సన్నిహితుల జీవితాలను డిజిటల్ సహాయంతో నియంత్రించాలని కొంత మంది ప్రయత్నిస్తుంటారు. దాని కారణంగా దేశంలో సుమారు 4,627 మంది మొబైల్ యూజర్స్ స్టాకర్వేర్ బాధితులుగా మారారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో లాక్డౌన్ విధించకముందు ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. లాక్డౌన్లలో అందరూ ఇళ్లకే పరిమితమైన కారణంగా ఈ సంఖ్య ప్రస్తుతం కొంత తగ్గిందని అధ్యయనం అభిప్రాయపడింది.
ఏంటీ స్టాకర్వేర్..
స్టాకర్వేర్ అనేది గృహహింసకు వాడుతున్న ఒక సర్వెలెన్స్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ యాప్స్ సాధారణంగా మారుపేర్లతో ఉంటాయి. ఇతరుల మొబైల్స్‌లోని మెసేజ్‌లు, కాల్స్ వివరాలు, లొకేషన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునేందుకు అనుమానాస్పద వ్యక్తులు వీటిని ఉపయోగిస్తారని సైబర్ సెక్యురిటీ సంస్థ కాస్పెర్స్కీ స్పష్టం చేసింది.
2020లో 53,870 మొబైల్ యూజర్లు స్టాకర్వేర్ బాధితులుగా ఉన్నారు. 2019లో 67,500 మంది దీని బారిన పడ్డారు. 2020 మార్చి నుంచి జూన్ వరకు దీని బాధితుల సంఖ్య బాగా తగ్గింది. కానీ లాక్డౌన్లు ఎత్తివేసిన తర్వాత అది పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని కాస్పెర్స్కీ సంస్థ తెలిపింది.
స్టాకర్వేర్ బారిన పడిన మొబైల్ యూజర్స్ ప్రస్తుత గణాంకాల కన్నా చాలా ఎక్కువగా ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ బారినపడ్డ కొత్త శాంపుల్స్‌ను ప్రతిరోజూ మేము కనుగొంటున్నాము. ప్రస్తుతం బయటపడ్డ గణాంకాలలో ప్రతి సంఖ్య వెనుక ఒక జీవితం ఉంటుంది. సహాయం కోసం కొన్నిసార్లు సైలైంట్ కాల్స్ వస్తుంటాయి.