Android Phones Security Risk : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతున్నారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లో నకిలీ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లను తీసుకొచ్చారు. ఇవి చూడడానికి అచ్చంగా ఒరిజినల్ యాప్స్ లానే ఉంటాయి. అందువల్ల యూజర్స్ వీటిని గుర్తించడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారీగా డౌన్లోడ్స్
Fake Apps On Play Store :టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లు రెండూ.. వాట్సాప్‌లానే మెసేజింగ్ అప్లికేషన్స్. వీటికి కూడా చాలా పెద్ద యూజర్ బేస్ ఉంది. అందుకే సైబర్ నేరగాళ్లు వీటిని టార్గెట్ చేసుకున్నారు. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు సంబంధించిన ఫేక్, క్లోనింగ్ యాప్‌లను రూపొందించి, వాటిని గూగుల్ ప్లేస్టోర్‌లో ఉంచారు. ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్ నుంచి మిలియన్ల కొద్దీ ఈ ఫేక్ యాప్ డౌన్లోడ్స్ జరిగినట్లు Kaspersky సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు.
డేటా చోరీ!
Recent Cyber Frauds 2023 :ఫేక్ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లు రెండూ ఒరిజినల్ యాప్స్ మాదిరిగానే ఉంటుంది. కానీ వీటిలో చాలా స్పైవేర్లు ఇన్స్టాల్ అయ్యుంటాయి. వాస్తవానికి ఇవి ఒరిజినల్ యాప్స్ కంటే చాలా వేగం (ఫాస్ట్)గా పనిచేస్తుంటాయి. ఇవి ఆండ్రాయిడ్ ఫోన్లలోని సున్నితమైన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందిస్తాయి. ముఖ్యంగా ఈ బోగస్ యాప్‌లు.. యూజర్ ఐడీ, పేరు, ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు, ఛాట్ మెసేజ్‌లు, ఫొటోలు సహా సమస్త సమాచారాన్ని.. సైబర్ నేరగాళ్ల సర్వర్స్‌కు పంపిస్తాయి. అందుకే ఈ ఫేక్ యాప్‌లకు టెక్ నిపుణులు 'ఈవిల్ టెలిగ్రామ్' అనే కోడ్‌నేమ్ ఇచ్చారు.
ఫేక్ యాప్స్‌ను గుర్తించడం ఎలా?
How To Find Fake Apps On Android :సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ ఫేక్ యాప్ కోడ్లను పరిశీలించి.. అఫీషియల్ యాప్‌లనే కొంచెం మోడిఫై చేసి వీటిని రూపొందించినట్లు గుర్తించారు. అందుకే ఈ నకిలీ యాప్‌లను గుర్తించడం కొంచెం కష్టం. అయితే ఫేక్ యాప్‌లో ఒక అడిషినల్ మాడ్యూల్ ఉంటుంది. ఇది సదరు యాప్ ఉపయోగిస్తున్న యూజర్‌కు సంబంధించిన మెసేజ్‌లను, ఫోన్లోని డేటాను సైబర్ నేరగాళ్లకు అందజేస్తుంది. కనుక మీరు డౌన్లోడ్ చేసిన యాప్‌లో ఏదైనా ఎక్స్ట్రా మాడ్యూల్ గనుక ఉంటే.. దానిని వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి.
ఆండ్రాయిడ్ యూజర్స్ 'రిస్క్'లో ఉన్నారు!
Android Phone Security Tips : ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు హై సెక్యూరిటీ రిస్క్‌లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందువల్ల కచ్చితంగా యూజర్లు అందరూ తమ ఆండ్రాయిడ్ డివైజ్ ఆపరేటింగ్ సిస్టమ్ (Android OS) అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారం, ఆండ్రాయిడ్ 11, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13 ఫోన్లలో భద్రతాపరమైన రిస్క్‌లు ఉన్నాయి. అందుకే ఆయా ఫోన్ యూజర్లు వెంటనే తమ ఆండ్రాయిడ్ ఫోన్లను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం.