మామిడికాయలు వేసవిలోనే వస్తాయి. అందుకనే వాటిని ఒరుగుల రూపంలో ఎండబెట్టుకుని ఏడాది పొడవునా వాడుకుంటుంటారు. అలాగే ఇతర కూరగాయలకి కాస్త మామిడికాయ రుచి తగిలితే బాగుంటుందీ అనుకునేవాళ్లు ఎండబెట్టి చేసిన పొడినీ వాడతారు. జ్యూస్ కావాలనుకుంటే పండ్ల గుజ్జుతో చేసిన స్క్వాష్‌ని కలుపుకుంటారు. కానీ ఇప్పుడు కేవలం ఒక్క మామిడి కాయా పండూ మాత్రమే కాదు, పనస పండు నుంచి పచ్చిమిర్చి వరకూ అన్ని రకాల పండ్లనీ కూరగాయల్నీ పొడి చేసి అమ్మేస్తున్నారు. చివరకు చెరకురసాన్నీ, కొబ్బరినీళ్లనీ, మజ్జిగనీ సైతం పొడి రూపంలోకి మార్చేస్తున్నారు.
ఆయా పండ్లూ కూరగాయల్లోని పోషకాల్నీ రుచినీ అన్ని కాలాల్లోనూ ఆస్వాదించడంతోపాటు నిల్వచేసుకుని వాడుకోగలిగే సౌలభ్యం ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు పనస, మామిడి, సీతాఫలం వంటి పండ్లు ఏడాది పొడవునా ఉండవు. కానీ వాటిని తినాలనో ఆ ఫ్లేవర్ కావాలనో అనిపిస్తుంది. అదే ఆ పొడి ఉంటే నీళ్లలో కలిపి చిటికెలో జ్యూస్ చేసుకోవచ్చు. ఐస్‌క్రీమ్, కుకీ, స్మూతీ, డెజర్ట్‌ల తయారీలో వాడుకోవచ్చు. పండ్ల మాదిరిగానే కూరగాయలన్నీ కూడా అన్నిచోట్లా అన్ని కాలాల్లోనూ దొరకవు. బెర్రీలూ చెర్రీలూ నేరేడూ వంటి పండ్లూ, ఆకుకూరలూ, టొమాటో.. వంటివి రవాణాలో దెబ్బతింటాయి. అదీ ఇదీ అని లేకుండా పండ్లూ కాయగూరలూ ఆకుకూరలూ మైక్రోగ్రీన్సూ... ఇలా అన్నింటినీ పొడి కొట్టేస్తున్నారు.
ఎలా చేస్తారు?
పండ్లలోని నీరంతా ఆవిరైపోయేలా ఫ్రీజ్ డ్రై చేసి, పొడి చేసే విధానాన్ని మొదట స్పెయిన్‌లో వాడారట. ఈ పద్ధతి వల్ల వాటిల్లోని పోషకాలన్నీ యథాతథంగా ఉండటమే కాదు, యాంటీఆక్సిడెంట్ల శాతం తగ్గకుండానూ ఉంటుందట. పైగా పొడి రూపంలోని పండునీ కూరగాయనీ ఏ ఆహారపదార్థం మీదయినా నేరుగా చల్లుకుని తినొచ్చు. పాలకూర, తోటకూర, బచ్చలి, ఆలూ, టొమాటో, క్యారెట్, బీట్‌రూట్, మునగ... వంటి ఆకుకూరలూ, కూరగాయలతోపాటు పుట్టగొడుగుల్నీ పొడి చేసేస్తున్నారు. ఆపిల్, పుచ్చ, ద్రాక్ష, బొప్పాయి, చెర్రీ, స్ట్రాబెర్రీ, కమలా, మామిడి, పైనాపిల్... ఇలా పండ్ల లిస్టయితే చాలానే ఉంది. అంతేకాదు, కొన్ని రకాల ఆకుకూరలూ మూలికలూ కూరగాయలూ కలిపి పొడి చేస్తున్నారు. గ్రీన్ పౌడర్స్‌గా పిలుస్తోన్న వీటిని కొంచెంగా తీసుకున్నా అన్ని పోషకాలూ ఏకకాలంలో అందుతాయట. ఉదాహరణకు క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, కేల్... వంటివి కలిపి చేసిన పొడి హార్మోన్ అసమతౌల్యాన్ని పోగొడుతుందట. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ సమస్యలకి ఇది మేలని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి కారప్పొడుల రూపంలో కరివేపాకు, కొత్తిమీర, మునగాకు, పుదీనా... వంటి ఆకుల్ని పొడిచేసి వాడుకోవడం మనదగ్గర పూర్వకాలం నుంచీ వాడుకలో ఉంది. అయితే ఇప్పుడు వాటిల్లోని పోషకాలు ఏమాత్రం దెబ్బతినకుండా శీతలీకరణ పద్ధతుల్లో ఆరబెట్టి పొడి చేస్తున్నారన్నమాట. కొన్ని కంపెనీలు ఈ పొడుల్ని సప్లిమెంట్లగానూ తయారుచేస్తున్నాయి.