయి. మనం ఎంత ఎక్కువ సమాచారం దీనికి అందిస్తే.. అవి అంత కచ్చితమైన ఫలితాన్ని అందిస్తుంది.
మన రోజువారీ జీవితంలో AI..
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ (Electronic Gadgets) :గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి AI-ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు ఇళ్లలోకి వచ్చేశాయి. రిమైండర్‌లను సెట్ చేయడం, సందేశాలను పంపడం నుంచీ.. మ్యూజిక్ ప్లే చేయడం, స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించడం వరకూ అనేక రకాల పనులను ఇవి చేయగలవు.
సోషల్ మీడియా (Social Media) :సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ AIని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. యూజర్స్ బిహేవియర్ పరిశీలించడానికి, సోషల్ మీడియాలో వారి ఎక్స్ పీరియన్స్‌ను తెలుసుకోవడానికి కూడా AIని ఉపయోగిస్తున్నాయి. అంతేకాకుండా.. బూటకపు వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలు, ఇతర హానికరమైన కంటెంట్ గుర్తించడానికి కూడా ఆయా సంస్థలు కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయి. అంటే.. మనల్ని AI ఓ కంట కనిపెడుతోందన్నమాట.
కోడి కూతకు.. కుక్క అరుపునకు.. అర్థం తెలిసిపోతుంది.. కృత్రిమ మేధతో అద్భుత సృష్టి..
వినియోగదారుల సేవ(Customer service) :24/7 కస్టమర్ సేవలను అందించడానికి.. AIతో నడిచే వర్చువల్ అసిస్టెంట్‌లు, చాట్‌బాట్‌లను పలు సంస్థలు ఉపయోగిస్తున్నాయి. వినియోగదారుల ప్రశ్నలను అర్థం చేసుకోవడం, రిప్లే ఇవ్వడం వంటి పనులు చేస్తున్నాయి. ఇంకా.. ఆర్డర్‌లను ట్రాక్ చేయడం, రిటర్న్‌లను ప్రాసెస్ చేయడం వంటి అనేక రకాల పనులు కూడా AI నిర్వహిస్తోంది.