ఇమ్యూనిటీని పెంచే నైవేద్యాలతో మనం కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడటమే కాదు, ఆ పార్వతీ తనయుడి ఆశీస్సులు కూడా అందుకోవచ్చు. మరి, రోగనిరోధక శక్తిని పెంచే ఆ పిండి వంటలేంటో, వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..
క్యారట్ మఖానా ఖీర్
కావాల్సినవి
- బాదం పాలు - 2 కప్పులు
- ఓట్స్ - 4 టేబుల్ స్పూన్లు (దోరగా వేయించి పెట్టుకోవాలి)
- కిస్‌మిస్ - 1 టేబుల్ స్పూన్
- క్యారట్ తురుము - 4 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి - పావు టీస్పూన్
- మఖానాలు (తామర గింజలు) - గుప్పెడు
- బెల్లం పొడి - 4 టేబుల్ స్పూన్లు
- బాదం ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
తయారీ
- ముందుగా స్టౌ మీద ప్యాన్ పెట్టుకొని అందులో బాదం పాలు పోసి ఒక ఉడుకు రానివ్వాలి.
- ఇప్పుడు ఇందులో ఓట్స్, క్యారట్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై యాలకుల పొడి వేసి మరోసారి కలుపుకోవాలి.
- పాలు మరుగుతున్న సమయంలో మఖానాలు వేసి పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలి.
- ఆ తర్వాత బెల్లం పొడి, బాదం ముక్కలు వేసి మిశ్రమం చిక్కపడేంత వరకూ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.
- ఐదు నిమిషాలయ్యాక సర్వింగ్ బౌల్ లేదా గ్లాస్‌లోకి తీసుకొని డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకుంటే సరి!
క్వినోవా ఆల్మండ్ డేట్ టఫుల్స్ క్వినోవా ఆల్మండ్ డేట్ టఫుల్స్
కావాల్సినవి
- క్వినోవా - 1/3 కప్పు
- బాదం పప్పులు - అరకప్పు
- బాదం తురుము - పావు కప్పు
- డేట్స్ - 16
- పీనట్ బటర్ లేదా ఏదైనా బటర్ - 3 టేబుల్ స్పూన్లు
- డార్క్ చాక్లెట్ చిప్స్ - అరకప్పు
తయారీ
- ముందుగా క్వినోవాను బాగా కడిగి దానికి ముప్పావు కప్పు నీళ్లు కలిపి కుక్కర్‌లో నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- ఆపై కుక్కర్ ప్రెషర్ పోయేంతవరకు దాన్ని పక్కన పెట్టేయాలి.
- ఆ తర్వాత బాదం పప్పులు, డేట్స్, పీనట్ బటర్, చాక్లెట్ చిప్స్, ఉడికించిన క్వినోవా.. వీటన్నింటినీ మిక్సీ జార్‌లోకి తీసుకొని ముద్దగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని బాదం తురుములో దొర్లించాలి. అంతే.. రుచికరమైన, ఆరోగ్యకరమైన క్వినోవా ఆల్మండ్ డేట్ టఫుల్స్ రడీ!
గుర్ సందేశ్
కావాల్సినవి
- పనీర్ - కప్పు
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- బెల్లం - 1/3 కప్పు
- పిస్తా పప్పు తురుము - టేబుల్ స్పూన్
- యాలకుల పొడి - టీస్పూన్
తయారీ
- ముందుగా పనీర్‌ని సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి అది కరిగాక బెల్లం వేసి కరిగించుకోవాలి. ఇది కాస్త చిక్కపడ్డాక అందులో పనీర్ వేసి బాగా కలుపుకోవాలి.
- ఈ మిశ్రమం చిక్కపడేదాకా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి.
- ఆఖర్లో యాలకుల పొడి వేసి మరోసారి కలుపుకొని స్టౌ కట్టేయాలి.
- పది నిమిషాలయ్యాక ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన మౌల్డ్స్‌లో వేసుకొని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
- వినాయకుడికి నైవేద్యం పెట్టే ముందు పిస్తా పప్పు తురుముతో గార్నిష్ చేసుకోవాలి.
కొబ్బరి-బెల్లం కుడుములు
కావాల్సినవి
- బియ్యప్పిండి - ఒక కప్పు
- కొబ్బరి తురుము - ఒక కప్పు
- యాలకుల పొడి - పావు టీస్పూన్
- ఉప్పు - ముప్పావు టీస్పూన్
- బెల్లం పొడి - ఒక కప్పు
- నువ్వుల నూనె - అర టీస్పూన్
- నెయ్యి - టేబుల్‌స్పూన్
తయారీ
- ముందుగా ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి కొబ్బరి తురుమును దోరగా వేయించాలి.
- మరో ప్యాన్ తీసుకుని అందులో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి సన్నటి మంటపై ఉంచాలి.
- కాసేపయ్యాక బెల్లం చిక్కగా మారి పాకంలా తయారవుతుంది. ఆ సమయంలో ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కలపాలి.
- ఈ మిశ్రమాన్ని మీడియం మంటపై ఉంచి పదే పదే కలుపుతుండాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి యాలకుల పొడిని జత చేసి మరోసారి కలపాలి.
- కొన్ని సెకన్ల తర్వాత మంటను ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారాక వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి.
- ఆలోపు ఒక గిన్నెలో బియ్యప్పిండిని తీసుకుని అందులో ఒక కప్పు వేడి నీళ్లను పోయాలి. ఆ తర్వాత నువ్వుల నూనె, ఉప్పు కూడా వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- ఆ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని కాస్త ఒత్తి.. అందులో ఇందాక తయారుచేసి పెట్టుకున్న బెల్లం- కొబ్బరి ఉండల్ని స్టఫ్ చేయాలి.
- ఇలా తయారుచేసుకున్న కుడుముల్ని ఆవిరిపై ఉడికిస్తే ఎంతో రుచికరంగా నోరూరించే కొబ్బరి- బెల్లం కుడుములు రెడీ!
డ్రైఫ్రూట్ కుడుములు
కావాల్సినవి
- బాదం పప్పులు - 12
- ఎండిన ఖర్జూరాలు - 8
- ఎండు కొబ్బరి - అర కప్పు
- నీళ్లు - ఒక టీస్పూన్
- జీడిపప్పు - 15
- ఎండుద్రాక్ష (కిస్‌మిస్) - 2 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
- బియ్యప్పిండి - కప్పు
- ఉప్పు - కొద్దిగా
తయారీ
- ముందుగా బాదం, జీడిపప్పు, కిస్‌మిస్, ఎండు కొబ్బరి.. ఇవన్నీ ప్యాన్‌లోకి తీసుకొని దోరగా వేయించాలి.
- ఆపై వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో గింజ తీసేసిన ఎండు ఖర్జూరాలు కూడా వేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని నెయ్యి వేసి, నీళ్లు పోస్తూ ముద్దలు కట్టుకునేలా కలుపుకోవాలి.
- అరచేతులకు నెయ్యి రాసుకొని.. ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి.
- మరో గిన్నెలో బియ్యప్పిండి తీసుకొని అందులో ఉప్పు వేసి వేడి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
ఈ బియ్యప్పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి కాస్త ఒత్తి మధ్యలో డ్రైఫ్రూట్స్ ముద్దను ఉంచి మూసేయాలి. ఇలా తయారుచేసుకున్న కుడుముల్ని ఆవిరిపై ఉడికిస్తే టేస్టీ టేస్టీ డ్రైఫ్రూట్స్ కుడుములు సిద్ధం!
ఇదీ చదవండి:లంబోదరుడు మెచ్చే చవితి స్పెషల్ రెసిపీస్