తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయాలు చూస్తున్నారా? యాప్​లివే!

ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ పగ్గాలు చేపట్టిన నుంచి కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. బ్లూటిక్​కు డబ్బులు వసూలు చేయడం.. ఉద్యోగులను తొలగించడం.. లాంటివి చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల విమర్శలు సైతం వస్తున్నాయి. దాంతో చాలా మంది ట్విట్టర్​ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్​కు ప్రత్యామ్నాయ యాప్​లు ఇవే..

twitte alternative apps
twitte alternative apps

By

Published : Nov 12, 2022, 9:26 AM IST

ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనటం.. కొత్త మార్పులకు శ్రీకారం చుట్టటం.. బ్లూ టిక్‌ కోసం సబ్‌స్క్రిప్షన్‌ ప్రవేశ పెట్టటం.. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించటం వంటి పరిణామాలను చూస్తూనే ఉన్నాం. కొందరు దీన్ని బాహాటంగానే విమర్శిస్తున్నారు. చిన్న వాక్యాల్లోనే సందేశాన్ని అందించే ట్విట్టర్‌ నుంచి వైదొలగుతున్నారు కూడా. అమెరికాలో ఇటీవల ఒక పెద్ద సెలబ్రిటీ ట్విట్టర్‌ను వీడటం చర్చనీయాంశంగానూ మారింది. మరి ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలేవైనా ఉన్నాయా? లేకేం..

మాస్టడాన్‌ :ఇదో ఓపెన్‌ సోర్స్‌ మైక్రోబ్లాగింగ్‌ పర్వీస్‌. కొత్తదేమీ కాదు. యూజెన్‌ రోఖో 2016లోనే దీన్ని సృష్టించారు. తాజా పరిణమాల నేపథ్యంలో ట్విట్టర్‌కు సరైన ప్రత్యామ్నాయంగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. మాస్టడాన్‌ కేంద్రీయ పద్ధతిలో ఉండదు. వివిధ స్వతంత్ర, యూజర్‌ మేనేజ్డ్‌ సర్వర్లతో పనిచేస్తుంది. దీన్ని ట్విట్టర్‌ మాదిరిగానే వాడుకోవచ్చు. ఇతరులను ట్యాగ్‌ చేయొచ్చు. మీడియాను షేర్‌ చేసుకోవచ్చు. ఇతరుల ఖాతాలనూ ఫాలో కావొచ్చు. ఇప్పటికే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇందులో జాయిన్‌ అయ్యారు.

కూ :ఇది మనదేశానికి చెందిన మైక్రో బ్లాగింగ్‌ సంస్థ. కొవిడ్‌-19 మహమ్మారి విజృంభించిన సమయలో పురుడు పోసుకుంది. ఇప్పటికే ఈ యాప్‌ను 5 కోట్లకు పైగా మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మొత్తం 10 భాషల్లో అందుబాటులో ఉంది. అభిప్రాయాలను కలబోసుకోవటమే కాదు.. తాజా వార్తలపై చర్చలు, వ్యక్తిగత సమాచారం అప్‌డేట్లు, అత్యంత ఆసక్తికరమైన రోజువారీ అంశాలను పంచుకోవటం వంటివీ చేయొచ్చు. సెలబ్రిటీలు, ఇతరుల ఖాతాలను ఫాలో కావొచ్చు. ఇతరులతో ఛాట్‌ చేయొచ్చు కూడా.

టంబ్లర్‌ :నిజానికి దీన్నొక బ్లాగ్‌ అనుకోవచ్చు. కానీ ఇతరులను అనుసరించటానికి, వారి తాజా పోస్టులను చూడటానికీ వీలు కల్పిస్తుంది. తమ టెక్స్ట్‌, ఫొటో లేదా జిఫ్‌లను జోడించి సొంత విషయాలూ పోస్ట్‌ చేసుకోవచ్చు. టంబ్లర్‌లో సుమారు 53 కోట్ల బ్లాగులున్నాయి. తమ అంశాలు ఏ సమయంలో పోస్ట్‌ కావాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ట్యాగ్స్‌ను జోడించుకోవటం ద్వారా ఆయా అంశాలకు సంబంధించిన పోస్ట్‌లను వినియోగదారులకు చేరువయ్యేలా చూసుకోవచ్చు.

కౌంటర్‌ సోషల్‌ :దీన్ని నిజంగానే మంచి మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ట్రోల్స్‌ను అనుమతించదు. వేధింపులు, ప్రకటనలు, నకిలీ వార్తలూ ఉండవు. బాట్‌ ఖాతాలు, అసత్య సమాచార నెట్‌వర్క్‌లను పూర్తిగా పక్కన పెట్టిన మొట్టమొదటి సామాజిక వేదిక ఇదే. ఈ యాప్‌ రష్యా, చైనా, ఇరాన్‌, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌, సిరియా వంటి దేశాలను నిషేధించింది కూడా.

బ్లూస్కై :ఇది ట్విట్టర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే ప్రారంభించిన సామాజిక వేదిక. ఆయన దీన్ని 2019లో ఆరంభించారు. ఇందులో 30వేల మందికి పైగా చేరారు. ప్రస్తుతానికి బీటా పరీక్షల కోసమే వినియోగదారులకు అనుమతి ఇస్తున్నారు. ట్విట్టర్‌ను మస్క్‌ చేజిక్కించుకున్నాక చాలామంది స్వచ్ఛందంగా దాన్నుంచి వైదొలుగుతున్నారు. వీరికి బ్లూస్కై మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

క్లబ్‌హౌజ్‌ :కొవిడ్‌ విజృంభణ సమయంలో విడుదలైన ఇది ప్రధానంగా ఆడియో కేంద్రీకృత యాప్‌. ఇందులో ప్రత్యేకమైన ఛాట్‌ రూమ్‌లు ఉంటాయి. వీటిల్లో ఎవరైనా చేరి బృందాలుగా ఏర్పడొచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే. దీంతో ఇతరులతో కలిసి మాట్లాడుకోవచ్చు. వారు చెప్పేది వినొచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటుంది.

రెడిట్‌ :ఇది చాలా ఆదరణ పొందిన వెబ్‌సైట్‌. నిజానికి దీన్ని ట్విట్టర్‌తో పోల్చలేం. పనితీరు పూర్తిగా భిన్నం. దీని ద్వారా ఆయా అంశాలపై ఆసక్తి గల వ్యక్తులతో చర్చలు జరపొచ్చు. వాటి గురించి తెలుసుకోవచ్చు.

కోహోస్ట్‌ :ఇదింకా పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. బీటా వర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది దాదాపు ట్విట్టర్‌ మాదిరిగానే పనిచేస్తుంది. తాము ఫాలో అయ్యేవారి పోస్టులను చూడటానికి వీలు కల్పిస్తుంది. ప్రకటనలు ఉండవు. ట్రాకింగ్‌ కూడా ఉండదు.


ఇవీ చదవండి :సీక్రెట్​గా వాట్సాప్​ స్టేటస్​లు చూడాలా? ఇలా ట్రై చేయండి!​

ఇది ఉంటే చాలు! మామూలు సైకిల్​ను ఇ-బైక్​గా మార్చేయెచ్చు

ABOUT THE AUTHOR

...view details