Security tips for Android phone Users : నేటి ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం తప్పనిసరి అయ్యింది. కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ ఇలా ఏ రకంగానైనా సరే.. దాదాపు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్లలో ఆండ్రాయిడ్ వినియోగదారులే అధికం. ఆండ్రాయిడ్ ఫోన్ సరిగ్గా పనిచేయాలంటే మీరు ఈ 12 పనులు చేయకూడదు.
సాఫ్ట్ వేర్ అప్డేట్లు
Safety Tips for Android Users : ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్లు వస్తాయి. దీనివల్ల కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఫోన్ పెర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుంది. ఇవన్నీ తెలియక కొంతమంది తమ ఫోన్లలో వచ్చే అప్డేట్లను పట్టించుకోరు. ఇది మంచిది కాదు. ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్డేషన్ చేయడం వల్ల మన ఫోన్ హ్యాక్‌కు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు మీ ఫోన్‌కు వస్తూనే ఉంటాయి. అలా రాకపోతే మీరే సెట్టింగ్స్‌లోని సిస్టం అప్టేట్స్పై క్లిక్ చేసి ఆ వివరాలు తెలుసుకోవచ్చు.
బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ రన్ చేయడం
చాలామంది తమ ఫోన్లలో అవసరం ఉన్నప్పుడు అనేక యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. అది తీరిపోయాక అవసరం లేకపోయినా అలాగే ఉంచుకుంటారు. అవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతాయి. వీటి వల్ల బ్యాటరీ సామర్థ్యం చాలా తగ్గిపోతుంది. ఇది ఫోన్ స్లో అవడానికి కారణమవుతుంది. దీన్ని నివారించాలంటే ముందుగా అనవసరమైన యాప్స్‌ను తొలగించండి. అలాగే మీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Battery Usageపై క్లిక్ చేస్తే.. అక్కడ మీకు ఏ యాప్‌లు ఎంత బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో లిస్టు వస్తుంది. దాని ప్రకారం యాప్‌లను తొలగించవచ్చు. లేదా ఇన్ యాక్టివ్ చేయవచ్చు.
డిస్‌ప్లేపై ఎక్కువ విడ్జెట్స్!
ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లో విడ్జెట్స్ ఆప్షన్ ఉంటుంది. అయితే డిస్‌ప్లేపై చాలా విడ్జెట్లు ఉండటం వల్ల ఫోన్ ఇంటర్ఫేస్ చిందరవందరగా అనిపిస్తుంది. దాంతో పాటు హోమ్ స్క్రీన్ నావిగేట్ చేయడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. పైగా ఇవి ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపిస్తాయి. అవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వడం వల్ల కొన్ని విలువైన వనరుల్ని వినియోగించుకుంటాయి. కాబట్టి అనవసరమైన విడ్జెట్స్‌ను తీసేయడం మంచిది. దీని కోసం డిస్‌ప్లేపై ఉండే విడ్జెట్స్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే.. రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది.
స్టోరేజి గురించి పట్టించుకోకపోవడం
కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ఫోన్.. ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్, యాప్స్‌తో నిండిపోతుంది. ఫలితంగా స్టోరేజీ ఫుల్ అయిపోతుంది. దీని వల్ల మీరు కొత్త అప్డేట్లు పొందకపోవటం, ఫొటోలు, వీడియోలు తీసుకోకపోవడం, కొత్త ఫైల్స్ సేవ్ చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఫలితంగా ఇది ఫోన్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. స్టోరేజీ ఫుల్ అయితే.. యాప్స్ ఓపెన్ చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు స్టోరేజీ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం. దీనికోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి Find Device లేదా About Device పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Storageపై క్లిక్ చేస్తే ఎంత ఉందో తెలిసిపోతుంది.
వేరే సోర్స్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం
చాలా మంది కొన్ని ఫీచర్ల కోసం థర్డ్ పార్టీ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం. అలాంటి వాటిల్లో హానికరమైన మాల్వేర్లు, స్పైవేర్లు ఉండే అవకాశముంది. ఆ యాప్స్‌కు మనం ఇచ్చే పర్మిషన్ల వల్ల.. సమాచారం మొత్తం దొంగిలించే ప్రమాదముంది. కాబట్టి అలాంటి వెంటనే తొలగించి, కావాల్సిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
క్యాష్ (cache) పేరుకుపోవడం
మనం ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడూ ఏదో ఒక వెబ్‌సైట్ చూస్తూనే ఉంటాం. వస్తువులు కొంటుంటాం. బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటాం. ఈ క్రమంలో బ్రౌజర్.. మనం చూసిన వెబ్‌సైట్లు, వాడిన పాస్‌వర్డ్‌లు, డౌన్‌లోడ్ చేసిన పత్రాలు.. ఇలా ఎంతో సమాచారాన్ని సేకరించుకొని పెట్టుకుంటుంది. దీన్నే క్యాష్ (cache) అంటారు. రాన్రానూ ఇది ఫోన్ పనితీరు మీద భారం పెరిగేలా చేస్తుంది. అందువల్ల క్యాష్‌ను క్లియర్ చేసుకోవడం మంచిది. క్యాష్‌ను క్లియర్ చేయడానికి Settingsలోకి వెళ్లి Apps & Storage పై క్లిక్ చేస్తే.. అక్కడ యాప్స్ లిస్టు కనిపిస్తుంది. అందులో కావాల్సిన యాప్‌ను సెలెక్ట్ చేసుకుని క్యాష్‌ను క్లియర్ చేసుకోవచ్చు.