Aditya L1 Mission Update :సూర్యుడిపై పరిశోధనలకు పంపించిన ఆదిత్య ఎల్-1 శాస్త్రీయ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమికి దాదాపు 50 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్‌ను ఇది కొలుస్తుంది. ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్ ప్రవర్తనను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్1లోని సూప్ర థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్-స్టెప్స్ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్టెప్స్‌లో మొత్తం ఆరు సెన్సార్లు ఉన్నాయి.
Aditya L1 Mission Status :ఆదిత్య ఎల్1 సోమవారం అర్థరాత్రి కీలక దశకు చేరుకుంటుంది. భూప్రదక్షిణ దశను ముగించుకుని 19వ తేదీ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించనుంది. ఈ క్రమంలో ఇది సన్-ఎర్త్ లగ్రాంజ్ 1కు చేరుకుంటుంది. ఈ పాయింట్ భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్‌లో సూర్యుడు, భూమి గురత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని ఏదైనా స్థిరంగా ఉండవచ్చు. ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్ పాయింట్లను గుర్తించారు. వీటిల్లో భారత్‌కు చెందిన ఆదిత్య ఎల్1 తొలి లగ్రాంజ్ పాయింట్‌కు వెళుతోంది.