తెలంగాణ

telangana

ETV Bharat / priya

పప్పు రుచి మారిందోచ్‌.. ట్రై చేస్తే అదురునోచ్! - dal verities

భోజనంలో కూర ఉన్నా లేకపోయినా పప్పు మాత్రం తప్పనిసరిగా ఉండాలంటారు కొందరు. అలాగని తరచూ ఆకుకూరో, టొమాటోనో వేసి పప్పు వండినా నచ్చదు. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే రోజుకో రకం పప్పును అదీ కాస్త మసాలా దట్టించి వండితే సరి.

verity dishes with lentils will help to improve your health
పప్పు రుచి.. మారిందోచ్‌.

By

Published : Sep 13, 2020, 3:55 PM IST

వంకాయ పప్పు

కావలసినవి:

కందిపప్పు: అరకప్పు,సెనగపప్పు: పావుకప్పు,వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, ఉల్లిపాయ:ఒకటి, టొమాటో:ఒకటి, వంకాయలు: మూడు,కారం:ముప్పావుచెంచా, దనియాలపొడి: అరచెంచా, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర:కట్ట,నూనె:అర టేబుల్‌స్పూను,ఆవాలు: పావుచెంచా, మినప్పప్పు: అరచెంచా, జీలకర్ర: పావుచెంచా, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ,ఇంగువ: కొద్దిగా, మిరియాలపొడి:అరచెంచా,చింతపండురసం: రెండు చెంచాలు.

తయారీ విధానం:

సెనగపప్పు, కందిపప్పు, వెల్లుల్లిని కుక్కర్‌లో వేసి... రెండు కప్పుల ళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, టొమాటో, వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, ధనియాలపొడి, కారం వేసి బాగా కలపాలి. వంకాయ ముక్కలు మెత్తగా అయ్యాక చింతపండు రసం, మిరియాలపొడి, ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేయాలి.

బీరకాయ హుళీ

కావలసినవి:

కందిపప్పు:కప్పు, బీరకాయ: ఒకటి పెద్దది, బెల్లం తరుగు: చెంచా,చింతపండు గుజ్జు: రెండు టేబుల్‌స్పూన్లు,పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత.నెయ్యి:టేబుల్‌స్పూను,ఆవాలు: చెంచా, ఇంగువ: చిటికెడు, కరివేపాకు రెబ్బలు:రెండు.

మసాలా కోసం:

నూనె: చెంచా,సెనగపప్పు:టేబుల్‌స్పూను, మినప్పప్పు: టేబుల్‌స్పూను, దనియాలు: రెండు చెంచాలు,దాల్చినచెక్క: ఒక ముక్క,లవంగాలు: అయిదు,గసగసాలు: చెంచా,కొబ్బరితురుము: పావుకప్పు, ఎండుమిర్చి: అయిదు.

తయారీ విధానం:

ముందుగా మసాలా తయారుచేసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి కొబ్బరితురుము తప్ప మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక కొబ్బరితురుముతో పాటూ అన్నింటినీ మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పు, బీరకాయ ముక్కల్ని కుక్కర్‌లో వేసి సరిపడా నీళ్లు పోసి మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. తరువాత స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి పప్పు వేయాలి. ఇందులో ముందుగా చేసుకున్న మసాలా, పసుపు తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు, బెల్లం తరుగు వేసి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.

మసాలా దాల్‌

కావలసినవి:

పెసరపప్పు, ఎర్రకందిపప్పు, మినప్పప్పు, కందిపప్పు: అన్నీ కలిపి కప్పు, ఉప్పు: తగినంత, నెయ్యి: టేబుల్‌స్పూను, ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, టొమాటోముక్కలు: అరకప్పు, కొత్తిమీర: కట్ట.

మసాలా కోసం: వెల్లుల్లి రెబ్బలు:మూడు, దనియాలు: చెంచా, జీలకర్ర:అరచెంచా, పసుపు: పావుచెంచా,ఎండుమిర్చి: నాలుగు, అల్లం: చిన్నముక్క, లవంగాలు: రెండు, మిరియాలు: అరచెంచా.

తయారీ విధానం:

ముందుగా పప్పులన్నింటినీ కడిగి కుక్కర్‌లో వేసి రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. తరువాత టొమాటోముక్కలు వేసి వేయించి, కొద్దిగా నీళ్లు పోయాలి. టొమాటో ముక్కలు ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు, ముందుగా చేసిపెట్టుకున్న మసాలా వేసి బాగా కలిపి ఉడికించుకున్న పప్పు వేయాలి. అయిదు నిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేయాలి.

ధాబా దాల్‌

కావలసినవి:

కందిపప్పు: అరకప్పు,సెనగపప్పు:అరకప్పు,నీళ్లు: మూడు కప్పులు,పసుపు: అరచెంచా, బిర్యానీఆకు: ఒకటి, దాల్చినచెక్క: చిన్నముక్క, నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు,జీలకర్ర: చెంచా, ఉల్లిపాయ:ఒకటి, టొమాటోలు: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, కారం: చెంచా, దనియాలపొడి:అరచెంచా, గరంమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, ఆమ్‌చూర్‌పొడి: అరచెంచా, ఇంగువ: చిటికెడు, ఎండుమిర్చి:రెండు.

తయారీ విధానం:

రెండు పప్పుల్ని కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి అయిదు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బిర్యానీఆకు, దాల్చినచెక్క, జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయముక్కలు, టొమాటో ముక్కలు వేయాలి. అన్నీ వేగాక తగినంత ఉప్పు, పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా, ఆమ్‌చూర్‌పొడి, ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి బాగా కలిపి పప్పు ఉడుకుతున్నప్పుడు దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు, చపాతీల్లోకీ బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details