Ways to keep your Computer from Slowing Down: మనుషులతో పాటు గ్యాడ్జెట్లు కూడా కాలం గడిచేకొద్దీ నెమ్మదిస్తుంటాయి. అయితే వృద్ధాప్యంలోని ప్రతికూల ప్రభావాలు మీ కంప్యూటర్‌పై పడకుండా.. సాఫీగా పనిచేసేలా మార్చేందుకు వీలుంది. క్రమం తప్పకుండా పాటించే ఈ టిప్స్‌తో అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి.. కాలంతో పాటు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ స్లో అవడం మాములే అని భావిస్తూ కూర్చోకండి. ఈ 5 మార్గాలను పాటించండి.
1. ఇన్స్టాల్ చేసిన యాప్‌లను ఎప్పటికప్పుడు సమీక్షించాలి..
ప్రకాశవంతమైన కొత్త కంప్యూటర్‌కు, నిదానంగా పనిచేసే పాతదానికి తేడా మనం అందులో లోడ్ చేసిన అప్లికేషన్లే. ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్‌లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలి. ఒకసారి ఇన్స్టాల్ అయినంత మాత్రాన అవి చివరివరకు హార్డ్డ్రైవ్లోనే ఉండాలని లేదు. తరచుగా వాడే అప్లికేషన్లను గుర్తించి మిగిలినవాటిని తొలగించాలి. అవసరమైతే తర్వాత వాటిని రీఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
2. మిగిలిన స్టోరేజీపై ఓ కన్నేయండి..
మెషీన్ నెమ్మదించడానికి మరో కారణం.. అది పనిచేయడానికి అవసరమైన స్టోరేజీ ఖాళీగా లేకపోవడం. అందుకోసం అనవసరమైన యాప్‌లను తొలగించడం సహా హార్డ్‌డ్రైవ్‌లో తగినంత స్టోరేజీ ఉండేలా చూసుకోవాలి. కనీసం 20శాతం ఫ్రీగా ఉంటే మంచిది.
3. ప్రోగ్రామ్‌లు హద్దు దాటకుండా..
చాలా ప్రోగ్రామ్‌లు వాటిలోని డీఫాల్ట్ సెట్టింగ్స్ వల్ల ఇన్స్టాల్ చేయగానే వాటికి నచ్చింది చేస్తుంటాయి. కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు మన అనుమతి లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. ఇలా నడిచే యాప్‌ల సంఖ్య పరిమితంగా ఉంటే మేలు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని ఎక్కువ యాప్‌లు పనిచేస్తుంటే.. మెషీన్ అంత నెమ్మదిస్తుంది.
విండోస్‌లో ఏ యాప్‌లు తమ పరిధిని అధిగమిస్తున్నాయో చూడటానికి, టాస్క్‌బార్‌లోని ఖాళీ భాగంపై రైట్-క్లిక్ చేసి, టాస్క్ మేనేజర్ ఆపై మరిన్ని వివరాలను ఎంచుకోవాలి. MacOSలో, Cmd + స్పేస్‌ని టైప్ చేయడం ద్వారా స్పాట్‌లైట్‌ని ఉపయోగించి, యాక్టివిటీ మానిటర్‌ని ప్రారంభించాలి.
ఈ యాప్‌లు ఆటోమేటిక్‌గా రన్ కాకుండా ఉండాలంటే..
- ముందుగా ఒకసారి యాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్‌లో అందుకు సంబంధిన ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి.
- యాప్‌లో ఆ సదుపాయం లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా చేసుకోవచ్చు. విండోస్‌లో టాస్క్ మేనేజర్‌లోని స్టార్ట్-అప్ ట్యాబ్‌కు వెళ్లాలి. macOSలో Users & Groupsకి వెళ్లి ఆపై System Preferencesలో ఆ ఐటెమ్‌లను లాగిన్ చేయాలి.
4. ప్రోగ్రామ్‌లు చిన్నగా, ఆరోగ్యకరంగా..
యాప్‌లను ఎప్పటికప్పుడు అప్ టు డేట్‌గా ఉంచడం వల్ల బగ్స్, భద్రతాపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. మరీ ముఖ్యంగా యాప్‌లు వేగంగా పనిచేసేందుకు ఇది ఉపకరిస్తుంది. చాలా వరకు ప్రోగ్రామ్‌లు ఆటోమెటిక్‌గా అప్డేట్ అవుతుంటాయి. అయినా ఒకసారి లేటెస్ట్ వెర్షన్ల కోసం చూడటం మేలు. అలాగే కొనసాగుతున్న అనవసరమైన యాడ్ఆన్లు, సాఫ్ట్వేర్ల పాత వెర్షన్లు, ఇన్స్టాలేషన్ ప్యాకేజీలను తొలగిస్తూ ఉండాలి.
5. ఎప్పటికప్పుడు రీసెట్ చేయడం..
మీ ప్రోగ్రామ్లలానే విండోస్, MacOS కూడా ఎల్లవేళలా అప్ టు డేట్ పెట్టుకోవాలి. Windows Settingsలో Update & Security, లేదా macOS System Preferencesలో Software Update ద్వారా మీ ఓఎస్ లేటెస్ట్ వెర్షన్లోనే ఉందో లేదో చూసుకోవాలి. ఇవి కాకుండా కంప్యూటర్ను తరచుగా రీసెట్ చేస్తుండాలి. అందుకోసం మీ ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకొని, తర్వాత ప్రోగ్రామ్స్‌ను రీఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ సులువే అయినా కొద్దిగా సమయం తీసుకుంటుంది. కానీ, అనవసరమైన సాఫ్ట్వేర్లను తొలగించి సిస్టమ్ క్లీన్‌గా ఉంచడానికి ఎంతో ఉపకరిస్తుంది.
ఇదీ చూడండి:కొత్త కంప్యూటర్ కొన్నారా? ఈ యాప్స్ ఉండాల్సిందే...