వినాయకచవితి రోజు ఆ విఘ్నేశ్వరుడి ఉదరాన్ని తృప్తిపరచాలంటే భారీ వంటకాలు చేయనక్కర్లేదు. గణేశుడు ఎంతో ఇష్టపడే ఉడ్రాళ్లు.. మోదక్.. అచ్చమైన అయ్యంగార్ పులిహోర.. తీపి మురుకులు నైవేద్యంగా సమర్పిస్తే చాలు ఆయన మనసు నిండిపోతుంది. కానీ, ఏటా ఒకటే స్టైల్లో చేస్తే లంబోదరుడికి బోరు కదా..! అందుకే కాస్త ట్రెండు మార్చి.. ఇలా ట్రై చేయండి..
డ్రైఫ్రూట్స్ మోదక్
కావలసినవి
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్ పలుకులు: అన్నీ కలిపి ముప్పావుకప్పు, ఖర్జూరాలు: ఎనిమిది, ఆప్రికాట్లు: ఎనిమిది, కిస్‌మిస్: పది, అంజీర్: ఆరు, నెయ్యి: రెండు చెంచాలు.
తయారీవిధానం
స్టౌమీద కడాయి పెట్టి జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్‌నట్ పలుకుల్ని వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. వేడి తగ్గాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తరువాత నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మోదక్ మౌల్డ్‌కు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో కొద్దిగా ఉంచి నొక్కినట్లు చేస్తే మోదక్ తయారైనట్లే. ఇదే విధంగా మిగిలినవీ చేసుకోవాలి.
కొబ్బరి ఉండ్రాళ్లు
కావలసినవి
బియ్యప్పిండి:అరకప్పు, నీళ్లు: ఒకటింపావు కప్పు, ఉప్పు: పావుచెంచా, నెయ్యి: రెండు చెంచాలు, పచ్చి కొబ్బరి తురుము: పావుకప్పు, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: చెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: ఒకటిన్నర చెంచా, పచ్చిమిర్చి: రెండు, ఎండుమిర్చి: రెండు, ఇంగువ: చిటికెడు, కరివేపాకు రెబ్బ: ఒకటి, నూనె: రెండు చెంచాలు
తయారీ విధానం
స్టౌమీద గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. అవి వేడిగా అవుతున్నప్పుడు పావుచెంచా నెయ్యి, ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. వేడి చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని ఇడ్లీపాత్రల్లో సర్ది ఆవిరిమీద పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె, మిగిలిన నెయ్యి వేయాలి. అవి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేయాలి. అవి వేగాయనుకున్నాక కొబ్బరితురుము వేయాలి. నిమిషం తరువాత ఆవిరిమీద ఉడికించుకున్న ఉండ్రాళ్లను వేసి బాగా కలిపి వాటికి కొబ్బరి మిశ్రమం పట్టిందనుకున్నాక దింపేయాలి.