Aditya L1 Mission Astronaut Chris Hadfield :చంద్రయాన్-3 విజయం ఇచ్చిన జోష్‌తో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. సూర్యుడి సమీపంలో పరిశోధనలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అందుకోసం తాజాగా ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఈ సమయంలో అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తున్న భారత్‌కు.. అంతర్జాతీయంగా ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్ క్రిస్ హడ్‌ఫీల్డ్.. సాంకేతిక రంగంలో భారత్ సాధిస్తున్న విజయాలను కొనియాడారు. ఈ భూమిపై ప్రతిఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారని వ్యాఖ్యానించారు.
"సూర్యుడి గురించి మరింతగా అర్థం చేసుకునేందుకు, దాని నుంచి ఎదురయ్యే ముప్పులను పసిగట్టేందుకు ఆదిత్య-ఎల్1 వంటి ప్రయోగాలు సహాయం చేస్తాయి. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారు. ఇంటర్నెట్ గ్రిడ్, ఎలక్ట్రిక్ గ్రిడ్, రోదసిలోని ఉపగ్రహాలు, వ్యోమనౌకలను సమర్థంగా రక్షించుకోవడానికి ఈ ప్రయోగం కీలకం కానుంది. ఈ భూమండలంపై సూర్యుడి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి దోహదం చేస్తుంది"
-- క్రిస్ హడ్‌ఫీల్డ్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్