యాపిల్ ఉత్పత్తులను భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తాం. పొరపాటున ఆ వస్తువులకు ఏమైనా సమస్యలు తలెత్తితే మాత్రం రిపేర్ కోసం నానా తంటాలు పడాల్సిందే. రిపేర్ చేసే షాపులు దొరకడమే చాలా కష్టం. ఒకవేళ దొరికినా.. భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా.. షాపు వాళ్లు అసలైన ఫోన్ పార్ట్స్ తీసుకుని, నకిలీ పార్ట్స్ వేసి అందించే ప్రమాదమూ లేకపోలేదు. మరి ఈ ఇబ్బందులేవీ లేకుండా మన ఫోన్ మనమే రిపేర్(Apple self service) చేసుకుంటే.. బాగుంటుంది కదా! ఈ నేపథ్యంలోనే.. బుధవారం యాపిల్(Apple news) సంస్థ కీలక ప్రకటన చేసింది. తమ వినియోగదారులు ఇకపై సొంతంగా తమ వస్తువులను తామే మరమ్మతు(Apple self service) చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి సెల్ఫ్ సర్వీస్ రిపేర్(Apple self service) సదుపాయాన్ని ఐఫోన్ 12, ఐఫోన్ 13 లైనప్స్‌తో పాటు, ఎం1 చిప్స్ ఉన్న మ్యాక్‌కు అందించనున్నట్లు యాపిల్ ప్రకటించింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు, ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోని వారికి అందుబాటులోకి తేనుంది. మరమ్మతు చేసేందుకు కావాల్సిన పరికరాలతో పాటు, ఫోన్లో పాడైన స్పేర్ పార్ట్స్‌ను కూడా అందిస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఈ సెల్ఫ్ సర్వీస్ రిపేర్ కోసం ఓ ఆన్లైన్ స్టోర్‌ను యాపిల్ సంస్థ ప్రారంభించనుంది. అందులో 200కుపైగా స్పేర్ పార్ట్స్ ఉంచనున్నట్లు తెలిపింది. ముందుగా యాపిల్ ఐఫోన్ డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా వంటివాటి రిపేర్‌కు మాత్రమే అనుమతించనుంది. ఆ మరుసటి ఏడాదికి మిగతా స్పేర్ పార్ట్స్‌కు కూడా ఈ సదుపాయాన్ని తీసుకురానుంది.