కట్లెట్
కావాల్సినవి:ఉడికించిన కార్న్ గింజలు- రెండు కప్పులు, జీలకర్ర, కారం, ధనియాల పొడి, గరంమసాలా- చెంచా చొప్పున, పసుపు- అర చెంచా, చాట్ మసాలా- రెండు పెద్ద చెంచాలు, బ్రెడ్‌పొడి- అర కప్పు, తరిగిన ఉల్లిపాయలు- రెండు, అల్లం తరుగు- చెంచా, తరిగిన పచ్చిమిర్చి- మూడు, నిమ్మరసం- చెంచా, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా.
తయారీ:పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేయాలి. వేడయ్యాక జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత కార్న్‌ను కలపాలి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం, గరంమసాలా, ఉప్పు వేయాలి. మొక్కజొన్న గింజలకు మసాలాలు పట్టేలా ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో వేసుకోవాలి. దీంతోపాటు చాట్ మసాలా, నిమ్మరసం, బ్రెడ్ పొడి కూడా కలిపి బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని కట్లెట్‌లా చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు.
ఫ్రాంకీ
కావాల్సినవి:మైదా- ఒకటిన్నర కప్పు, ఉడికించిన కార్న్ గింజలు- కప్పు, ఉడికించి మెదిపిన ఆలూ- మూడు, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తురుము- పెద్ద చెంచా చొప్పున, పెద్దక్యాప్సికమ్- ఒకటి, టొమాటో కెచప్- రెండు పెద్ద చెంచాలు, పండుమిర్చి కెచప్, ధనియాల పొడి, కారం- పెద్ద చెంచా చొప్పున, పసుపు, ఆమ్‌చూర్ పొడి, గరంమసాలా-అర చెంచా చొప్పున, నూనె- పెద్ద చెంచా, నెయ్యి- అర కప్పు, చీజ్- 50 గ్రా., కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు-తగినంత.
తయారీ: గిన్నెలో పిండి, ఉప్పు వేసి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. ఈ ముద్దపై నూనె రాసి కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు చపాతీల్లా చేసి పెనంపై సగం వరకు కాల్చుకుని పక్కన పెట్టాలి.
మరో పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో కెచప్, పండుమిర్చి కెచప్, ధనియాల పొడి, పసుపు, ఆమ్‌చూర్ పొడి, గరంమసాలా వేసి నిమిషం బాగా కలపాలి. ఇందులోనే ఉడికించిన ఆలూ, కార్న్ గింజలను వేసి మరోమారు బాగా కలిపి కాసేపు ఉడికించాలి. కొత్తిమీర వేయాలి. పొయ్యి మీద పాన్ పెట్టి చపాతీ వేసి రెండు వైపులా నెయ్యితో కాల్చాలి. దీంట్లో కార్న్‌మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, కాస్తంతా ఫ్రాంకీ మసాలా వేసి, వెనిగర్ చిలకరించాలి. చివరగా.. తురిమిన పనీర్ వేసి ఫ్రాంకీలా చుడితే సరి..
క్రిస్పీ కార్న్
కావాల్సినవి:ఉడికించిన కార్న్- రెండు కప్పులు, కార్న్‌ఫ్లోర్- మూడు పెద్ద చెంచాలు, బియ్యప్పిండి- పెద్ద చెంచా, కారం- చెంచా, చాట్ మసాలా- అర చెంచా, ఉల్లికాడలు- రెండు చెంచాలు, తరిగిన క్యాప్సికం- అర ముక్క, నిమ్మరసం- రెండు చెంచాలు, మిరియాల పొడి- అర చెంచా, ఉప్పు, నూనె- తగినంత, నీళ్లు- కాసిన్ని.
తయారీ:గిన్నెలో ఉడికించిన మొక్కజొన్న గింజలు, ఉప్పు, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. నీళ్లు చల్లి పొడులన్నీ గింజలకు పట్టేలా చేత్తో చక్కగా కలిపి పక్కన పెట్టాలి.
ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేడిచేయాలి. దీంట్లో తయారుచేసి పెట్టుకున్న కార్న్ గింజలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఓ గిన్నెలోకి తీసుకుని కారం, చాట్ మసాలా, ఉప్పు, ఉల్లికాడల తరుగు, క్యాప్సికం ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే రుచికరమైన క్రిస్పీ కార్న్ రెడీ.