తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయిందా? ఈ యాప్స్ వల్లే! ఇలా చేస్తే రాకెట్ స్పీడ్​తో.. - ఆండ్రాయిడ్ స్లో అవుతుంది

మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఏది ఓపెన్ చేసినా నెమ్మదిగా లోడ్ అవుతోందా? దానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటి? ఫోన్ తిరిగి వేగంగా పనిచేయాలంటే ఎలా? అనేది మీకోసం.

Android Phone Slowing Down
Android Phone Slowing Down

By

Published : Jan 4, 2023, 4:12 PM IST

Android Phone Slowing Down : స్మార్ట్​ఫోన్​ను వాడుతున్నకొద్దీ స్లో అవుతూ ఉంటుంది. కొత్తగా ఉన్నప్పటితో పోలిస్తే కొద్ది నెలలు ఉపయోగించిన తర్వాత.. లోడింగ్ సమయం, యాప్​లు ఓపెన్ అయ్యే సమయంలో తేడాలు వస్తుంటాయి. దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సమస్య ఎదురవుతుంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. మరి వాటిని అధిగమించి.. ఫోన్​ వేగం పెంచాలంటే ఏం చేయాలో చూద్దాం.

ఎక్కువ యాప్స్ ఇన్​స్టాల్ చేస్తే..
ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్లలో ఎక్కువ యాప్స్ ఇన్​స్టాల్ చేస్తే ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది. యాప్స్​.. స్టోరేజీని ఉపయోగించుకుంటాయి. వాటిని రన్ చేయాలంటే కూడా ఫోన్​లో తగినంత స్టోరేజీ ఉండటం అవసరం. చాలా యాప్స్ బ్యాక్​గ్రౌండ్​లో రన్ అవుతుంటాయి. ఫలితంగా బ్యాటరీ వేగంగా అయిపోతుంది. చివరకు ఫోన్ హార్డ్​వేర్​పై ప్రభావం పడుతుంది. ఇది ఫోన్ నెమ్మదించడానికి ఒకర కారణం కావచ్చు.

  • మరేం చేయాలి?
    • ఎప్పుడో ఓసారి ఉపయోగపడే యాప్స్​ను ఫోన్​లో నుంచి డిలీట్ చేయండి.
    • బ్రౌజర్​లో వాడగలిగే సేవలకు సంబంధించిన యాప్స్​ను తొలగించండి. ఉదాహరణకు.. ఉబర్, ఓలా వంటి సేవలు బ్రౌజర్​లోనూ అందుబాటులో ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా యాప్స్ అవసరం లేదు.

భారీ యాప్స్ వల్ల..
స్మార్ట్​ఫోన్​లో ఉండే అన్ని యాప్స్ ఒకే విధంగా ఉండవు. కొన్ని యాప్స్ లైట్​వెయిట్​తో.. తక్కువ బడ్జెట్ ఫోన్​లోనూ ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తాయి. కానీ కొన్ని మాత్రం.. ఫోన్​లోని హార్డ్​వేర్​, సాఫ్ట్​వేర్​ను చాలా వరకు వాడుకుంటాయి. పెద్ద గేమ్స్, ఫేస్​బుక్ వంటి యాప్స్ ఇందుకు ఉదాహరణ. ఫేస్​బుక్, స్నాప్​చాట్ యాప్​లు ఫోన్​ను చాలా వరకు నెమ్మదించేలా చేస్తాయి.

  • మరేం చేయాలి?
    • ఫేస్​బుక్ వాడాలనుకుంటే.. దాని లైట్ యాప్​ను ఇన్​స్టాల్ చేసుకోవడం ఉత్తమం. ప్రధాన యాప్ సైజు 63ఎంబీ ఉంటే.. ఫేస్​బుక్ లైట్ 1.6 ఎంబీ మాత్రమే ఉంటుంది.
    • ఇన్​స్టాగ్రామ్ వంటి యాప్​లకు సైతం లైట్ వెర్షన్​లు అందుబాటులో ఉన్నాయి.
    • యాప్స్​కు లైట్ వెర్షన్ అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని గూగుల్ ప్లే స్టోర్​లో చెక్ చేసుకోవచ్చు.
    • ప్రధాన యాప్ ఇన్​స్టాల్ బటన్ కింద 'సిమిలర్ యాప్' అనే బ్యానర్​ ఓపెన్ చేస్తే అందుబాటులో ఉన్న లైట్ వెర్షన్ కనిపిస్తుంది.

సిస్టమ్ అప్డేట్స్ చేయకపోవడం..
స్మార్ట్​ఫోన్ సాఫ్ట్​వేర్​ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సాఫ్ట్​వేర్​లో ఏవైనా లోపాలు ఉంటే అప్డేట్ల ద్వారా డెవలపర్లు సరిచేస్తుంటారు. కొన్నిసార్లు ఆ లోపాలు ఫోన్​ను స్లో అయ్యేలా చేస్తాయి. ఎప్పటికప్పుడు సిస్టమ్ అప్డేట్ చేసుకుంటే.. ఫోన్ స్లో కాకుండా చూసుకోవచ్చు. ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలోనూ సిస్టమ్ అప్డేట్స్ చాలా ముఖ్యం. ఇదే విషయం ఫోన్​లోని యాప్​లకూ వర్తిస్తుంది. ఇన్​స్టాల్ అయిన యాప్స్​ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. కొత్త వెర్షన్ వచ్చిన వెంటనే అప్డేట్ అయిపోయేలా.. గూగుల్ ప్లే స్టోర్​లో సెట్టింగ్స్ మార్చుకోవాలి.

ఫ్రీ స్టోరేజీ ఉండేలా..
డివైజ్​లో ఎప్పుడూ స్టోరేజీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫీగా నడవాలంటే తగినంత స్టోరేజీ ఉండాలి. స్టోరేజీ స్పేస్ లేకపోతే.. సిస్టమ్ లేట్​గా రన్ అవుతుంది. ఇది ఫోన్ పెర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపుతుంది.

ఫోన్​ను రీస్టార్ట్ చేయడం..
మీరు చివరిసారి ఫోన్​ను ఎప్పుడు స్విచ్ఆఫ్ చేశారో గుర్తుందా? లేకపోతే మాత్రం వెంటనే మీ ఫోన్​ను రీస్టార్ట్ చేయండి. ఫోన్​ను స్విచ్ఆఫ్ చేసి ఆన్ చేయడం ద్వారా బ్యాక్​గ్రౌండ్​లో ఏర్పడ్డ చిన్నచిన్న బగ్స్​ను తొలగించుకోవచ్చు.

టాస్క్ కిల్లర్స్ వాడితే..
ఫోన్​లో మెమొరీని క్లీన్ చేయడానికి ఉపయోగించుకునే యాప్స్​నే టాస్క్ కిల్లర్స్ అంటారు. ఇవి బ్యాక్​గ్రౌండ్​లో నడిచే యాప్స్​ను క్లోజ్ చేసి.. ర్యామ్​పై భారం పడకుండా చూస్తాయని భావిస్తుంటారు. అయితే, ఇదంతా వాస్తవం కాదు. బ్యాక్​గ్రౌండ్​లో ఎక్కువసేపు నడిచే యాప్స్​ను ఆండ్రాయిడ్​ ఆటోమెటిక్​గా తొలగిస్తుంటుంది. ఈ టాస్క్ కిల్లర్స్ ఫోన్​ స్పీడ్​ను పెంచే బదులు.. అందుకు విరుద్ధంగా పనిచేస్తాయి. బ్యాక్​గ్రౌండ్ యాప్స్​ను ప్రతిసారి క్లోజ్ చేస్తే.. వాటిని రీఓపెన్ చేసినప్పుడు ఎక్కువ సేపు లోడ్ అవుతాయి. ఇది పరోక్షంగా ర్యామ్​ పనితీరును ప్రభావితం చేస్తుంది.

హోమ్ స్క్రీన్​..
ఫోన్ నెమ్మదించడానికి హోమ్ స్క్రీన్ మీద ఉండే విడ్జెట్స్, యాప్స్ కూడా ఓ కారణం. హోమ్ స్క్రీన్​పై ఎక్కువ విడ్జెట్స్ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్ పెర్ఫార్మెన్స్​పై ప్రభావం పడుతుంది. సింపుల్ విడ్జెట్స్ ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అయితే, విడ్జెట్ తగ్గించడం వల్ల ఫోన్ మరీ వేగంగా పనిచేస్తుందని అనుకూడదు. దీని ప్రభావం చాలా స్వల్పమే.

ABOUT THE AUTHOR

...view details