హయగ్రీవ పాయసం లేదా సెనగల పాయసం కోసం పెద్దగా శ్రమ పడనక్కర్లేదు. చెప్పిన పదార్థాలన్నీ సరైన మోతాదులో వేస్తే.. హయగ్రీవ పరిమళం తినకుండానే మనసు దోచేస్తుంది. ఇక తయారీ విధానం తూ.చ తప్పకుండా పాటిస్తే.. రుచి మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది.
కావల్సినవి
చిన్న సెనగలు - కప్పు
నెయ్యి - టేబుల్ స్పూను
కొబ్బరి ముక్కలు
జీడిపప్పు పలుకులు - పావుకప్పు చొప్పున
పాలు, కొబ్బరిపాలు - కప్పు చొప్పున
కొబ్బరి తురుము - పావుకప్పు
బియ్యప్పిండి - టేబుల్‌స్పూను
బెల్లం తురుము - కప్పు
యాలకులపొడి - చెంచా
పాలు - టేబుల్‌స్పూను
తయారీ విధానం
సెనగల్ని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు నీళ్లు వంపేసి మరీ మెత్తగా కాకుండా ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నెయ్యి కరిగించి జీడిపప్పు, కొబ్బరి ముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి సెనగల ముద్ద వేసుకుని వేయించుకోవాలి. రెండు నిమిషాల తరవాత పాలు పోసి మంట తగ్గించాలి. అది ఉడికిందనుకున్నాక బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం కరిగేలోగా.. విడిగా తీసిపెట్టుకున్న టేబుల్‌స్పూను పాలల్లో బియ్యప్పిండి వేసి కలపాలి. బెల్లం కరిగాక పాలు కలిపిన బియ్యప్పిండిని వేసేయాలి. కాసేపటికి పాయసం చిక్కగా అవుతుంది. అప్పుడు కొబ్బరి తురుము, కొబ్బరిపాలు, యాలకులపొడి, వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు పాయసంలో వేసి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి.
ఇదీ చదవండి:'పల్లెటూరి చేపల పులుసు' రుచి అదుర్సు!