Smartphone Battery Tips: కాలం మారింది.. అవసరాల కోసం క్యూలైన్లో నిలబడే రోజుల నుంచి కావాల్సిన వస్తువుని కూర్చున్న చోటుకే తెప్పించుకోగలుగుతున్నాం. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. సమస్తం మన ముందున్నట్లే. బాతాఖానీ నుంచి చిట్‌చాట్, వీడియో కాలింగ్, గేమింగ్, ఆన్‌లైన్ షాపింగ్, ఆఫీస్ మీటింగ్ అంటూ రోజంతా స్మార్ట్‌ఫోన్ బిజీగా ఉంటుంది. మరి అంత బిజీగా ఉండే ఫోన్ బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉంటేనే ఇవన్నీ చేయగలం. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టుకుంటూ, బ్యాటరీ బ్యాకప్‌లను వెంటపెట్టుకోని వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచుకునేందుకు యాపిల్ కంపెనీ కొన్ని సూచనలు చేస్తుంది. అయితే ఇది కేవలం ఐఫోన్లకు మాత్రమే కాదు.. ఇతర కంపెనీల ఫోన్లకు వర్తిస్తుంది. ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండేందుకు యాపిల్ కంపెనీ చేసిన సూచనలపై ఓ లుక్కేద్దామా మరి!
వాటికి దూరంగా ఉంచాలి
బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండేందుకు యాపిల్ చేసే మొదటి సూచన, మీ ఫోన్‌ను వేడి వస్తువులు, అధిక ఉష్ణోగ్రతలకు దూరంగా ఉంచడం. సాధారణంగా 16 డిగ్రీల సెల్సియస్ నంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు డివైజ్ పనితీరుకు అనుకూలమైనవి చెబుతోంది. అందుకే 35 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉంచమని సూచిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బ్యాటరీ సామర్థ్యం దెబ్బతిని, ఛార్జింగ్ ఎక్కువ కాలం ఉండదని యాపిల్ చెబుతోంది.
అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీ ఛార్జ్ చేయడం వల్ల డివైజ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందట. ఉదాహరణకు కంపెనీ సూచించిన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఛార్జ్ చేస్తున్నారనుకుంటే, డివైజ్ సాఫ్ట్‌వేర్ దాన్ని 80 శాతం ఛార్జింగ్ వద్ద అడ్డుకుని, కంపెనీ సూచించిన ఉష్ణోగ్రతకు పరిమితం చేస్తుంది. అలానే చల్లని ప్రదేశాల్లో ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందట. అయితే ఇది కేవలం కొద్దిసేపు మాత్రమే ఉంటుందని, బ్యాటరీ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకున్న వెంటనే ఎప్పటిలానే పనిచేస్తుందని యాపిల్ కంపెనీ పేర్కొంది.