ఒకేసారి రెండు యాప్స్ మొబైల్ స్క్రీన్ మీద చూసుకునే విధంగా గతంలోనే ఆండ్రాయిడ్ స్ప్లిట్ స్క్రీన్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఏదైనా యాప్ వాడుతున్నప్పుడు రీసెంట్స్ బటన్ క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఎంచుకుంటే.. స్క్రీన్ పై భాగంలో ఆ యాప్ వచ్చి చేరుతుంది. ఆ తర్వాత మీకు కావాల్సిన మరో యాప్‌ను ఎంచుకుంటే, అది దాని కింద వచ్చి చేరుతుంది. అయితే దిగువ ఉన్న యాప్ స్క్రీన్.. పై భాగంలోకి వెళ్లాలంటే కుదరదు. కానీ కొత్త వెర్షన్ ఆండ్రాయిడ్‌లో ఈ ఆప్షన్ ఇస్తున్నారు. రెండు యాప్‌లను విడదీస్తూ మధ్యలో ఉండే గీత మీద డబుల్ ట్యాప్ చేస్తే వాటి ప్లేస్‌లు మారుతాయి. పాత తరం షావోమి మొబైల్స్‌లో ఈ ఆప్షన్ ఉండేది.
విడ్జెట్స్ వెతుక్కునేలా..
మొబైల్‌లో చాలా యాప్స్ ఉంటుంటాయి. వాటిని మెనూ లిస్ట్‌లో వెతుక్కోవడం అన్ని సమయాల్లో సులభం కాదు. అందుకే ఆయా యాప్స్ విడ్జెట్స్ తయారు చేస్తుంటాయి. అంటే షార్ట్‌కట్‌లా అన్నమాట. ఆండ్రాయిడ్‌లో ఇలాంటి విడ్జెట్స్ చాలానే ఉంటాయి. అందులో మనకు కావాల్సిన యాప్‌కు సంబంధించిన విడ్జెట్ వెతుక్కోవడం కష్టమే. అందుకే విడ్జెట్స్ సెక్షన్‌లో సెర్చ్ ఆప్షన్ ఇస్తున్నారు. మీకు కావాల్సిన యాప్ పేరును సెర్చ్ చేసి, విడ్జెట్‌ను సులభంగా వెతుక్కోవచ్చు. అయితే ఆ యాప్ మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయి ఉండాలి.
గూగుల్ అసిస్టెంట్ పిలవడానికి..
స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్‌ను యాక్టివ్ చేయడానికి కొత్త ఆప్షన్ రాబోతోంది. చాలా ఫోన్లలో 'హే గూగుల్', 'ఓకే గూగుల్' అంటే అసిస్టెంట్ యాక్టివ్ అవుతుంది. పిక్సల్ ఫోన్స్‌లో అయితే ఫోన్‌ను షేక్ చేయడం, బ్యాక్ ట్యాప్ చేయడం లాంటి ఇంకొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా పవర్ బటన్ ఆప్షన్‌ను యాడ్ చేస్తున్నారట. పవర్ బటన్‌ను కాసేపు లాంగ్‌ప్రెస్ చేస్తే.. గూగుల్ అసిస్టెంట్ యాక్టివ్ అవుతుందట. అయితే ఎంతసేపు లాంగ్ ప్రెస్ చేయాలనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కువసేపు లాంగ్ ప్రెస్ చేస్తే మొబైల్ స్విచ్ఛాఫ్ అయిపోతుంది.
స్క్రీన్‌షాట్ ఎక్స్‌పాండ్
ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్‌షాట్ తీసుకోవడం చాలా సులభం. అయితే ఆ స్క్రీన్ షాట్‌ను విస్తరించడం (ఎక్స్‌పాండ్) చేయడం కుదరదు. అంటే ఏదైనా వార్త మొత్తం స్క్రీన్‌షాట్ తీసుకుందాం అంటే అవ్వదు. బిట్లుగా బిట్లుగా కట్ చేసుకోవాలి. అయితే క్యూరేటెడ్ (మార్పు చేసిన) ఓఎస్‌లు ఉండే మొబైల్స్‌లో ఈ ఆప్షన్ ఉంది. స్క్రీన్ షాట్ కొట్టాక.. దిగువ ఎక్స్‌పాండ్ బటన్ నొక్కితే ఎంతవరకు కావాలంటే అంతవరకు స్క్రీన్ షాట్ ఎక్స్‌పాండ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ ఒరిజినల్ గూగుల్ ఓఎస్‌లో ఉండబోతోంది. స్క్రీన్ షాట్ కొట్టాక 'క్యాప్చర్ మోర్' క్లిక్ చేసి ఎక్స్‌పాండ్ చేయొచ్చు.
ట్యాబ్స్‌కి ప్రత్యేకం
మొబైల్ స్క్రీన్ చిన్నగా ఉంటుంది కాబట్టి.. హోం స్క్రీన్ మీద యాప్స్ పెట్టుకుంటే అన్నీ దగ్గరగా ఉంటాయి. అవసరమైనప్పుడు సులభంగా కావాల్సిన యాప్/ విడ్జెట్‌ను వేలితో టచ్ చేయొచ్చు. అదే ట్యాబ్స్‌లో అయితే అంత సులభంగా ఉండదు. పెద్ద స్క్రీన్ వల్ల యాప్స్ సులభంగా ఒక చేత్తో టచ్ చేయలేం. అందుకే ట్యాబ్స్ కోసం కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. డ్యూయల్ ప్యానల్ పేరుతో వస్తున్న ఈ ఫీచర్‌లో స్క్రీన్ మధ్యలో సెపపరేషన్‌తో రెండు భాగాలుగా కనిపిస్తుంది. దాంతోపాటు దిగువ టాస్క్ బార్ ఒకటి వస్తుంది. దీంతో ఇబ్బంది లేకుండా యాప్/విడ్జెట్‌లను కావాల్సిన వైపు ఉంచుకోవచ్చు.