5G services India: దేశీయంగా టెలికాం రంగంలో నూతన శకం ప్రారంభం కానుంది. 2022లో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతా, ముంబయి, చండీగఢ్, దిల్లీ, జామ్‌నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లఖ్‌నవూ, పుణె, గాంధీనగర్ సహా పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలను తొలుత అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్) తెలిపింది. దిగ్గజ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది.
దేశంలో 5జీ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం సంస్థలు, మొబైల్ తయారీ కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. 5జీ టెక్నాలజీ అభివృద్ధి, పరీక్షించడం కోసం పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసింది టెలికాం విభాగం. స్వదేశీ 5జీ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్‌గా పిలిచే పరిశోధనా సంస్థలో ఐఐటీ దిల్లీ, ఐఐటీ బొంబయి, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పుర్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు సహా మరో రెండు టెక్ పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రూ.224 కోట్లు ఖర్చు చేసినట్లు డాట్ తెలిపింది.