80 Wash Washing Machine: వాషింగ్‌మిషిన్లు ఎంత ఆధునికంగా మారితేనేం? నీళ్ల వాడకం విషయంలో పెద్దగా సాధించిందేమీ లేదు. చెంచాడు మురికిని వదిలించటానికి సుమారు 100 లీటర్ల నీటిని తీసుకుంటాయి. ఇది వ్యర్థ జలంగానే మారుతుంది. దుస్తులు శుభ్రం కావటానికి వాడే సబ్బు పొడులు, ద్రవాల్లోని రసాయనాలతో కూడిన ఈ నీరంతా మురికి కాల్వల్లోకే చేరుకుంటుంది. అక్కడ్నుంచి అది చివరికి చెరువులు, నదుల్లోనే కలుస్తుంది. పర్యావరణానికీ హాని చేస్తుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ 80వాష్ రూపొందించిన వాషింగ్‌మిషిన్ చక్కటి పరిష్కారం చూపుతుంది. తక్కువ నీటితో.. కేవలం కప్పు నీటితోనే ఐదు దుస్తులను ఉతికేస్తుంది. అదీ సబ్బు అవసరం లేకుండానే.. అతి తక్కువ సమయంలోనే! కేవలం 80 సెకన్లలోనే దుస్తులను ఉతికి పెడుతుంది. మురికి ఎక్కువగా ఉంటే ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది.
80 వాష్ సంస్థను రూబుల్ గుప్తా, నితిన్ కుమార్ సలుజా, వరిందర్ సింగ్ ఆరంభించారు. వీరి వినూత్న ఆలోచనతో రూపుదిద్దుకున్న వాషింగ్‌మిషిన్ ఒకవైపు నీటిని ఆదా చేస్తూనే.. మరోవైపు సబ్బు రసాయనాల కాలుష్యాన్ని నివారిస్తుంది. ఇలా ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నమాట. ఇంతకీ ఈ కొత్తరకం వాషింగ్‌మిషిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా? స్టీమ్ టెక్నాలజీ ఆధారంగా. ఇది తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీతో కూడిన మైక్రోవేవ్ పరిజ్ఞానం సాయంతో బ్యాక్టీరియాను చంపుతుంది. దుస్తులను మాత్రమే కాదు.. లోహ వస్తువులను, పీపీఈ కిట్లనూ శుభ్రం చేస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉత్పత్తి అయ్యే పొడి ఆవిరి సాయంతో దుస్తుల మీద దుమ్ము, ధూళితో పాటు రంగు మరకలనూ పోగొడుతుంది. 7-8 కిలోల సామర్థ్యం గల మిషిన్ ఒకసారి ఐదు దుస్తులను ఉతుకుతుందని 80వాష్ సంస్థ చెబుతోంది. మొండి మరకలైతే మరోసారి ఉతకాల్సి ఉంటుంది. సుమారు నాలుగైదు సార్లు ఉతికితే మొండి మరకలు పోతాయి. అదే 70-80 కిలోల సామర్థ్యం గల పెద్ద మిషిన్‌తోనైతే ఒకేసారి 50 దుస్తులను ఉతుక్కోవచ్చు. దీనికి 5-6 గ్లాసుల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం ఈ వాషింగ్‌మిషిన్‌ను ప్రయోగాత్మక పరీక్షల కోసం మూడు పట్టణాల్లో ఏడు చోట్ల అమర్చారు. హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.200 చొప్పున వసూలు చేస్తూ దుస్తులు ఉతుక్కోవటానికి అనుమతిస్తున్నారు కూడా.