ఉత్తరాదిన ఎక్కువగా ఇష్టపడే దాల్ మఖనీ ఒక్క సారి రుచి చూశారంటే.. రోజూ తినాలనుకుంటారు. మరింకెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దాం రండి..
కావాల్సినవి
మినుములు - ముప్పావుకప్పు, రాజ్‌మా - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, జీలకర్ర - చెంచా, పచ్చిమిర్చి - రెండు, దాల్చినచెక్క - చిన్న ముక్క, లవంగాలు - రెండు, యాలకులు - మూడు, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద - అరచెంచా, కారం - చెంచా, పసుపు - పావుచెంచా, టొమాటో గుజ్జు - ఒకటిన్నర కప్పు, తాజా క్రీం - అరకప్పు, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్‌స్పూన్లు, వెన్న - రెండు చెంచాలు.
తయారీ..
మినుములూ, రాజ్‌మాను ముందు రోజు రాత్రే నీళ్లల్లో నానబెట్టుకోవాలి. మర్నాడు ఆ నీటిని వంపేసి రెండు కప్పుల నీళ్లూ, కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్‌లో తీసుకుని ఏడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. తరవాత నీళ్లు వంపేయాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి వెన్న కరిగించి జీలకర్ర వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చి ముక్కలూ, దాల్చినచెక్కా, లవంగాలూ, యాలకులూ, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. రెండుమూడు నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి ముద్దా, కారం, పసుపూ, టొమాటో గుజ్జు వేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. కాసేపటికి అన్నీ ఉడుకుతాయి. అప్పుడు ఉడికించుకున్న మినుములూ, రాజ్‌మా, కొద్దిగా ఉప్పు, కారం వేయాలి. ఇది దగ్గరకు అయ్యాక క్రీం కలిపి దింపేసి, పైన కొత్తిమీర వేస్తే చాలు.
ఇదీ చదవండి:ఔరా: అగ్గిపుల్లలతో అందమైన తాజ్మహల్