A Minute on The Internet in 2021: కరోనా నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. ఇళ్లకు పరిమితమైన జనం.. ఎక్కువ సమయం నెట్టింట్లోనే గడిపారు. సినిమా హాళ్లు మూసివేయడం వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీల్లో వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలు.. ఇలా వీడియో వచ్చిందంటే అలా చూసేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లే దారిలేక తల వెంట్రుక నుంచి కాలి వేళ్ల కోసం కావాల్సిన ప్రతి వస్తువును దాదాపు ఆన్లైన్లోనే కోలుగోలు చేయడానికే ప్రయత్నించారు.
వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతుల కోసం జూమ్ యాప్‌ను అధికంగా వినియోగించారు. కాలక్షేపం కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్ ఇలా అందుబాటులో ఉన్న ఏ సామాజిక మాధ్యమాన్ని ప్రజలు విడిచిపెట్టలేదు. నగదు బదిలీతో కరోనా ముప్పు ఉండొచ్చన్న భయంతో డిజిటల్ చెల్లింపులకు మొగ్గుచూపారు. ఇలా ఇంటర్నెట్తో సంబంధమున్న ప్రతిదాన్నీ విపరీతంగా వినియోగిస్తున్నారు. ఒక్క నిమిషంలోనే కొన్ని లక్షల గంటల కంటెంట్‌ను చూస్తున్నారు. లక్షల పోస్టులు, ఫొటోలు షేర్ చేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని.. 2021లో ఒక నిమిషం కాలవ్యవధిలో ఇంటర్నెట్ను ప్రజలు ఏ మేరకు వినియోగించారని 'మార్కెటింగ్ మైండ్' అనే సంస్థ అంచనా వేసింది. మరి.. ఇంటర్నెట్లో ప్రతి నిమిషం ఏం జరుగుతుందంటే..